భారతదేశ నూతన ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ)గా జస్టిస్ సంజీవ్ ఖన్నాను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఉత్తర్వులు జారీచేశారు. సీజేఐ డిజె చంద్రచూడ్ నవంబరు పదో తేదీన పదవీ విరమణ చేయనుండగా జస్టిస్ సంజీవ్‌ఖన్నా ఆ మరుసటి రోజు బాధ్యతలు స్వీకరిస్తారు. ఆరుమాసాలు పదవిలో వుండి 2025 మే13న రిటైర్ అవుతారు. సుప్రీంకోర్టుకు న్యాయ మూర్తుల నియామకాలు, ప్రధాన న్యాయమూర్తి ఎంపికలు నిరంతర ప్రక్రియే అయినా ఎప్పటి కప్పుడు కొత్త కోణాలు, విమర్శలు, ఆరోపణలు, అంచనాలు సాగుతుంటాయి.రాజ్యాంగ రక్షణ కీలక కర్తవ్యంగా మారిన ప్రస్తుత సందర్భంలో సుప్రీంకోర్టు పాత్ర న్యాయమూర్తుల నేపథ్యం కూడా కీలకంగా తయారైంది. 2024 ఎన్నికల్లో బీజేపీ స్వంతంగా మెజార్టీ తెచ్చుకోలేకపోవడానికి రాజ్యాంగంపై దాడి ఒక కారణమనేది నిస్సందేహం. సంపూర్ణమైన ఆధిక్యత లేదంటే అంతకు మించిన సంఖ్యాబలం కలిగిన ఏకపార్టీ ప్రభుత్వాలున్నప్పుడు న్యాయవ్యవస్థ ఒకింత ఆలోచించి అడుగు వేస్తుందనేది ఇన్నేళ్ల అనుభవం. నిబద్ద న్యాయవ్యవస్థ గురించి కూడా ఎమర్జెన్సీలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మాట్లాడేవారు. అనేక కోణాల్లో అత్యవసర పరిస్థితిని మించిన మోడీ పాలన లోనూ అదే పరిస్థితి చాలాసార్లు ప్రత్యక్షమైంది. కీర్తి శేషులు, మాజీ న్యాయమంత్రి అరుణ్‌జైట్లీ విస్తృత ప్రజా మద్దతు గల ప్రభుత్వాలను న్యాయస్థానాలు ఆదేశించడ మేమిటని ఒక దశలో ప్రశ్నించారు కూడా. ఉపరాష్ట్రపతి జగదీప్‌ధంకర్ రోజూ అదే చెబుతున్నారు. తెలుగు రాష్ట్రా ల్లోనూ వేర్వేరు ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు తమ తమ అనుకూలతలను బట్టి కోర్టులపై వ్యాఖ్యలు చేయడం తెలిసిన విషయమే. మోడీ హయాంలో రఫేల్ కుంభకోణం వంటివి కూడా కోర్టులలో తేలిపోయాయి. అయోధ్య తీర్పు, శబరిమల వివాదం, కాశ్మీర్ 370 అధి కరణం ప్రతిపత్తి, పౌరసత్వ సవరణ చట్టం, ఇవిఎంలు, ఎన్నికల బాండ్లు ఇంకా అనేక అంశాల్లో అత్యున్నత న్యాయస్థానం తీరు అసంతృప్తి మిగిల్చింది.రాజకీయ నేతలు, మీడియా ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు, ఆఖరుకు ముఖ్యమంత్రుల వంటివారిపై కేసులలోనూ కోర్టులు భిన్న ప్రమాణాలు పాటించడం ప్రశ్నార్థకమైంది. మాజీ సిజెఐలు, ఇతర న్యాయమూర్తులు కూడా విమర్శలను బేఖాతరు చేసి పదవులలో పునరావసం పొందారు. బలమైన కార్యనిర్వాహక వర్గం(ఎగ్జిక్యూటివ్) వుంటే న్యాయవ్యవస్థ గట్టివైఖరి తీసుకోవడానికి కాస్త తట పటాయిస్తుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంజరు కిషన్ కౌల్ స్వయంగా అన్నారు.
