యువతరం చేతిలో తీర్పు

Judgment is in the hands of the youth– రాజస్థాన్‌లో తొలిసారిగా ఓటు వేయనున్న 22.71 లక్షల మంది
– కాంగ్రెస్‌ ‘గ్యారంటీ యాత్ర’ షురూ…
జైపూర్‌ : రాజస్థాన్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య ఐదు కోట్లా 29 లక్షలకుపైగా ఉండగా, వారిలో 22 లక్షలా 71 వేల మందికి పైగా కొత్త ఓటర్లు తొలిసారిగా ఓటు వేయనున్నారు. ఈ మేరకు ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్‌ గుప్తా వివరాలను వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో పురుషుల ఓటర్లు 2 కోట్లా 74 లక్షలా 74 వేలా 849 మంది, మహిళా ఓటర్లు 2 కోట్లా 53 లక్షలా 13 వేల 458 మంది ఉన్నారని గుప్తా తెలిపారు. ఈ ఎన్నికల్లో 18 నుండి 19 ఏండ్లలోపు 22 లక్షలా 71 వేలా 647 మంది కొత్త ఓటర్లు తొలిసారిగా ఓటు వేయనున్నారని చెప్పారు. అలాగే 624 మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లుగా నమోదయ్యారని తెలిపారు. అక్టోబర్‌ 4న ఫొటో ఓటరు జాబితా తుది ప్రచురణ అనంతరం అక్టోబర్‌ 27 వరకు వచ్చిన ఫారం 6, ఫారం 8 దరఖాస్తులను పరిష్కరించి ఇంటిగ్రేటెడ్‌ ఓటరు జాబితాను ప్రచురించామని, అందులో 100 శాతం ఓటర్ల ఫొటోలు ముద్రించామని గుప్తా తెలిపారు.
నామినేషన్‌ రద్దుతో టవర్‌ ఎక్కి…
దౌసా జిల్లాలో ఓ అభ్యర్థి టవర్‌ ఎక్కాడు. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దౌసా జిల్లా బాస్‌-గుధ్లియా గ్రామంలో వినోద్‌ సైనీ అనే అభ్యర్థి నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి రద్దు చేశారు. దీంతో ఆయన టవర్‌ ఎక్కాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతడికి వివరించి, అరెస్టు చేసి ఎన్‌రోల్‌మెంట్‌ కార్యాలయానికి తరలించారు.