జంప్‌ జిలానీలు..!

Jump Jilani..!జిలానీ పుంలింగమే అవ్వాల్సిన పనిలేదు. లోక్‌సభకి నిలబెట్టిన తర్వాత అస్త్ర సన్యాసం చేసిన ఒక స్త్రీ మూర్తి, గత కొన్నేండ్లుగా జంటనగరాల మేయర్‌ పదవిపై సవారీ చేసిన మరొక మహిళా ఉన్నారు కాబట్టి ‘జిలానీ’ స్త్రీ లింగం కావాల్సిన పని కూడా లేదు. వస్తున్న పత్రికా కథనాల ప్రకారమైతే ఈ లిస్టు చాలానే ఉంటుందట. పదవుల చుట్టూ పోగేసిన జనం బెల్లం ముక్క జారిపడిపోయిన తర్వాత అక్కడికే ముసురుతారనే విషయం డిసెంబరు ఏడు నాడే అర్థమయిందనుకుంటా. రేవంత్‌ సర్కార్‌ వారంలో పడిపోతుందనో, నెల్లో పడిపోతుందనో మళ్ళీ కేసీఆర్‌ కుర్చీ ఎక్కబోతారని ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎంత వాగాడంబరం ప్రదర్శించినా జనాన్ని ఆపుకోలేక పోతున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు. ఆ కుండకు చిన్న చిల్లు పడుంటే వేలో, కాలో పెట్టి ఆపచ్చు. కాని దాన్నిండా కంతలే! ఎన్నని మూయగలరు? ఎందర్నని ఆపగలరు?
జారిపోయేవారందర్నీ ‘దీర్ఘదర్శులు’గా జమకట్టలేము. మహా అయితే చెరువు మొత్తం ఎండిపోయేలోపు, బయటికి దూకే ‘ప్రాప్తకాలాజ్ఞులే!’ తెలంగాణ సాధనోద్యమం ప్రజలందర్నీ శాశ్వతంగా బంధించివుంచే ‘సిమెంట్‌’కాదు. తెలంగాణ సాకారమైన తర్వాత వివిధ తరగతుల ప్రజలు తమ జీవితాల్లో ఏం మార్పులొచ్చాయో చూసుకోరా? కార్మికులకు కనీస వేతనాలు పెరగలేదు. రైతుల ఆత్మహత్యలు ఆగలేదు. నేతన్నల బతుకులు మారలేదు. ఉపాధి హామీ కూలీల జీవితాలను ఏనాడూ పట్టించుకోని బీఆర్‌ఎస్‌ సర్కార్‌ కౌలు రైతులు అసలు రైతులే కాదని ఢంకా బజాయించి చెప్పింది. ఉత్తర భారతదేశం స్థాయిలో కులోన్మాదం పడగవిప్పింది. కులదురహంకార హత్యలకు తెలంగాణ అడ్డాగా మారింది. వీటిపై నోరు మెదపదు బీఆర్‌ఎస్‌ నాయకత్వం. పైగా కనీసం విభజన చట్టం హామీల కొరకు ప్రజలందర్నీ సమీకరించి పోరాడిందీ లేదు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీల విషయంలో మోడీ సర్కార్‌ ముందు మోకరిల్లింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం. హనీమూన్‌ కాలం ముగిసిన తర్వాత మన రాష్ట్రానికి రావల్సిన బకాయిలపై ఎంత యుద్ధం చేస్తే ఉపయోగమే ముంటుంది.
ప్రస్తుతం పత్రికల వార్తలు చూస్తే జారిపోయే వారిని అధినేత బుజ్జగించే అంశాలు సైతం ‘ఇంతకాలం ఇన్ని పదవులూ అనుభవించి (అంటే సంపాదించుకుని) ఇప్పుడు బయటకు పోవడం ఏం న్యాయమనే’! ఇక్కడ సిద్ధాంతాల్లేవు. డబ్బు చుట్టూనే ఆలోచన. ‘ధనమూలం మిదం జగత్‌’ అనేది!. వీరి కోసమే వచ్చిందేమో! అందుకే రాత్రికి రాత్రే కండువాలు మార్చుకుంటున్నారు. చొక్కాలు విప్పినంత తేలిగ్గా పార్టీలు మారుతున్నారు.
దేశంలో పార్టీలను, ప్రభుత్వాలను లొంగదీసు కునేందుకు గవర్నర్లు, ఈడీలు, ఐటీలు, సీబీఐలు ఇష్టానుసారం వాడుకుంటూ ఇటీవలి సతీష్‌ ఆచార్య కార్టూన్‌ వేసినట్టు ‘కమలం’ గుర్తు వాషింగ్‌ మెషీన్‌లో వేస్తే అవినీతి నుండి శుద్ధి అయి కాషాయం రంగుతో పవిత్రంగా బయటికొస్తున్న స్థితి. దేశవ్యాపితంగా ఎందరో పెట్టుబడి దారులు కం వ్యాపారవేత్తలు కం రాజకీయ నేతలు ఈ బాపతు పార్టీల్లో కనపడుతున్నారు. అందుకే సర్వం డబ్బుమయంగా మారింది. వాళ్ళకు పార్టీలు, సిద్ధాంతాలు కాదు, తమ వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కీలకం. బీజేపీ వంటి పార్టీలకు గొడ్డు మాంసం వ్యాపారం చేసే వాడైనా రూ. కోట్లు వెదజల్లగలిగేవాడైతే చాలు. అక్కున చేర్చుకుని టికెట్టిస్తాయి. దేశంలో పెరుగుతున్న పేదరికం ఈ పార్టీలకో వరం. నెలంతా చాకిరీ చేసినా నాలుగైదు వేల రూపాయలు సంపాదించడమే కష్టమైన పేదలకు ఒక రోజు ఓటుకు దానికి మించిన ధనం రావడం, దానికి అదనంగా వచ్చే ఇతరాంశాలు ఆ ఒక్క రోజుకైనా సంతృప్తినిస్తాయన్న గట్టి నమ్మకం.
ఈ స్థితి శాశ్వతంగా కొనసాగదు. వర్గపోరు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో తీవ్రంగావాలి. ఢిల్లీని గేరి వేసిన రైతు ఉద్యమం ఆనాడు హిందూ, ముస్లిం రైతాంగాన్ని ఐక్యంచేసింది. జాట్‌ చిక్కులను, దళిత కూలీలను చేయి, చేయి కలిపి రైతాంగ సమస్యలపై పోరుకు సిద్ధపడేలా చేసింది. వర్గ పోరే కేరళ వామపక్ష ప్రభుత్వాన్ని, సామాజిక, ద్రావిడ చైతన్యం తమిళనాట స్టాలిన్‌ సర్కార్‌ని కాపాడు కుంటున్నాయి. ఏమైనా రాష్ట్ర పరిణామాలు కాంగ్రెస్‌ కంటే బీజేపీకి ఆనందం కల్గించేవి. రాష్ట్రంలో ఒకేలాంటి విధానాలున్న రెండు పార్టీలే మిగలడం ప్రజలకు, ప్రజా ఉద్యమాలకు నష్టం.