ఓట్ల వేట‌లో అంకెల గార‌డీ…

– బడ్జెట్‌లో నిర్మలమ్మ మాయా జాలం
– తొమ్మిది నెలలు నత్తనడక… ఆపై కుందేలు పరుగు
– చివరి త్రైమాసికంలోనే అధిక ఖర్చు
– ఎన్నికల ప్రయత్నాల్లో తలమునకలు
మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ లేచి నిలబడగానే అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. బడ్జెట్‌ దేనిపై దృష్టి సారిస్తుందనే విషయంపై ఆతృత. ఇది ఓట్‌-ఆన్‌-అకౌంట్‌ మినహా మరేమీ కాబోదని కొందరు పెదవి విరిచారు కూడా. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఓ ప్రకటన చేస్తూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌నే ప్రవేశపెడుతుందని చెప్పారు. అంతేకాదు…ఎన్నికల్లో విజయంపై ధీమా కూడా వ్యక్తం చేశారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌ను సమర్పిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్‌ను ఒకసారి పరిశీలిద్దాం….

న్యూఢిల్లీ: గడచిన పది సంవత్సరాల కాలంలో దేశాన్ని రెండు దఫాలు ఏలిన మోడీపై ప్రశంసల వర్షం కురిపించేలా బడ్జెట్‌ ప్రసంగం ఉంటుందని అందరూ భావించారు. బడ్జెట్‌ ప్రసంగం కొన్ని సంవత్సరాలుగా రెండు భాగాలుగా కొనసాగుతోంది. మొదటి భాగం ప్రభుత్వం ఇప్పటికే అవలంబించిన లేదా అవలంబించాల్సిన విధానాలను గురించి ఏకరువు పెడుతూ విసుగు పుట్టిస్తోంది. అయితే ఈ భాగంలో వనరుల సమీకరణ, కేటాయింపులు, అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాల ప్రస్తావనే ఉండదు. ఇది ఆందోళన కలిగించే విషయం. రాబోయే సంవత్సరానికి సంబంధించి ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కూడా ఇదే తరహాలో ఉంది. ఈ బడ్జెట్‌ ప్రధానంగా సంక్షేమ పథకాలపై దృష్టి కేంద్రీకరించింది. గృహ వసతి నుండి ఆహారం వరకూ…ఈ పథకాలన్నీ ప్రధానమంత్రి రూపొందించినవే. అయితే ఇలాంటి పథకాలనే బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసినప్పుడు వాటిని ‘తీపి బహుమతి’ సంస్కృతికి ప్రతినిధులు అంటూ ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు. అలాంటప్పుడు అవి కూడా బీజేపీ ప్రభుత్వాలకు సంబంధించి తీపి బహుమతులే అవుతాయి కదా!
ప్రభుత్వ పనితీరును అంచనా వేయాలంటే…
బడ్జెట్‌లోని రెండో భాగం ద్రవ్యలోటు, జీడీపీ నిష్పత్తులు వంటి అంశాలతో కూడి ఉంటుంది. మౌలిక సదుపాయాలు, సంక్షేమంపై పెట్టే ఖర్చును ఇందులో తెలియజేస్తారు. ద్రవ్యలోటును తగ్గిస్తామని, మౌలిక సదుపాయాలు, ప్రజా సంక్షేమానికి అధిక నిధులు కేటాయి స్తామని హామీలు గుప్పి స్తారు. అయితే ప్రభుత్వ పని తీరును అంచనా వేయా లంటే రాబోయే సంవత్సరానికి చేయబోయే కేటాయింపులను కాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరిపిన కేటాయింపులు, చేసిన వాస్తవ వ్యయం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
ఇటీవలి కాలంలో ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశ పెడుతున్న బడ్జెట్లను పరిశీలిస్తే ఆర్థిక సంవత్సరపు సవరించిన అంచనాలలో మార్చి 31 వరకూ పొడిగించిన ఆర్థిక సంవత్సరపు చివరి త్రైమాసికానికి సంబంధించిన అంచనాలను చేరుస్తున్నారు. కాబట్టి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి మూడు త్రైమాసికాలలో వివిధ పద్దుల కింద పెట్టిన వాస్తవ వ్యయపు అంచనాలనే పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఉపాధి హామీకి కేటాయింపులు
కాగ్‌ అందించిన వివరాలను బడ్జెట్‌లో పూర్తి సంవత్సరానికి వేసిన అంచనాలతో పోల్చవచ్చు. ఉదాహరణకు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన అంచనాలనే తీసుకుందాం. వీటిలోనే ముఖ్యమైన గ్రామీణ ఉపాధి హామీ పథకం చేరి ఉంది. 2023-24 సంవత్సరపు బడ్జెట్‌ వ్యయం రూ.1,57,545 కోట్లతో పోలిస్తే సవరించిన అంచనాలను అధికంగా…అంటే రూ.1,71,069 కోట్లుగా చూపారు. పథకానికి సరిపడా నిధులు లేవని, వేతన బకాయిలు పేరుకుపోయాయని, వేతన చెల్లింపులను ఆధార్‌తో అనుసంధానం చేయకపోవడంతో జాబ్‌కార్డు ఉన్న వారిని పనుల నుండి మినహాయించారని…ఇలా ప్రభుత్వ రకరకాల కారణాలు చెబుతోంది. కానీ బడ్జెటరీ వ్యయంతో పోలిస్తే సవరించిన అంచనాలు అధికంగా ఉండడం గమనార్హం.
సవరించిన, బడ్జెట్‌లో కేటాయించిన వ్యయాలను పోలిస్తే వాస్తవంగా ఏం జరుగుతోందో అర్థమవుతుంది. 2021-22లో గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుకు అయిన ఖర్చు రూ.198,468 కోట్లు. 2022-23లో ఈ వ్యయం రూ.190,806 కోట్లకు తగ్గిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ కార్యక్రమంపై సవరించిన అంచనా వ్యయం మరింత తగ్గింది (రూ.186,000 కోట్లు). తనది పేదల అనుకూల ప్రభుత్వమంటూ డాంబికాలు పలుకుతున్న ప్రభుత్వానికి ఈ గణాంకాలు చెంపపెట్టు వంటివి. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమంటే 2023 డిసెంబర్‌ వరకూ గ్రామీణాభివృద్ధి శాఖ రూ.1,07,912 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని కాగ్‌ నివేదిక తెలిపింది. సవరించిన అంచనాలలో చూపిన వ్యయంలో ఇది 63% మాత్రమే. దీనిని బట్టి అవగతమవుతున్నది ఏమంటే ఆర్థిక సంవత్సరపు అంచనా వ్యయంలో మూడో వంతు కంటే ఎక్కువ మొత్తం చివరి త్రైమాసికంలోనే జరుగుతోంది. అంటే మొదటి తొమ్మిది నెలలు నత్తనడక నడుస్తూ, చివర్లో కుందేలు మాదిరిగా పరిగెత్తడమన్న మాట.

