ఆధిపత్య వాదాలపై జూలు విదిల్చిన జూలూరు

On hegemonic arguments Juluru left Julu‘వ్యక్తికి బహువచనం శక్తి’ అన్న సూత్రం అతడి విషయంలో మళ్ళీ నిరూపితమైంది. పోరాడుతాడు, జనాన్ని సమీకరిస్తాడు, తుదకు లక్ష్యాన్ని ఛేదించి సాధిస్తాడు. ఎందుకంటే జన్మస్థలం తనకు ఓనమాలు దిద్దించింది, కళాశాల పోరాటపటిమను నేర్పింది. నాలుగున్నర దశాబ్దాల కాలం అతని జీవన గమనాన్ని సమూలంగా మార్చివేసింది. ప్రగతిశీల వాదాన్ని భుజంపై వేసుకొని ఒక దశాబ్దం చైతన్యగీతికగా మారాడు. దళిత వాదానికి దగ్గరై బిసి వాదంతో మమేకమయ్యాడు. వారి జీవన స్థితిగతులను అనేక కవితల్లో, కావ్యాల్లో ఆవిష్కరించాడు.
జూలూరు గౌరీశంకర్‌ – తెలుగునాట పరిచయం అవసరం లేని వ్యక్తి. కావ్యాలు, సంకలనాలు అయన పథంలో పదంగా కదం తొక్కి ‘పాదముద్ర’ గా నిలిచాయి. దీర్ఘకవితలు తన ఆవేదనను, ఆక్రోశాన్ని వెలిబుచ్చే ఆయుధాలు కాగా ఈ మధ్య వెలువడ్డ ‘జూలూరు పథం’ కూడా ఆ కోవలోనిదే! తన నాలుగు కల్లోల దశాబ్దాల అనుభవాలను ఈ ‘పథం’లో ఏకరువు పెట్టారు. తన బాల్యమిత్రులను, కళాశాల సహచరులను, ఉద్యమ భాగస్వాములను, తనను వెన్నంటి ఉన్నవాళ్లను, వెన్నుతట్టి ప్రోత్సహించిన వాళ్ళను, ఏ ఒక్కరినీ మరచిపోకుండా తన కవితల్లో పలకరించడం, సందర్భానికి తగినట్లుగా గుర్తుచేసుకోవడం జూలూరు మానవీయ లక్షణం.
మహాకవి శ్రీశ్రీ రచించిన ‘అనంతం’ను ఆత్మ చరిత్రాత్మ చారిత్రాత్మక నవలగా చెప్పుకున్నారు. గౌరీశంకర్‌ తన ‘జూలూరు పథం’ దీర్ఘకవితను ఆత్మ కథనాత్మక కవితగా చెప్పారు. ఆత్మ తనది, కథ తెలంగాణది. ‘నా అక్షర రంగస్థల విశాలవేదిక దీర్ఘకవిత’ అని పేర్కొన్నారు. శ్రీశ్రీ శైలి, ప్రభావం కూడా అక్కడక్కడా మనకు కనబడతాయి. ‘అలజడి మా జీవితం, ఆందోళన మా ఊపిరి, తిరుగుబాటు మా వేదాంతం, విప్లవం మా జన్మహక్కు’ అని శ్రీశ్రీ నినదిస్తే, జూలూరు తన మహా యుద్ధంలో ‘తెగించటం నా నినాదం, తెగబడటం నా నైజం, తిరుగుబాటు తెలంగాణ జీవం, నా కాళ్ళ మట్టే ఉద్యమ వేదం’ అని స్పందించారు. ‘కవిత్వమొక తీరని దాహమే కాదు, యుద్ధరంగ వేదిక, యుద్ధగీతిక, యుద్ధభూమిక’ అని పునర్నిర్వచించారు. ‘తెలుగు సాహిత్యం ప్రతి మలుపు దగ్గర నా రెండు చేతులతో జెండా నెగరేశా’ అని ఢంకా భజాయించారు. తన నాలుగు దశాబ్దాల ప్రస్థానంలో ఏనాడూ తటస్థంగా లేరు. జూలూరు ఎప్పుడూ చలనశీలి. ప్రవాహంగానే ఉన్నారు. ఆ ప్రవాహంలో పాఠకులు కూడా కొట్టుకుపోతారు. ధిక్కార సంస్కృతి అతని రక్తంలోనే ఉంది.