చంద్రచూడ్ టు సంజీవ్ ఖన్నా
గత కొన్నేళ్లలోనూ అత్యధిక కాలం దాదాపు రెండేండ్లు పదవిలో వుంటున్న సీజేఐగా చంద్రచూడ్ హ యాంలో ఎన్నికల బాండ్లపై వెలువడిన తీర్పు ప్రత్యేకించి చెప్పుకో దగింది. ఎస్సీ వర్గీకరణ, పారిశ్రామిక ఆల్క హాల్‌పై పన్ను, గనులపై రాష్ట్రాల పన్ను హక్కు వంటి విషయాల్లో చివరి ఘట్టంలో తీర్పులిచ్చిన చంద్రచూడ్ ముందు ఇంకా రెండుమూడు కీలక కేసులున్నాయి. ఏమైనా స్వలింగ వివాహాల వంటి సామాజికాంశాల్లో సంచలన తీర్పులకు ఆధ్వర్యం వహించినా, రాజకీయ రాజ్యాంగ అంశాల్లో మిశ్రమ వ్యాఖ్యలే మూట కట్టుకున్నారు. ప్రత్యక్ష ప్రసారాలు విస్తృతం చేయడం, సుప్రీంకోర్టులో డిజిటల్ సదుపాయాలతో వార్ రూం ఏర్పాటు చేయడం, సీజేఐ చంద్రచూడ్ విజయాలుగా ప్రచారమవుతున్నాయి. హైకోర్టు న్యాయమూర్తుల తీరును తప్పు పట్టడం, సుప్రీంకోర్టులో పలుమార్లు అడ్వకేట్ల తీరుపై ఆగ్ర హించడం కూడా చూశాం. సంచలనం సృష్టించిన తిరుపతి లడ్డూ కేసు ధర్మా సనంలో ఆయన లేరు గానీ, కోర్టు ముఖ్య మంత్రిపై విమర్శలు చేయడం ఈ కాలంలో జరిగిందే. మరీ ముఖ్యంగా అయోధ్య రామ మందిరానికి అధికారికంగా కాషాయ వస్త్రాల్లో వెళ్లి అదే పనిగా పొగిడిరావడం, తాజాగా వినాయకచవితి వేడుకలకు ప్రధాని మోడీని ఆహ్వానించడం ఆయన్ను విమర్శలకు గురిచేసింది. మళ్లీ ఇటీవల అయోధ్య తీర్పుకు ముందు దైవసన్నిధిలో కూచున్నట్టు చెప్పడం కూడా వార్తలకూ వ్యాఖ్యలకు కారణమైంది. ఏమైనా తనపైన చరిత్ర ఎలాంటి తీర్పునిస్తుందో తెలియదని సీజేఐ భూటాన్ పర్య టనలో స్వయంగా సందేహం వెలి బుచ్చడం విశేషం. తన స్థానంలో నూతన సీజేఐగా సంజీవ్‌ఖన్నా పేరు సిఫార్సు చేయడానికి కూడా ఆయన రెండు మూడురోజులు అధిక సమ యం తీసుకున్నట్టు, ఈలోగా కొలీజి యంలో కొన్ని నియామకాల సిపార్సు లను ఆమోదింపచేసుకోవడానికి ప్రయత్నాలు చేశారని కూడా కథనాలు వచ్చాయి.
జస్టిస్ సంజీవ్‌ఖన్నా తొలుత ఢిల్లీ తీస్‌హజారీ కోర్టులలో వివిధ రకాల ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్య తలు నిర్వహించారు. 2019 జనవరిలో ఢిల్లీ హైకోర్టు నుంచి నేరుగా సుప్రీం కోర్టుకు నియామకం పొందిన ఆయన చాలామంది సీనియర్లను అధిగమించి అత్యు న్నత కోర్టుకు వచ్చారు. ఈ తరహాలో సుప్రీంకోర్టు న్యాయ మూర్తులైన వారు పదిమంది కూడా వుండరని చెబు తున్నారు.ఢిల్లీ హైకోర్టులో ప్రదీప్ నంద్రజోగ్, రాజేంద్ర మీనన్‌్‌లు సంజీవ్‌ఖన్నా కన్నా సీనియర్లు. అయినా వారిని కాదని ఖన్నాను ఎంపిక చేయడంలో ఒక కారణం వుందని న్యాయవర్గాలు విమర్శ చేశాయి. సీని యారిటీ ప్రకారం సీజేఐల సిఫార్సు జరుగుతుంది గనక ఆయన ఆరు నెలలకు మించి వుండరు. అదే వారిని నియమిస్తే కేంద్రం అనుకున్న ప్రకారం తదుపరి సీజేఐల నియా మకం కుదరదు. ఇప్పుడు సీజేఐగా సంజీవ్‌ఖన్నా 2025 మే 13న పదవీ విరమణ చేస్తే తర్వాత జస్టిస్ గవారు ఆ స్థానంలోకి వచ్చి మరో ఆరునెలలు వుంటారు. ఆపైన జస్టిస్ సూర్య కాంత్ సీజేఐ కావడమే గాక పదిహేను నెలలు వుంటారు. ఈ సమయం కీలకమైందని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం.
