దేశంలో ‘డీ రిజర్వేషన్‌’ మొదలైన చారిత్రక దినం… జూలై 26!

రాజర్షి ఛత్రపతి సాహు మహరాజ్‌ 2 జూలై 1894న కొల్హాపూర్‌ రాజసింహాసనాన్ని అధిష్టించాడు. రాజులైన.. వారెవరైనా… పరిపాలనలో, సమాజంలోనూ బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని అంగీకరించడమూ, తదనుగుణంగా నడుచుకోవడమూ… వేలాది సంవత్సరాలుగా మన దేశంలో నడుస్తూ వస్తున్నది. బ్రాహ్మణాధిపత్యాన్ని రాజులు అంగీకరించాలి, దానికి బదులుగా… రాజు దైవాంశ సంభూతుడని ప్రచారం చేసి, రాజుల నిరంకుశ పాలనకు ధర్మబద్ధత కలిగించే పని బ్రహ్మణులు నిర్వర్తించాలి. మన దేశంలో అనాదిగా కొనసాగుతున్న ‘సనాతన ధర్మం’ ఇది.కొల్హాపూర్‌ రాజైన సాహూ మహారాజ్‌ మాత్రం… దీన్ని ధిక్కరించి మానవతా ధర్మం వైపు నిలబడ్డాడు. నేటికి సరిగ్గా 121యేళ్ల క్రితం… 26 జులై 1902న అతను ఎవ్వరూ ఊహించని విధంగా ఒక అద్భుతమైన అడుగు వేశాడు. బ్రాహ్మణుల నుండి తీవ్ర వ్యతిరేకతల మధ్య… తన రాజ్యంలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలలో దళితులు, వెనుకబడిన వారికి 50శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ రాజశాసనం జారీ చేశాడు. ఆధునిక భారతదేశంలో రిజర్వేషన్లకు అలా అంకురార్పణ జరిగింది. అందుకే సాహూ మహారాజ్‌ ఆధునిక రిజర్వేషన్ల పితామహుడిగా పేరొందాడు. ఆ తర్వాత మరో 50ఏండ్లకు… అంబేద్కర్‌ మహనీయుడు రాజ్యాంగ రచన చేసినప్పుడు… నిమ్న వర్గాలకు రిజర్వేషన్‌ ఇవ్వాలనే సాహు సదాశయాన్ని రాజ్యాంగబద్ధం చేశాడు.
1874 జూన్‌ 26న కుంబీ అనే శూద్ర కులంలో జన్మించిన సాహు మహారాజ్‌… మరాఠా సామ్రాజ్యాన్ని ఏలిన వీర శివాజీ మనుమడు. సాహు మూడేండ్ల వయసులో తన తల్లిని కోల్పోయాడు. కొల్హాపూర్‌ రాణి ఆనందీబాయి 1884 మార్చి 17న అతన్ని దత్తత తీసుకున్నది. 20సంవత్సరాల చిన్న వయసులో కొల్హాపూర్‌కు రాజయ్యాడు. 1922 మే6న చనిపోయేంతవరకు… 28సంవత్సరాల పాటు కొల్హాపూర్‌ రాజ్యాన్ని పాలించాడు. సాహు తాతగారైన ఛత్రపతి శివాజీ సైతం స్వయంగా కులవ్యవస్థ బాధితుడిగా చరిత్రకెక్కాడు. తన పరాక్రమంతో ఎన్నో రాజ్యాలను జయించిన శివాజీ… చక్రవర్తిగా పట్టాభిషిక్తుడు కావాలని ప్రయత్నాలు ప్రారంభించిన వేళ… ”నువ్వు శూద్ర కులానికి చెందిన వాడివి కాబట్టి నీకు పట్టాభిషేకం చేయం” అంటూ పూణేలోని బ్రాహ్మణులు తీర్మానించారు. తప్పనిసరి పరిస్థితు లలో శివాజీ కాశీ పట్టణం నుండి గంగాభట్టు అనే ఒక బ్రాహ్మణుడిని ఆ పని కోసం తీసుకొచ్చాడు. నిలువెత్తు బంగారం సంభావనగా సమర్పించా లనే షరతుపై ఆ బ్రాహ్మణుడు పనికి ఒప్పుకున్నాడు. ఇంతా చేసి… తన కాలి వేలుతో శివాజీ నుదుటికి బొట్టుపెట్టి పట్టాభిషేక తతంగం కానిచ్చి… ”శూద్రుడివైన నీకు ఇదే గొప్ప!” అంటూ అవమానించాడు.