ఓట్లు రాల్చే రంగాల పైనే శ్రద్ధ
రైతులు, గ్రామీణ కార్మికులకు ప్రభుత్వం పెద్ద ఎత్తున మద్దతు ఇస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెబుతున్నారు. తన వాదనకు మద్దతుగా ఆమె సవరించిన వ్యయ అంచనాలను చూపారు. డిసెంబర్‌ వరకూ తక్కువ మొత్తంలో ఖర్చు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు దానిని వేగవంతం చేస్తోంది. దీని వెనుక ఎన్నికల ఎత్తుగడ ఉంది. ఏయే రంగాలపై డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తే బీజేపీకి ఓట్లు పడతాయో ఆ రంగాలపై ఇప్పుడు దృష్టి సారిస్తోంది. అయితే గ్రామీణ ఉపాధి హమీ పథకంపై చేసిన వ్యయాన్ని పరిశీలిస్తే వాక్చాతుర్యంతో వాస్తవ కేటాయింపులను మరుగు పరచవచ్చునని బీజేపీ భావిస్తున్నట్లు కన్పిస్తోంది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 80 కోట్ల మందికి ఆహార మద్దతు అందించేందుకు ఉచితంగా రేషన్‌ అందిస్తానని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ వాస్తవం ఏమిటి? ఆహార సబ్సిడీ రానురానూ తగ్గిపోతోంది. 2021-22లో రూ.12,88,60 కోట్లుగా ఉన్న ఆహార సబ్సిడీ 2023-24లో రూ.12,87,194 (సవరించిన అంచనా) కోట్లకు తగ్గుతోంది. బడ్జెట్‌ కేటాయింపులకు అనుగుణంగానే వ్యయం చేస్తున్నామని చెబుతూనే ద్రవ్యలోటును జీడీపీలో 5.8%గా ఉంచుతామని ఆర్థిక మంత్రి చెప్పారు. ఇది బడ్జెట్‌ స్థాయి కంటే కొంచెం తక్కువ. తద్వారా ద్రవ్య మార్కెట్లను సంతోషపెట్టేందుకు నిర్మలమ్మ శతవిథాలా ప్రయత్నించారు. ఈ ఎత్తుగడలు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు కురిపించి, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం హ్యాట్రిక్‌ విజయం సాధించడానికి దోహదపడతాయా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

వ్యవసాయ రంగానికి కేటాయింపులు
వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖకు సంబంధించి ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాలకు, 2023 డిసెంబర్‌ వరకూ జరిగిన వాస్తవ వ్యయానికి మధ్య తేడా మరింత ఎక్కువగా ఉంది. ఈ శాఖ కిందే ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం-కిసాన్‌) పథకం ఉంది. 2023-24లో ఈ శాఖకు బడ్జెట్‌లో చూపిన వ్యయం రూ.21,15,532 కోట్లు. సవరించిన అంచనా రూ.21,16,789 కోట్లు. డిసెంబర్‌ వరకూ అయిన వాస్తవ ఖర్చు సవరించిన అంచనాలో 61% అని కాగ్‌ తెలిపింది. ఒక్క పీఎం-కిసాన్‌ పథకానికే 2021-22లో రూ.166,825 కోట్లు ఖర్చు చేయగా 2022-23లో అది రూ.58,254 కోట్లకు తగ్గిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.60,000 కోట్లు ఖర్చు చేయాలని బడ్జెట్‌లో లక్ష్యంగా నిర్దేశించారు. డిసెంబర్‌ వరకూ అయిన వాస్తవ ఖర్చుకు, బడ్జెట్‌లో సవరించిన అంచనాలకు మధ్య తేడాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.