నడిగూడెం నుండి నగర నడిబొడ్డు దాక, అనంతగిరి నుండి అనంతపురం వరకు, విశ్వవిద్యాలయాల నుండి వెలివాడల వరకు కలియ తిరిగి పీడిత తాడిత జనుల కన్నీళ్లను తన కవితావస్తువుగా చేసుకున్నారు. సమస్త వృత్తుల సమస్త చిహ్నాలను కవితాగానం చేశారు. నేను తరతరాలుగా వెనుకబడ్డవాడిని, ఎప్పటికీ మీ నేను, మీ వెంటాడే కలాన్ని… అని సగర్వంగా ప్రకటించాడు. సబ్బండ వర్ణాల గొంతుకగా నిలిచాడు. దళిత బహుజన కవులకు ఆశాకిరణమై, దారి దీపంగా మారాడు. సమ సమాజాన్ని స్వప్నించి, విశ్వ విప్లవాన్ని ఆకాంక్షించారు. జూలూరు ఆలోచనా పరిణామ క్రమం ఒకింత విచిత్రమైనది, సంక్లిష్టమైనది. బిగించిన పిడికిలితో విప్లవ భావజాలాన్ని సృజించాడు. బహుజన వాదాన్ని తలకెత్తుకున్నాడు. నా ప్రతిభను కులం పేరుతో తొక్కేస్తే రోహిత్‌నై పుడతానని హెచ్చరిస్తాడు. అందుకే అతడు ఏక కాలంలో అనేకుడు. భావ సంఘర్షణను విజయ వంతంగా అధిగమించాడు. తనను ఎవరితో పోల్చినా ఒప్పుకోడు. తన అస్తిత్వం తనదేనని గాఢంగా విశ్వసిస్తాడు, వాదిస్తాడు. ‘ముళ్ల కంచెల్ని చెక్కుకుంటూ, డొంకల్ని దాటుకుంటూ, ఏర్లు నదులను ఈదుకుంటూ, బహుజనదారులు వేసుకుంటూ, తెలంగాణ మలిదశ జెండా నెత్తిపట్టా, అస్తిత్వ కవిత్వ ఆయుధమయ్యాడు.
‘కవి జనించటమంటే ఆలోచనల విత్తనం పగలటం’ అనే సరికొత్త నిర్వచనంతో ఈ దీర్ఘకవిత మొదలవుతుంది. ‘కవులు దేశానికి కాపలాదారులు, కవులు ప్రపంచ పథనిర్దేశకులు, కవులు కర్తవ్య నిర్వహణాధారులు, కవులు కాలానికి దారిచూపేవాళ్లు, కవులు ఎక్కుపెట్టిన సంగ్రామాలు… కవిత్వానికి హద్దుల్లేవు, ఎల్లలు అసలే లేవు’ అనడం ద్వారా కవి కర్తవ్యాన్ని, కవిత్వపు లక్షణాన్ని నిర్దేశించాడు గౌరీశంకర్‌. ప్రజల పక్షం నిలిచిన కవులే కవులు, వాళ్ళ కోసం చేసిన రచనలే రచనలు, వాళ్ళు లేకుండా కాలాలు లేవు, కావ్యాలు లేవు. కవులు ఉద్యమాలను నడిపిన సాంస్కృతిక రధసారధులు. కవిత్వమంటే గౌరీకి ఉన్న అపారమైన గౌరవం అయన మాటల్లోనే… ‘కవిత్వ పాదం నాకు జీవిత భాగం. నా అక్షరమే నాకు ప్రాణమైంది. నా అక్షరాలే నాకు దిక్కు, దీవెనలయ్యాయి’. మరొక చోట ‘నా అక్షరాలు ఉరిమిన నత్యాలు’ అని చెప్పుకొచ్చాడు. కవులు బుద్ధులు కావాలె, అధిపత్యానికి ఎన్నడూ బద్ధులు కావద్దు అని కోరుకున్నాడు. కవితాఖడ్గంతో దేన్నైనా తెగనరికాడు. ‘కవులు కల్లోలాలు, ఈదురుగాలుల్లా వీస్తారు, తుఫానులా విరుచుకుపడతారు, కవులు జీవన సత్యాలు’ లాంటి గొప్ప వాక్యాలు ఈ దీర్ఘకవితలో కోకొల్లలు. పుట్టుక రక్తపాతమే, బతుకు రక్తపాతమే, నా ఊహలు పంచుకుంటున్నచోట, విరబూసిన పువ్వుల పుప్పొడి సంపర్కం యుద్ధం. మరోచోట ప్రజాయుద్ధానికి అక్షరాలనల్లేవాడే కదా కవి! అని అతనికి కర్తవ్యబోధ చేస్తాడు. ‘అక్షరాలు సూర్యోదయాలు, చంద్రోదయాలు, చీకటివెలుగులు, మానవ హృదయాలు, మానవోదయాలు’ అంటూ ఈ దీర్ఘకవితకు ముగింపు పలికాడు గౌరీ.
ఇక తెలంగాణ కవుల గొప్పతనాన్ని చెప్తూ వారిని సోక్రటీస్‌ వారసులని, ఏకవాక్య బహువచనాలని ప్రశంసిస్తాడు. వారి గొప్పతనం, త్యాగం తెలంగాణ మట్టి వారసులకు మాత్రమే బోధపడుతుంది. తెలంగాణ కవులు పాటకు ఉద్యమ చనుబాలిచ్చారు అని కీర్తిస్తాడు. తెలంగాణ ఉద్యమ కవిత్వ ప్రవాహాలు పోటెత్తిన జలప్రవాహాలు అని ఎలుగెత్తాడు.
