
– -సౌకర్యాలు అసలే లేవు
– సమ్మె నోటీస్ ఇచ్చిన స్పందించడం లేదు
– సమస్యల పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్ఠీకరణ
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు సోమవారం మెడికల్ కళాశాల ఎదుట నిరవధిక సమ్మె ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎస్ కే. అబ్దుల్ సమాద్, జనరల్ కార్యదర్శి డాక్టర్ గగన్ మాట్లాడుతూ గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి ప్రతినెలా స్టైపెండ్ చెల్లింపు, సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్లకు రూ.1.25 లక్షల గౌరవవేతనం, వైద్యకళాశాలలో పెంచిన 15 శాతం సీట్లలో ఏపీ విద్యార్థులకు అవకాశం ఇవ్వకూడదని, వైద్యులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సమస్యలను పరిష్కరించాలని కోరుతూ
ఈ నెల 18న సమ్మె నోటీసు ఇచ్చినా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. దీంతో నిరవధిక సమ్మె చేపట్టి విధులు బహిష్కరించినట్లు తెలిపారు. సమ్మె నేపథ్యంలో ఓపీ సేవలు, సర్జరీలు, వార్డ్ సేవలను నిలిపివేస్తు న్నట్లు చెప్పారు. అత్యవసర సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. మెడికల్ కళాశాలలో సౌకర్యాలు లేవని, మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలని, విద్యార్థుల కోసం బస్సు సౌకర్యం కల్పించాలని , కళాశాల, హాస్టల్లో త్రాగునీటి సదుపాయం లేదని పేర్కొన్నారు. చదువుకోడానికి కనీసం లైబ్రరీ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త కళాశాల భవనాన్ని ప్రారంభించి జూలై నెలలోనే లైబ్రరీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పిన అధికారులు నేడు అక్టోబర్ వరకు సమయం పట్టవచ్చు అని పేర్కొంటున్నారని ఆరోపించారు. క్యాజువాలిటీ పేషెంట్లకు ఏసీలు లేవని, పీజీ విద్యార్థులకు, హౌస్ సర్జన్లకు సరైన రూములు లేవని, శానిటేషన్, వాష్ రూమ్ లు, నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి గదులు, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం సరైన మందులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీస్ అవుట్ పోస్ట్ సిబ్బందిని నియమించాలని, ఓయూ జనరల్ ఆసుపత్రిలో కొత్త బిల్డింగు నిర్మాణం చేపట్టాలని, కాకతీయ మెడికల్ కళాశాలలో రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సమ్మె నడుస్తుందని సమస్యలు పరిష్కారమయ్యే వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సమ్మెలో టి జూడాల జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ రుత్విక్, డాక్టర్ సత్యసాయి కృష్ణ, డాక్టర్ జనని, జాయింట్ సెక్రటరీలు డా. బాలు వేమిరెడ్డి, డాక్టర్ శ్రీనిధి, డాక్టర్ శభాష్, డాక్టర్ పసిద తదితరులు పాల్గొన్నారు.
ఎమర్జెన్సీని మినహాయించి…
సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు ఎమర్జెన్సీ సేవలను మినహాయించి సమ్మెలో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. క్యాజువాలిటీ, ఐసీయూ, ఏఎంసి, లేబర్ రూమ్స్, మాత శిశు సర్జరీలు, మార్చురీ, ఎమర్జెన్సీ సర్జరీలు, అనస్థీషియ, ఆర్తో సర్జరీలను మినహాయించి అవుట్ పేషెంట్, జనరల్ వార్డులు, యాక్టివ్ సర్జరీలను బహిష్కరించి సమ్మె చేస్తున్నట్టు తెలిపారు.