ఏపీకి విద్యుత్‌ బకాయిల కేసులో తీర్పు రిజర్వు

Judgment reserved in AP electricity dues case– ముగిసిన వాదనలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఏపీకి విద్యుత్‌ బకాయిలు చెల్లించాలని తెలంగాణకు కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేసిన కేసులో హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వు చేస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి ఆలోక్‌ ఆరాదే, జస్టిస్‌ ఎన్‌ వి.శ్రవణ్‌ కుమార్‌ల డివిజన్‌ బెంచ్‌ ప్రకటించింది. ఏపీకి విద్యుత్‌ బకాయిలు రూ.344178 అసలు, చెల్లించకపోవడంతో సర్‌చార్జి రూ.3315 14 కోట్లతో కలిపి మొత్తం రూ. 6756.92 కోట్లను 30 రోజుల్లో చెల్లించాలంటూ గత ఆగస్ట్‌ 20న కేంద్రం ఉత్తర్వులిచ్చింది. దీనిని తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ విద్యుత్‌ సంస్థలు హైకోర్టులో సవాల్‌ చేశాయి. గతంలో హైకోర్టు స్టే ఇచ్చింది. మంగళవారం వాదనలు పూర్తయ్యాయి. రాష్ట్రం తరఫున సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్‌, విద్యుత్తు సంస్థల తరఫున వై.రామారావులు వాదనలు వినిపిస్తూ, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 12 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడితే కేంద్రం జోక్యానికి వీల్లేదన్నారు. దక్షిణ ప్రాంత మండలిలో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. ఏపీ నుంచి తమకు బకాయిలు రావాలన్నారు. కేంద్రం పెత్తనం చేసే క్రమంలోనే ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలన్నారు. దీనిపై ఏపీ తరఫు సీనియర్‌ లాయర్‌ సీవీ మోహన్‌రెడ్డి, ఏపీ విద్యుత్తు సంస్థల తరఫున సీనియర్‌ లాయర్‌ ఎం. విద్యాసాగర్‌ ప్రతివాదన చేస్తూ గతంలో మాదిరిగా విద్యుత్‌ను తెలంగాణకు ఇవ్వాలని కేంద్రం చెప్పినట్టుగా చేశామనీ, విద్యుత్‌ బకాయిలు చెల్లించకపోవడంతో తమ విద్యుత్‌ సంస్థలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోతున్నాయని చెప్పారు. కేంద్రం చెప్పిందని 2017 వరకు ఏపీ విద్యుత్‌ సరఫరా చేసిందన్నారు. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సుందరేశన్‌ వాదిస్తూ విద్యుత్‌, బొగ్గు వంటి అంశాలపై వివాదం ఏర్పడితే కేంద్రం జోక్యం చేసుకోవచ్చునని చెప్పారు. అందుకే తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులిచ్చినట్టు చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.
16లోగా మానవ హక్కుల కమిషన్‌ చైర్మెన్‌ నియామక ప్రక్రియను వివరించండి
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మెన్‌, సభ్యుల నియామకంపై ఈ నెల 16లోగా సీఎం, విపక్ష నేతలతో కూడిన కమిటీ ఏం నిర్ణయం తీసుకున్నది చెప్పాలని హైకోర్టు కోరింది. కమిషన్‌ చైర్మెన్‌, సభ్యుల నియామకాలు చేసేలా ఉత్తర్వులివ్వాలంటూ సికింద్రాబాద్‌కు చెందిన అద్నాన్‌ మహ్మద్‌ వేసిన పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి లోక్‌ అరాదే, జస్టిస్‌ ఎన్‌. వి.శ్రవణ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. రెండు వారాల గడువిస్తే నియామకం గురించి చెబుతామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరేందర్‌ పరిషద్‌ అన్నారు. చైర్మెన్‌ పోస్టుకు 4, జ్యుడిషియల్‌ సభ్యుల పోస్టుకు 10, నాన్‌ జ్యుడిషియల్‌ సభ్యుల పోస్టుకు 64 చొప్పున అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. సీఎం, హౌం మంత్రి, ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీ పేర్లను ఎంపిక చేయాల్సి ఉందన్నారు. గడువు ఇవ్వరాదని పిటిషనర్‌ లాయర్‌ కోరారు. గత 10 నెలలుగా ప్రభుత్వం వాయిదా వేస్తూనే ఉందన్నారు. ఈసారి గడువిస్తే ఎలక్షన్‌ నోటిఫికేషన్‌ వచ్చేస్తుందన్నారు. విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేస్తున్నామనీ, అప్పటికి కమిటీ నిర్ణయాలు చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
చెంచు గ్రామాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయండి
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లోని చెంచు గ్రామాలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించే ప్రక్రియను 4 నెలల్లోగా పూర్తి చేయాలని రాష్ట్రానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ జిల్లా సంక్షేమ శాఖ చేసిన ప్రతిపాదనలు ఆమోదించలేదని పేర్కొంటూ 2005లో స్వచ్ఛంద సంస్థ శక్తి హైకోర్టులో పిటిషన్‌ వేసింది. దీచిని ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ ఆరాదే, జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌ కుమార్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ మంగళవారం విచారిచింది. పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది కె.ఎస్‌.మూర్తి వాదిస్తూ, 2005 నుంచి ఈ పిటిషన్‌ పెండింగ్‌లో ఉందనీ, ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. 2006లో ఎస్టీ, ఇతర సంప్రదాయ ఆటనీ నివాసితులు (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం రూపొందిందదని చెప్పారు. ఇది 2007 నుంచి అమల్లో ఉందన్నారు. అటవీ ప్రాంతంలో ఆవాసం ఉంటున్నవారు ఆటనీ ఉత్పత్తులను, వనరులను వినియోగించుకునేందుకు చట్టంలో అవకాశం ఉందన్నారు. అటవీ హక్కుల చట్టం అనులు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వానికి 4 నెలల గడువిచ్చిన హైకోర్టు విచారణను వాయిదా వేసింది.