1894లో సాహు మహరాజ్‌ పాలకుడిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు… బ్రాహ్మణులు కొల్హాపూర్‌ పరిపాలనా వ్యవస్థలో చాలా స్థానాల్లో గుత్తాధిపత్యం చేజిక్కించుకున్నారు. 500మంది రాజాస్థాన ఉద్యోగులు ఉంటే… అందులో కేవలం పదిమంది బ్రాహ్మణేతరులు మాత్రమే ఉన్నారు. మూడుశాతం జనాభా ఉన్న వర్గం చేతిలో 97శాతం ఉద్యోగాలు కబ్జాకు గురయ్యాయి. ఇది తీవ్ర అన్యాయమని గుర్తించిన సాహు మహారాజ్‌ ఆ తప్పును సరిదిద్దడానికే ఆ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు. నిజానికి మనుస్మృతి సాకుతో కొనసాగిన అన్యాయపు తతంగానికే రిజర్వేషన్లు అని పేరు పెట్టడం సమంజసం. సాహు మహారాజు తీసుకొచ్చిన న్యాయప్రక్రియ… ఆ అక్రమ రిజర్వేషన్ల రద్దు కాబట్టి… దాన్ని ”డీ రిజర్వేషన్‌” అనడమే సమంజసం! సాహు రిజర్వేషన్‌ విధానాన్ని అమలు చేసిన తర్వాత… 1912 నాటికి సుమారు 200మంది బ్రాహ్మణేతర వర్గాల ప్రజలు కొలువు సంపాదించగలిగారు. దేశంలో గతంలో ఎవ్వరూ ఊహించని పరిణామమిది.
రిజర్వేషన్లతో పాటు…ఉచిత, నిర్బంధ విద్యను ప్రవేశపెట్టి తన రాజ్యంలో సమసమాజ నిర్మాణం కోసం ఉద్యమించాడు ఆ ప్రజల రాజు. మతంపై బ్రాహ్మణ ఆధిపత్యమే అన్ని అనర్థాలకు మూల కారణ మని గుర్తించి దాన్ని కూల్చివేయాలని నిర్ణయించు కున్నాడు. రాజ్యంలోని మతపరమైన సంస్థల ఆదాయం, ఆస్తులు ప్రభుత్వా నికి చెందుతాయని 9 జూలై 1917న శాసనం జారీ చేశాడు. దేవాలయాల్లో వెనుకబడిన కులాల వారిని పూజారులుగా నియమించా లని కూడా ఆయన ఆదేశించారు. 1920లో మతపరమైన ఆచారాలను నిర్వహించడంలో వెనుకబడిన వర్గాలకు శిక్షణ ఇవ్వడానికి ఒక వేద పాఠశాలను స్థాపించాడు. బ్రాహ్మణులకు అగ్ర హారాలను కేటాయించే సంప్రదాయానికి కూడా సాహు మహరాజ్‌ తెరదించాడు. తన రాజ్యంలో బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయడంతో పాటు… వారి ఉన్నత విద్య కోసం ఉపకారవేతనాలు, ప్రోత్సాహక బహుమతులు అందించాడు. 1919 బాల్య వివాహాల రద్దు చట్టంతో పాటు… 1919 జులై 12న కులాంతర, వర్ణాంతర వివాహాలను చట్టబద్దం చేస్తూ స్పెషల్‌ మ్యారేజీ యాక్ట్‌ తీసుకొచ్చాడు. 1920 జనవరి 17న జోగిని, దేవదాసీ వ్యవస్థ రద్దు చట్టం వచ్చింది. వ్యభిచార వృత్తిలో ఉన్న స్త్రీలకు పునరావాస పథకాన్ని అమలు పరిచాడు.