వివాదాస్పద న్యాయమూర్తులు
జస్టిస్ చలమేశ్వర్ తదితరులు సంచలనంగా మీడి యాతో మాట్లాడినప్పుడు న్యాయవ్యవస్థలో వస్తున్న పరిణామాలపై తీవ్రవ్యాఖ్యలే చేశారు. ప్రమాణాలు పడిపోవడం, సీనియారిటీ పాటించకపోవడం వంటి అనేక ఉదాహరణలిచ్చారు. ఆ సమయంలో సీజేఐగా వున్న దీపక్ మిశ్రా సీల్డ్ కవర్ సంస్కృతికి పేరుగాంచారు. కేంద్రా నికి సంబంధించిన ప్రతికేసులోనూ సీల్డుకవర్‌లో సమాచారం అడగడం, ఏదో విధంగా తీర్పుచెప్పి ముగిం చడం అప్పట్లో పరిపాటిగా వుండేది. అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాలికోపాల్ ఆత్మహత్య సందర్భంగా ఆరోపణలు ఎదుర్కొన్న జస్టిస్ ఖేర్‌పై వచ్చిన పిటిషన్‌ను సీనియర్లను కాదని జూనియర్ జడ్జికి అప్పగించడం, అలాగే అమిత్‌షాపై ఆరోపణలు విచారించిన జస్టిస్ లోయా మృతిపై కేసును తగు ప్రాధాన్యతతో విచారించక పోవడం వారి ఆగ్రహానికి తక్షణ కారణమైంది. అనూ హ్యంగా వారితో పాటు ఆ మీడియా గోష్టికి హాజరైన జస్టిస్ రంజన్ గోగోరు తర్వాత సీజేఐ పదవి చేపట్టి అందరికన్నా వివాదాస్పద పాత్ర పోషించారు.ఇదే ఎన్నికల బాండ్ల కేసు వచ్చినపుడు త్వరగా విచారించేం దుకు గానీ, స్టే ఇవ్వడానికి గానీ ఒప్పుకోలేదు. బాండ్ల ద్వారా విరాళాలు వచ్చిన పార్టీలు ఆ వివరాలు తెలియ జేయాలని మాత్రమే మొక్కుబడి ఆదేశాలిచ్చి 2019 ఎన్ని కల్లో బీజేపీ అత్యధిక విరాళాలు పొందడానికి ద్వారాలు తెరిచారు. తనపై కోర్టు సిబ్బందిలోని ఒక మహిళ లైంగిక పరమైన ఆరోపణలు చేసినప్పుడు విచారించే ధర్మాసనంలో తానే కూచోవడం సిజెఐ రంజన్ గోగోరు అనౌచిత్యాలకు పరాకాష్టగా నిలిచింది. తన కేసులో తనే జడ్జి కారాదు అనే సూత్రానికి ఇది పూర్తి విరుద్ధం.ఆ సమ యంలో ఆ ధర్మాసనంలో కూచున్నవారిలో జస్టిస్ సంజీవ్ ఖన్నా,జస్టిస్ అరుణ్ మిశ్రా వున్నారు. రంజన్‌గోగోరు పదవీ విరమణ తర్వాత కనీస విరామం(కూలింగ్ పీరియడ్) కూడా లేకుండానే రాజ్యసభకు నామినేట్ కావడం,అక్కడ రాజ్యాంగ మౌలిక స్వభావం తీర్పుకు వ్యతిరేకంగా మాట్లాడటం దీనికి కొనసాగింపే! జస్టిస్ అరుణ్‌మిశ్రా గోగోరు హయాంలో అనేక కీలక కేసుల విచారణలో తప్పక వుండేవారు. మోడీని బాహాటంగా పొగిడి తరించి విమర్శలు మూటకట్టుకున్న జస్టిస్ మిశ్రా పూర్వాశ్రమంలో జస్టిస్ లోయా మృతి కేసు విచారణను బాహాటంగా నీరుగార్చారన్న ఆరోపణలకూ గురైన వ్యక్తి. ఆయనపేరు మూడుసార్లు కొలీజియం కాదన్నా చివరకు ఆపలేకపోయింది. ఎస్సీ,ఎస్టీ చట్టం స్పూర్తికి వ్యతిరేకంగా ఒక తీర్పునిచ్చిన చరిత్ర ఆయనదే. కోరి నియమించు కున్న వారి కథ ఒకటైతే, అడ్డుకున్న వ్యవహారాలు మరెన్నో. ఒరిస్సా హైకోర్టు జస్టిస్ మురళీధర్ ఉదంతం వాటిలో ఒకటి మాత్రమే. జడ్జిలుగా నియమించేవారి పుట్టినరోజుల వివరాల నుంచి వారిలో ఎవరితో ముందు ఎవరితో తర్వాత ప్రమాణం చేయించాలనేది లెక్కకట్టి మరీ జరుగుతుంటాయి.
