మెదక్‌ జిల్లాలో.. జంప్‌ జిలానీలు

– బీఆర్‌ఎస్‌ టు కాంగ్రెస్‌
– కాంగ్రెస్‌ టు బీఆర్‌ఎస్‌లో చేరికలు
– పార్టీ పిరాయింపులతో క్యాడర్‌లో అయోమయం
– మైనంపల్లి చేరికతో కంఠారెడ్డి రాజీనామా
– నర్సాపూర్‌లో పోటీకి మదన్‌రెడ్డి సై
– కాంగ్రెస్‌లో చేరొచ్చనే ప్రచారం
– కాంగ్రెస్‌ ఆశావాహులపై బీఆర్‌ఎస్‌ గురి
జంప్‌ జిలానీలతో మెదక్‌ జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి…కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లోకి చేరికలు పెరిగాయి. కాంగ్రెస్‌లో కొత్త వాళ్లు చేరడంతో పాత వాళ్లుపార్టీ వీడుతున్నారు. బీఆర్‌ఎస్‌లోనూ పాత వాళ్లు పోవడంతో కొత్తవాళ్లొచి చేరుతున్నారు. పార్టీ పిరాయింపుల జోరు వల్ల ఆ రెండు పార్టీలోని క్యాడర్‌ ఆయోమయానికి గురవుతోంది. మైనంపల్లి కుటుంబం కాంగ్రెస్‌లో చేరి టికెట్లు కొట్టేసే సరికి పార్టీ కోసం పనిచేసిన డీసీసీ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి రాజీనామా చేశారు. నర్సాపూర్‌లోనూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు టికెట్‌ రానందున ఆయన సైతం పోటీకి సై అంటున్నారు. స్వతంత్య్ర అభ్యర్థిగానా కాంగ్రెస్‌ భీ-ఫామ్‌ మీదనా అనేది తేలాలి.

నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి మెదక్‌ జిల్లా రాజకీయ ముఖ చిత్రం రోజుకో మలుపు తిరుగుతోంది. సంగారెడ్డి, సిద్దిపేటలో రాజకీయ పరిస్థితులు నిలకడగా కనిపిస్తుండగా మెదక్‌ జిల్లా రాజకీ యాల్లో మాత్రం శరవేగంగా మార్పులు జరుగుతున్నాయి. మెదక్‌, నర్సాపూర్‌ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల మధ్య పార్టీ పిరాయింపుల వ్యవహారం జోరుగా సాగుతోంది. బుజ్జగింపుల పర్వం కొలిక్కి రాకపోయే సరికి టికెట్లు రాని వాళ్లు పార్టీ మారుత ున్నారు. నోటిపికేషన్‌ వచ్చే నాటికి ఇంకెన్ని చేర్పులు, మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.
మైనంపల్లి రాకతో తిరుపతిరెడ్డి రాజీనామా
మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులుగా ఉన్న కంఠారెడ్డి తిరుపతిరెడ్డి డీసీసీ పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఎంతో కాలంలో కాంగ్రెస్‌ పార్టీలో పనిచేసినా తనకు టికెట్‌ ఇవ్వకుండా డబ్బు సంచులున్న వాళ్లకు అమ్ముకున్నారంటూ తీవ్ర స్థాయిలో కాంగ్రెస్‌ పెద్దలపై ఆరోపణలు చేసి పార్టీకి దూరమయ్యారు. మెదక్‌ టికెట్‌ ఆశించిన తిరుపతిరెడ్డి నాలుగేళ్లుగా పార్టీ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. బీఆర్‌ఎస్‌ పట్ల పెరుగుతున్న వ్యతిరేకత కాంగ్రెస్‌కు కలిసొస్తే ఎమ్మెల్యే కావాలని ఆశపడ్డ తిరుపతిరెడ్డి ఆశలపై మైనంపల్లి కుటుంబం నీళ్లు చల్లింది. మైనంపల్లి రోహిత్‌రావుకు మెదక్‌ టికెట్‌ కన్‌ఫం చేయడంతో తిరుపతిరెడ్డి అసంతృప్తికి గురై పార్టీని వీడారు. మైనంపల్లి కుటుంబం పట్ల వ్యతిరేకత ప్రదర్శించిన తిరుపతి రడ్డిని బీఆర్‌ఎస్‌ వైపు తిప్పుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పావులు కదిపారు. కాంగ్రెస్‌ వీడిన తిరుపతిరెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమంటున్నారు.