ఈ దీర్ఘకవితకు మూలవస్తువు తెలంగాణ. ఊరూ వాడా ఏకమైన నేపథ్యంలో కులమతాలకతీతంగా సిద్ధాంతాలను పక్కనబెట్టి రాజకీయ పార్టీలు ఒక్కతాటిపై నడవాల్సిన పరిస్థితిలోకి నెట్టబడ్డాయి. ‘చెగువేరాలు, జూలియస్‌ ఫ్యూజిక్‌లు, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌లు ఈ నేలలో యాడ దున్నినా కనబడతారు’. అసలు వెదకాల్సిన పనిలేదని నా భావన. తన నేలపై తనను పరాయివాడిగా చేసి తనపై అదితపథ్యం చేయడాన్ని ఏమాత్రం సహించలేదు జూలూరు. కొన్ని మచ్చుతునకలు :
ఈ నేల, ఈ గాలి, ఈ నీరు ఈ ఆకాశం అన్ని నేనైనా నా నేల మీద నేను బందీనే కదా!’ అధిపత్యపు రూపాలను ఈ విధంగా తెలిపాడు – చరిత్రంతా వాళ్లదే, నీళ్లు, నిధులు, కొలువులు వాళ్ళయే, సాహిత్యమంతా వాళ్లదే, సినిమాలు, పరిశ్రమలు, సంపదలు వాళ్ళయే, నా నేల మీద నేనే కూలీని, నా నేల మీద నేనే పరాయి భాంచను’ బతికి చావటం, చచ్చి పుట్టటం నా తెలంగాణ, చావు పుట్టుకల అసలు నిర్వచనం తెలంగాణ, సత్యాల పొదుగు నా నేల, నిజాల కొలిమి నా నేల, నిప్పుల కుంపటి నా నేల. నా తెలంగాణ కొత్త చరిత్రకు చిరునామా, నా తెలంగాణ ఆరని చైతన్య నిప్పు …తల్లి స్తన్యం కోసం బిడ్డ పెట్టిన కేక నా తెలంగాణ’.
మొత్తం దీర్ఘకవితను 15 భాగాలుగా విభజించినా అంతర్లీనంగా అంతరాత్మయైన తెలంగాణ ఆసాంతం మనకు ఆవిష్కతమవుతుంది. తాను ఏ వాదంలో ఉన్నా ఆధిపత్య వాదాన్ని నిరసించాడు. గౌరీలోని మరో గొప్పతనమేమంటే ఉద్యమం జరుగుతున్నప్పుడే ఆ ఉద్యమంపై ఒక పుస్తకం విడుదల చేస్తాడు. ఒక రకంగా కాలం కంటే ముందు నడుస్తాడు జూలూరు. అనేకమంది అంతర్జాతీయ నాయకుల, కవుల పేర్లు మనకు ఈ కావ్యంలో కనబడతాయి. అనేక గ్రంథాలు చదివిన జూలూరు, వాటిని అలవోకగా కవితల్లో సందర్భోచితంగా ఉదహరిస్తాడు. ఉదహరించిన మిత్రుల పేర్లు, ఉద్యమనేతల పేర్లు, అమరుల పేర్లు రాయాలంటే అదొక వ్యాసమవుతుంది. వారే అతని బలము, బలగము. ప్రసేన్‌, సీతారాం, వంశీకృష్ణల పరిచయ వాక్యాలు ఈ దీర్ఘకవిత రంగు, రుచి, ఘాటు వాసన తెలియజేస్తాయి. కవితలో ఆవిష్కృతం కాబోయే అనేక ఉద్యమాలకు నేపధ్యాన్ని, జూలూరు ఆవేదన, ఆవేశం, ఆక్రోశం పాఠకులకు ముందే ఒక భూమికను ఏర్పరుస్తాయి. ఈ కావ్యాన్ని తన తల్లిదండ్రులకు అంకితమిచ్చిన జూలూరు ధన్యజీవి.
విబూది బొట్టు నుండి విప్లవవాదిగా, విముక్తివాదిగా జూలూరులో పరిణామక్రమం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. దిగంబర కవుల ప్రభావం గౌరీ నడకలో కనిపిస్తుంది. ఉద్యమం ముగిసి ఒక దశాబ్ద కాలం గడిచినా గౌరీ శైలి ఆనాటి రూపాలన్నింటిని మన కళ్ళముందు ఆవిష్కృతం చేస్తుంది. సందర్భోచితంగా గీసిన చిత్రాలు ప్రతి కవితకు ముందు మనలను ఆలోచింప జేస్తాయి. అట్ట’హాసం’ తో కూడిన ఈ దీర్ఘకవిత ఉద్యమాల్లో పాల్గొన్న వారినందరిని గతానుభవాల్లోనికి తీసుకుపోతే నూతన లేదా భావితరాల వారిని తమ గమ్యం వైపు ఉద్యుక్తులను చేస్తుంది. వారికీ ఒక మార్గదర్శినిగా నిలుస్తుంది. ‘జూలూరు పథం’ విభిన్నమైనది, విలక్షణమైనది.
– పునర్వసు