సమగ్ర ప్రక్షాళన?
కొంతమంది వీటికి కొలీజియం కారణమని చెబుతూ న్యాయవ్యవస్థ నియామకాలు కేంద్రం చేతుల్లో పెట్టాలని వాదిస్తారు. కొలీజియం పద్ధతి లోపాలున్నా కేంద్రానికే అధికారాలు ఇవ్వడం కూడా సరైంది కాదు. మోడీ సర్కారు కూడా ఏకపక్షంగా న్యాయ నిమాయకాల కమిషన్(ఎన్‌జాక్) బిల్లు తెచ్చి భంగపడింది. వాస్తవానికి సమగ్రమైన న్యాయ వ్యవహారాల కమిషన్ అవసరమని సీపీఐ(ఎం) సభ్యుడు బిఆర్ భట్టాచార్య తెచ్చిన బిల్లు చర్చకే నోచలేదు. న్యాయవ్యవస్థ, ప్రభుత్వం, చట్ట సభలు, బార్ ప్రాతినిధ్యంతో దాన్ని ఏర్పాటు చేయాలని ఆ పార్టీ ఎన్నికల ప్రణాళికలోనూ సూచించింది. ఇందుకు భిన్నంగా మోడీ సర్కారు తనకు లోబడివుండే న్యాయ వ్యవస్థ కోరుకుంటుంది.ప్రస్తుతం సీజేఐ కాబోతున్న సంజీవ్ ఖన్నా మేనమామ మాజీ సిజెఐ హెచ్‌ఆర్ ఖన్నా ఎమర్జన్సీలోనూ ధైర్యంగా నిలబడటమే గాక పదవికి కూడా రాజీనామా చేశారు. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి జైల్‌సింగ్‌పై ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగానూ పోటీ చేశారు. జస్టిస్ విఆర్‌కృష్ణయ్యర్, చిన్నపరెడ్డి వంటి వారు ఆ విషయంలో చెప్పుకోదగిన పాత్ర నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ విధమైన స్వతంత్ర స్పూర్తిని ఊ హించగలమా?అనేక వివాదాలకు అవకాశమిచ్చిన మాజీ సిజెఐ ఖేర్ వుండగా ఒకసారి మోడీ ‘ఎవరి పరిధిలో వారుండాలి’ అని వ్యాఖ్యానిస్తే ‘మా హద్దులు మాకు తెలుసు’ అని ఆయన వినయంగా ప్రతిస్పందించారు. రాజ్యాంగపరంగా స్వతంత్ర ప్రతిపత్తి జవాబుదారీతనం కలిగివుండాల్సిన న్యాయవ్యవస్థను ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ఉపయోగించుకోవాలనుకోవడం అప్రజాస్వామికం. ఈ కాలంలో కొందరు న్యాయమూర్తులపై అవినీతి ఆరో పణలు, మతతత్వ వ్యాఖ్యలు కూడా పెద్దసవాలుగా మారాయి. తీర్పుల ఆలస్యం, అవినీతి పెద్ద సమస్యలుగా వున్నాయని జస్టిస్ గవారు ఈ మధ్యనే వ్యాఖ్యానించారు. అయితే ఆ విషయంలో జరగాల్సిన పోరాటం చాలా వుంది. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’తో సహా రాజ్యాంగ మౌలిక స్వభావాన్నే సవాలు చేసే నిర్ణయాలు, మతతత్వ నిరం కుశ పోకడలు పెచ్చరిల్లుతున్న సమయంలో న్యాయ వ్యవస్థ సమగ్ర ప్రక్షాళన కూడా ప్రాధాన్యత సంతరించు కుంటున్నది.
– తెలకపల్లి రవి