మైనంపల్లి ఏడుపాయల రాక వాయిదా
ఢిల్లీలో కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి తండ్రికొడుకులు సోమవారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అక్కడి నుంచి మెదక్‌ జిల్లా ఏడుపాయల వన దేవత దేవాలయం వరకు భారీ కాన్వాయితో ర్యాలీగా వచ్చి పూజలు చేయాలని ప్లాన్‌ చేశారు. పెద్ద ఎత్తున జనసమీకరణ చేస్తున్నట్లు ప్రచారం చేశారు. శంషాబాద్‌లో అనుచరులు స్వాగతం పలికారు. మల్కాజిగిరి ప్రాంతంలో పర్యటించిన మైనంపల్లి తండ్రికొడుకులు ఏడుపాయల పర్యటనను వాయిదా వేసుకున్నారు. తిరుపతిరెడ్డి పార్టీకి రాజీనామా చేయడంతో ఆయన అనుచరులు మైనంపల్లి కార్యక్రమానికి వెళ్లలేదు. పైగా పాత కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు కూడా మైనంపల్లి పట్ల వ్యతిరేకంగా ఉండడంతో ఏడుపాయల కార్యక్రమానికి ఎవ్వరూ పోకూడదని నిర్ణయించారు. దీంతో అధిష్టానం సైతం మెదక్‌లో పరిస్థితుల్ని చక్కబెట్టే వరకు ఆర్బాటాలు చేయకూడదని సూచించినట్లు తెలుస్తోంది. అందుకే ఏడుపాయల పర్యటన ఆగిందనే ప్రచారముంది. మైనంపల్లి అనుచరులు మాత్రం సమయం లేని కారణంగానే ఏడుపాయలకు రాలేదని సర్ధిచెబుతున్నారు.
నర్సాపూర్‌లో మదన్‌రెడ్డి పోటీకి సై..
నర్సాపూర్‌ టికెట్‌ రాని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని తేల్చా రంటున్నారు. సునీతాలక్ష్మారెడ్డి, మదన్‌రెడ్డి మధ్య రాజీ కుదిర్చేందుకు రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లు ప్రయత్నించారు. సునీతారెడ్డి గెలుపుకు సహాకరించాలని మదన్‌రెడ్డిని మంత్రులు కోరారంటున్నారు. అందుకు నిరాకరించిన మదన్‌రెడ్డి పార్టీ భీ-ఫామ్‌ మీద కాకుండా ఇద్దరమూ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తామని, ఎవ్వరు గెలిస్తే వాళ్లు బీఆర్‌ఎస్‌లో కొనసాగుతారనే మెలికి పెట్టినట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయ మని కూడా తేల్చిచెప్పినట్లు సమాచారం. అనుచరులతో చర్చించి స్వంతత్ర అభ్యర్థిగానా లేక కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయాలా అనేది నిర్ణయించే అవకాశముం దంటున్నారు. అదే జరిగితే కాంగ్రెస్‌ నుంచి టికెట్లు ఆశిస్తున్న గాలి అనిల్‌ కుమార్‌, ఆకుల రాజిరెడ్డి, అంజేనేయులు ఇతర ఆశావా హులు కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా..? లేక వాళ్లు సైతం కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మాదిరే కాంగ్రెస్‌ను వీడు తారా..? అనే మీమాంస కొనసాగుతుంది. మదన్‌రెడ్డి కాంగ్రెస్‌ వైపు వెళ్లితే కాంగ్రెస్‌ ఆశావాహుల్ని బీఆర్‌ఎస్‌లో చేర్చుకునేలా మంత్రి హరీశ్‌రావు పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు.