ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి వినతి పత్రం అందించిన జూలకంటి రంగారెడ్డి

Julakanti Rangareddy presented the petition to Chief Minister Revanth Reddy– ఆయిల్ ఫాం టన్ను గెలలు మద్దతు ధర రూ.25 వేలు ఉండేలా చర్యలు తీసుకోండి..
– తెలంగాణ రైతు సంఘం ఆద్వర్యంలో..
– ఆరు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి కి అందజేసిన అఖిలభారత రైతు సంఘం (ఏఐకేఎస్)
జాతీయ నాయకులు జూలకంటి రంగారెడ్డి..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆయిల్ ఫాం గెలలు కు మద్దతు ధర కల్పించాలని, అశ్వారావుపేట కేంద్రంగా ఆయిల్ ఫాం పరిశోధనా, బోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్ పామ్ గ్రోయర్స్ సొసైటీ తరపున, తెలంగాణ రైతు సంఘం ఆద్వర్యంలో ఏఐకేఎస్ జాతీయ నాయకులు జూలకంటి రంగారెడ్డి నేతృత్వంలో శుక్రవారం హైద్రాబాద్ సచివాలయం లో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, నాయకులు మూడ్ శోభన్, కొక్కెరపాటి పుల్లయ్య, తుంబూరు మహేశ్వర రెడ్డి లు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చిన వినతి పత్రం యథాతథం. శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారి దివ్య సముఖమునకు తెలంగాణ ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్ పామ్ గ్రోయర్స్ సొసైటీ రైతులు నమస్కరించి వ్రాసుకొను విన్నపము. రైతుకు స్థిరమైన ఆదాయం ఇవ్వగలిగి, విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తూ చీడపీడలు, ప్రకృతి విపత్తులను కొంతవరకు తట్టుకునే ఆయిల్ పామ్ సాగు తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతూ వస్తున్నది. ఇదే క్రమంలో సమస్యలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున తీసుకొనవలసిన,రైతులు కోరుతున్న కొన్ని అంశాలు తమ దృష్టికి తీసుకువస్తున్నాము.
1) కేంద్ర ప్రభుత్వం క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతులపై దిగుమతి పన్ను పూర్తిగా తొలగించడం వల్ల మన దేశంలో పండిస్తున్న పంటకు 50% పైగా ధర తగ్గి, రూ.13,000 లకు పడిపోయింది.భారత దేశంలో పామ్ ఆయిల్ సాగు చేసి ఎంతో విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేస్తూ దేశీయంగా వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధికి దోహదపడుతున్న ఆయిల్ పామ్ రైతులను ఆదుకోవాలని కనీసం ఒక టన్ను ఆయిల్పామ్ గెలలకు రూ.25,000 లు మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
2) దేశంతో పాటు మన రాష్ట్రంలో కూడా విస్తరిస్తున్న ఈ పంట సాగు & పరిశ్రమల బహుళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆయిల్పామ్ బోర్డు ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతున్నాము.
3) గత ప్రభుత్వ హయాములో ఆయిల్ఫైడ్ లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించి, అక్రమాలకు పాల్పడిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని మరియు వారి నిర్వాకం వల్ల నకిలీ (హాఫ్ టైప్) కాపుకు రాని మొక్కలు సరఫరా చేయడం వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నాము.
4) మన రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న ఆయిల్ పామ్ సాగుకు & పరిశ్రమకు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ళు, తెగుళ్ళు, పురుగులు, ఈ సాగులో ప్రధాన అంశం అయిన మొక్కల నాణ్యత, గెలల కోతకు నైపుణ్యం కలిగిన కూలీల కొరత రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పరిశోధన, బోధన & రైతులకు శిక్షణా కేంద్రాన్ని అన్ని వసతులు గల అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజీకి అనుబంధంగా ఏర్పాటు చేయగలరని కోరుతున్నాము. ఇక్కడ ఈ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు ఈ కాలేజి అధీనం లోని 400 ఎకరాల భూమి,ఆయిల్ పామ్ సాగుకు అనువైన నేల, పుష్కలంగా నీటి లభ్యత,ఆయిల్ పామ్ నర్సరీలు, పరిశ్రమలు ఉన్నాయి.
5) ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 1.3 లక్షల ఎకరాల సాగులో వుండి, ఈ జిల్లాలో ఇప్పటికే ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ఉన్న రెండు ఫ్యాక్టరీలలో సుమారుగా ఒక ఏడాదికి 3 లక్షల టన్నుల గెలలు క్రషింగ్ ద్వారా వేల టన్నుల క్రూడ్ పామ్ ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నారు ఇది వచ్చే రెండు సంవత్సరాలలో రెట్టింపు అయ్యే అవకాశం వుంది. ఈ ముడి పామ్ ఆయిల్ ను ప్రైవేట్ రిఫైనరీ లు కు విక్రయించి, తిరిగి వారి నుండి శుద్ది చేసిన పామ్ ఆయిల్ ను మన ఆయిల్ ఫెడ్ కొనుగోలు చేస్తున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయిల్ఫైడ్ ఆధ్వర్యంలో రిఫైనరీ నిర్మించి, మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ముడి పామ్ ఆయిల్ ను శుద్ది చేసి విక్రయించగలిగితే రైతుకు అదనపు ఆదాయం, రాష్ట్రానికి కొంత ఆర్ధిక లాభం చేకూరుతుంది. కావున సాధ్యమైనంత త్వరగా రిఫైనరీ నిర్మించి, ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసుల కల నెరవేర్చగలరని కోరుతున్నాము.
6) గత ప్రభుత్వ హయాములో ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట & అప్పారావుపేట ఫ్యాక్టరీలలో ఉత్పత్తి అయ్యే ముడి పామ్ ఆయిల్ విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయం నుండి సి.యస్.ఆర్. ఫండ్స్ ను ఈ ప్రాంతాలలో కాకుండా ఇతర ప్రాంతాలలో ఖర్చు చేశారు.ఇక మీదట ఈ సి.యస్.ఆర్. ఫండ్స్ ను ఈ ప్రాంత అభివృద్ధికి మాత్రమే కేటాయించేలా ఆదేశించాలని మనవి చేసుకుంటున్నాము.
Julakanti Rangareddy presented the petition to Chief Minister Revanth Reddy