రసవత్తరంగా..

Sidni test– రెండో రోజు 15 వికెట్లు పతనం
– బంతితో సిరాజ్‌, ప్రసిద్‌, నితీశ్‌ జోరు
– రిషబ్‌ పంత్‌ ధనాధన్‌ అర్థ సెంచరీ
– భారత్‌, ఆసీస్‌ ఆఖరు టెస్టు రెండో రోజు
సిడ్నీ టెస్టు రసకందాయంలో పడింది. రెండో రోజు 15 వికెట్లు పతనమవగా.. ఇరు జట్లు సమవుజ్జీలుగా కొనసాగుతున్నాయి. ఆసీస్‌ 181కు కుప్పకూలగా.. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కించుకుంది. పంత్‌ (16) ధనాధన్‌ అర్థ సెంచరీతో సిడ్నీలో భారత్‌ ముందంజలోనే నిలిచింది!. నేడు ఉదయం సెషన్‌ ఆటలో ఎవరు పైచేయి సాధిస్తే.. సిరీస్‌ ఆ జట్టు సొంతమవటం ఖాయం!.
నవతెలంగాణ-సిడ్నీ

రిషబ్‌ పంత్‌ (61, 33 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) సిడ్నీలో శివమెత్తాడు. ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో భారత్‌ను ఒత్తిడిలో నుంచి బయటపడేశాడు. యశస్వి జైస్వాల్‌ (22, 35 బంతుల్లో 4 ఫోర్లు) సైతం మెరవటంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 141/6 పరుగులతో ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో కలిపి భారత్‌ 145 పరుగుల ముందంజలో ఉంది. ఆసీస్‌ పేసర్‌ స్కాట్‌ బొలాండ్‌ (4/42) నాలుగు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. అంతకుముందు, సిరాజ్‌ (3/51), ప్రసిద్‌ కృష్ణ (3/42), నితీశ్‌ (2/32), బుమ్రా (2/33) మెరవటంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే కుప్పకూలింది. బ్యూ వెబ్‌స్టర్‌ (57, 105 బంతుల్లో 5 ఫోర్లు) అర్థ సెంచరీతో ఆసీస్‌ను ఆదుకున్నాడు.
పంత్‌ ఫటాఫట్‌
రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 32 ఓవర్లలో 6 వికెట్లకు 141 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (22), రాహుల్‌ (13) తొలి వికెట్‌కు 42 పరుగులు జోడించారు. స్టార్క్‌ను తొలి ఓవర్లోనే నాలుగు సార్లు బౌండరీ లైన్‌ దాటించిన జైస్వాల్‌ మెరుపు ఆరంభాన్ని అందించాడు. కమిన్స్‌, స్టార్క్‌లను ఓపెనర్లు బ్యాక్‌ఫుట్‌తో అలవోకగా ఎదుర్కొన్నారు. కానీ బంతి బొలాండ్‌ చేతికందగానే కథ మారింది. రాహుల్‌, జైస్వాల్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేసిన బొలాండ్‌.. విరాట్‌ కోహ్లి (6), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (4) కథ సైతం ముగించాడు. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ (61) తనదైన శైలిలో రెచ్చిపోవటంతో భారత్‌ సిడ్నీ టెస్టు రేసులో నిలిచింది. 29 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదిన పంత్‌.. సిక్సర్లు, ఫోర్లతో దండయాత్ర చేశాడు. కానీ డ్రింక్స్‌ విరామం పంత్‌ లయను దెబ్బతీసింది. కమిన్స్‌ ఓవర్లో పంత్‌ క్యాచౌట్‌గా నిష్క్రమించగా.. మళ్లీ వికెట్ల పతనం మొదలైంది. రెండో రోజు ఆట ముగిసే సరికి జడేజా (8 నాటౌట్‌), వాషింగ్టన్‌ (6 నాటౌట్‌) అజేయంగా నిలిచారు.
సమిష్టిగా పడగొట్టారు
పేస్‌ దళపతి బుమ్రా (2/33) ఉదయం సెషన్లో లబుషేన్‌ (2) వికెట్‌తో జోష్‌ పెంచినా.. వెన్ను నొప్పితో మైదానం వీడాడు. దీంతో బుమ్రా లేకుండానే భారత బౌలర్లు ఆసీస్‌ను కట్టడి చేశారు. సిరాజ్‌ స్వింగ్‌ రాబట్టి అదరహో అనిపించగా.. ప్రసిద్‌ కృష్ణ మంచి లెంగ్త్‌ బంతులతో మెప్పించాడు. టెయిలెండర్ల కథ నితీశ్‌ కుమార్‌ ముగించాడు. దీంతో 51 ఓవర్లలో 181 పరుగులకే ఆసీస్‌ పతనమైంది. అరంగేట్ర మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ వెబ్‌స్టర్‌ (57) అర్థ సెంచరీతో మెరిశాడు. అలెక్స్‌ కేరీ (21)తో కలిసి కీలక భాగస్వామ్యం నమోదు చేసిన వెబ్‌స్టర్‌ భారత్‌ ఆధిక్యాన్ని భారీగా కుదించాడు. టాప్‌ ఆర్డర్‌లో స్మిత్‌ (33) ఆకట్టుకున్నాడు.
స్కోరు వివరాలు :
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 185/10
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ : కాన్‌స్టాస్‌ (సి) జైస్వాల్‌ (బి) సిరాజ్‌ 23, ఖవాజా (సి) రాహుల్‌ (బి) బుమ్రా 2, లబుషేన్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 2, స్మిత్‌ (సి) రాహుల్‌ (బి) ప్రసిద్‌ 33, హెడ్‌ (సి) రాహుల్‌ (బి) సిరాజ్‌ 4, వెబ్‌స్టర్‌ (సి) జైస్వాల్‌ (బి) ప్రసిద్‌ 57, అలెక్స్‌ (బి) ప్రసిద్‌ 21, కమిన్స్‌ (సి) కోహ్లి (బి) నితీవ్‌ 10, స్టార్క్‌ (సి) రాహుల్‌ (బి) నితీశ్‌ 1, లయాన్‌ నాటౌట్‌ 7, బొలాండ్‌ (బి) సిరాజ్‌ 9, ఎక్స్‌ట్రాలు : 12, మొత్తం : (51 ఓవర్లలో ఆలౌట్‌) 181.
వికెట్ల పతనం : 1-9, 2-15, 3-35, 4-39, 5-96, 6-137, 7-162, 8-164, 9-166, 10-181.
బౌలింగ్‌ : బుమ్రా 10-1-33-2, సిరాజ్‌ 16-2-51-3, ప్రసిద్‌ 15-3-42-3, నితీశ్‌ 7-0-32-2, జడేజా 3-0-12-0.
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : జైస్వాల్‌ (బి) బొలాండ్‌ 22, రాహుల్‌ (బి) బొలాండ్‌ 13, గిల్‌ (సి) అలెక్స్‌ (బి) వెబ్‌స్టర్‌ 13, కోహ్లి (సి) స్మిత్‌ (బి) బొలాండ్‌ 6, పంత్‌ (సి) అలెక్స్‌ (బి) కమిన్స్‌ 61, జడేజా నాటౌట్‌ 8, నితీశ్‌ (సి) కమిన్స్‌ (బి) బొలాండ్‌ 8, సుందర్‌ నాటౌట్‌ 6, ఎక్స్‌ట్రాలు : 8, మొత్తం : (32 ఓవర్లలో 6 వికెట్లకు) 141.
వికెట్ల పతనం : 1-42, 2-47, 3-59, 4-78, 5-124, 6-129.
బౌలింగ్‌ : స్టార్క్‌ 4-0-36-0, కమిన్స్‌ 11-4-31-1, బొలాండ్‌ 13-3-42-4, వెబ్‌స్టర్‌ 4-1-24-1.