న్యాయ సంస్కరణలు రాజ్యాంగ విరుద్ధం

న్యాయ సంస్కరణలు రాజ్యాంగ విరుద్ధం– ఇజ్రాయిలీ సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు
– నెతన్యాహుకు గట్టి ఎదురు దెబ్బ
టెల్‌అవీవ్‌: న్యాయవ్యవస్థ అధికారాలు, ప్రజాస్వామిక హక్కులను కాలరాసే వివాదాస్పద న్యాయ సంస్కరణలను ఇజ్రాయిల్‌ అత్యున్నత న్యాయస్థానం కొట్టి పారేసింది. ఇది నెతన్యాహుకు గట్టి ఎదురుదెబ్బ. ఈ సంస్కరణలు రాజ్యాంగ విరుద్ధమని 15 మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు సంపూర్ణ ధర్మాసనం 8-7 తేడాతో చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఇజ్రాయిల్‌కు మన దేశంలో ఉన్నట్లు లిఖిత పూర్వక రాజ్యాంగం ఏదీ లేదు. ఇజ్రాయిల్‌ ఏర్పడినప్పటి నుంచి కొన్ని నిర్దిష్టమైన బేసిక్‌ చట్టాల ఆధారంగా ప్రభుత్వ పాలన సాగుతుంది. న్యాయవ్యవస్థ పీక నులిమేసే ఈ చట్టాన్ని ఇజ్రాయిల్‌ పార్లమెంటులో సంకుచిత రాజకీయ మెజార్టీ ఆధారంగా నెతన్యాహు ప్రభుత్వం ఆమోదింపజేసుకుంది. ఇది న్యాయవ్యవ్థను బలహీన పరస్తుందని, ప్రజాస్వామ్యానికి పెను ముప్పుగా మారనుందని ప్రతిపక్షాలు, ప్రజాతంత్రవాదులు, న్యాయవాదులు దేశవ్యాపితంగా ఆందోళనలు నిర్వహించారు. ఇంతలో గాజాపై నెతన్యాహు దురాక్రమణపూరిత యుద్ధాన్ని ప్రకటించడంతో ఈ అంశం వెనక్కి పోయింది. ఈ చట్టాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు నూతన సంవత్సర ప్రారంభ రోజున తన తీర్పును వెలువరించింది. ప్రభుత్వం చేసే వాదనలకు వ్యతిరేకంగా, అనుకూలంగా న్యాయమూర్తులు అంశాల వారీ వివరణ ఇచ్చారు. శాసనాలు చేసే అధికారం పార్లమెంటుకు వుందనడంలో ఎలాంటి సందేహమూ అక్కర్లేదు. కానీ, పార్లమెంటు చేసే ఏ చట్టమైన రాజ్యాంగ స్పూర్తికి లోబడి ఉండాలి. న్యాయానికి పరిమితులు విధిస్తామంటే కుదరదు. న్యాయవ్యవస్థను శాసించే అధికారం రాజ్యాంగం ప్రకారం కీసెట్‌ (పార్లమెంటు)కు లేదు. ఈ విషయం గుర్తెరిగి వ్యవహరించాలని సుప్రీం కోర్టు ఆ తీర్పులో స్పష్టం చేసింది,. మందబలం ఉంది కదా అని సంకుచిత రాజకీయ మెజార్టీతో పౌరుల, మైనార్టీల వ్యక్తిగత స్వేచ్ఛ, హక్కులను హరిస్తామంటే కుదరదు అని నెతన్యాహుకు సుప్రీం గట్టిగా మొట్టికాయలు వేసింది. నెతన్యాహు తీసుకొచ్చిన ఈ న్యాయ సంస్కరణలు అమలులోకి రావడానికి జనవరి12వతేదీని గడువుగా విధించారు. గాజాలో ఇజ్రాయిల్‌ యుద్ధాన్ని ప్రకటించిన తరువాత నెతన్యాహు నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో న్యాయ వ్యవహారాలకు సంబంధించిన వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకూడదని సంకీర్ణ పభుత్వంలో భాగస్వామ్య పక్షాలు నిర్ణయించాయి.