– ప్రజాభవన్‌లో ప్రాజెక్టులపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్
– నేడు అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం
– ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అసెంబ్లీలో ప్రతిపక్షంపై దూకుడుగానే వ్యవహరించాలనీ, ఎట్టి పరిస్థితుల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సబ్జెక్ట్ విషయంలో తడబడవద్దని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్రంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులపై సోమవారం శాసనసభలో శ్వేతపత్రం ప్రకటించనున్న విషయం తెలి సిందే. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో మంత్రులు, కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు కూడా దీనిలో పాల్గొన్నారు. ప్రాజెక్టుల డిజైన్, దానిలోని లోపాలు, రీ డిజైనింగ్ పేరుతో మార్పులు, అంచనా వ్యయం, ఆ తర్వాత పెంచిన వ్యయం, ఆయా ప్రాజెక్టుల నిర్మాణం వల్ల సాగులోకి వచ్చిన భూమి ఎంత? ప్రాజెక్టుల డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)లో ఏమని పేర్కొన్నారు? దానికి భిన్నంగా నిర్మాణాలు ఎలా చేశారు? నిర్మాణాల్లోని నాణ్యత, ఏఏ ప్రాజెక్టుల్లో ఎంత అవినీతి జరిగింది అనే అంశాలపై వారికి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో వ్యవహరించాల్సిన వ్యూహాన్ని కూడా వివరించారు. అలాగే కృష్ణా నదిపై ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే విషయంలో నెలకొన్న వివాదంపైనా ప్రజాప్రతినిధులకు స్పష్టత ఇచ్చారు. గడచిన పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వమే కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తామని కేంద్ర సమావేశాల్లో సంతకాలు చేసి రావడం, రాష్ట్రంలో అందుకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నం చేయడం వంటి పలు అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఎవరెవరు ఏఏ అంశాలు మాట్లాడాలో కూడా వారికి దిశానిర్దేశం చేశారు. అలాగే 13వ తేదీ కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సందర్శించనున్నారు. దీనిపై రేపు సాయంత్రం నిర్ణయం తీసుకోవాలని భావించినట్టు సమాచారం. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపక్షనేత కే చంద్రశేఖరరావు సహా బీఆర్‌ఎస్, బీజేపీ,ఎంఐఎంం ఎమ్మెల్యేలను కూడా మేడిగడ్డకు రావాలని ఆహ్వానించిన విషయం తెలిసిందే.
కేసీఆర్‌వి సెంటిమెంట్ రాజకీయాలు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
కష్ణా జలాలపై సోమవారం అసెంబ్లీలో స్పష్టత ఇస్తామని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య చెప్పారు. ప్రజాభవన్‌లో ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనంతరం ఆయన్ని కలిసిన విలేకరులతో మాట్లాడారు. మంగళవారం నల్గొండలో మాజీ సీఎం కేసీఆర్ మీటింగ్ మొదలయ్యేలోపు తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పేస్తామన్నారు. ఏపీ సీఎం జగన్ కోసం కేసీఆర్ తెలంగాణ నీళ్లను ఆంధ్రప్రదేశ్‌కి తరలించారనీ, ఇప్పుడు సెంటిమెంట్ వాడుకుందామని చూస్తే ప్రజలు బుద్ధి చెప్తారని విమర్శించారు. ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చి ఓట్లు కొల్లగొట్టడంలో కేసీఆర్ దిట్ట అనీ, ఎన్నికల్లో ఓట్ల కోసం పోలింగ్ రోజు డ్రామాలు చేశారనీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో దోచుకున్న నిధుల్ని ఎన్నికలకు వాడుతున్నారని ఆరోపించారు.