వేల సంవత్సరాలుగా మనువాద రిజర్వేషన్ల వ్యవస్థ మన దేశంలో పకడ్బందీగా అమలు జరిగింది. కులదురహంకార శక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మత గ్రంథాలను, దేవుడి పేరును సైతం దుర్వినియోగపరిచారు. ఆ కారణంగా దేశం ఎన్నో విధాలుగా నష్టపోయింది. సాహు, అంబేద్కర్‌, వీపీ సింగ్‌లు తీసుకొచ్చిన సామ్యవాద రిజర్వేషన్లు ఆ నష్టాన్ని పూడ్చడానికి ప్రయత్నించాయి. అయితే… అవి అంతంత ఫలితాలనే ఇచ్చాయని గణాంకాలు నిరూపిస్తున్నాయి. 73ఏండ్ల ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, 30ఏండ్ల ఓబీసీ రిజర్వేషన్ల తర్వాత… వివిధ తరగతులు ప్రభుత్వ ఉద్యోగాల్లో దక్కించుకున్న శాతమెంతో తెలిపే ప్రభుత్వ గణాంకాలు పరిశీలిస్తే… విస్తుగొలిపే వాస్తవాలు బయటపడతాయి. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనెల్‌ అండ్‌ ట్రయినింగ్‌ (డీఓపీటీ) పార్లమెంటుకు సమర్పించిన తాజా నివేదిక ప్రకారం… వివిధ ప్రభుత్వశాఖల్లోని మొత్తం గ్రూప్‌-ఏ పోస్టులు 83,000 పైచిలుకు కాగా, అందులో ఎస్సీలకు 11,004(13శాతం), ఎస్టీలకు 4,400(5శాతం), ఓబీసీలకు 10,500 (13శాతం), ఓసీలకు 57,343(69శాతం) ఉద్యోగాలు దక్కాయి. అదేవిధంగా గ్రూప్‌-బికి చెందిన మొత్తం పోస్టులు 2,90,941లో… ఎస్సీలకు 46,625 (16శాతం), ఎస్టీలకు 20,915 (7శాతం) ఓబీసీలకు 42,995(15శాతం) ఉద్యోగాలు మాత్రమే దక్కగా రిజర్వేషన్‌ సౌకర్యం లేని ఇతర తరగతుల వారు 1,80,406 (62శాతం) ఉద్యోగాలు దక్కించు కున్నారు. న్యాయస్థానాలలో, వ్యాపారరంగంలో… 90శాతం అగ్రవర్ణాల ఆధిపత్యమే కొనసాగుతున్నది. మరోవైపు ఈడబ్ల్యూఎస్‌ పేరుతో… కులవ్యవస్థ బాధితులకు దక్కాల్సిన రిజర్వేషన్లను, కులవ్యవస్థ వల్ల లాభపడ్డ వర్గాలకు అందిస్తున్నారు. సాహు మహారాజ్‌ ఎంతో దూరదృష్టితో సమాజాభివృద్ధిని కాంక్షించి తీసుకొచ్చిన సంస్కరణలను… నేటి పాలకులు నిర్వీర్యపరుస్తున్నారన్నది సుస్పష్టం.
సాహూ మహారాజ్‌ అందించిన ఉద్యమ స్ఫూర్తిని నేటి కాలంలో ముందుకు కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. ఆధునిక రాజ్యంగా ముందుకు సాగాలని కోరుకునే ఏ సమాజమైనా గతంలో జరిగిన చారిత్రక తప్పిదాలను దిద్దుకోవడం… సమ్మిళిత అభివృద్ధిని సాధించడం అత్యంత అవసరం. చరిత్రలో కొందరు స్వార్థపర, కుల దురహంకార శక్తులు… మతనమ్మకాల అండతో కొనసాగించిన సామాజిక వివక్షను సమూలంగా నిర్మూలించి… అన్ని పార్శ్వాలలో సామాజిక న్యాయాన్ని విస్తరించాల్సిన అవసరం ఉన్నది. ఆయా వర్గాలకు అందజేయపడుతున్న రిజర్వేషన్లు, ఇతర సానుకూల చర్యలేవి కూడా వారిపట్ల దయతో… భిక్షగా ఇస్తున్నవి కావు. భరతమాత బిడ్డలందరికీ సమన్యాయం, సమాన అవకాశాలు అందించడ మనేది నవ భారత నిర్మాణ ప్రక్రియలో ఒక భాగంగా సాగాలి. సాహు, ఫూలే. అంబేద్కర్లు చూపిన మార్గంలో… మనువాద నిర్మూలనకు, సమసమాజ స్థాపనకు, సామాజిక న్యాయ శక్తులు ఐక్యంగా ఉద్యమించడమే… ‘రిజర్వేషన్స్‌ డే’ నేడు మనకందిస్తున్న విలువైన సందేశం!
(నేడు ‘రిజర్వేషన్స్‌ డే’)
ఆర్‌. రాజేశమ్‌
9440443183