– ప్రథమ సంవత్సరం తరగతులు కూడా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 2023-24 విద్యాసంవత్సరం ప్రారంభమైంది. గురువారం నుంచి జూనియర్ కాలేజీలు పున:ప్రారంభమవుతు న్నాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరంతోపాటు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కూడా తరగతులు ప్రారంభం కానున్నాయి. గతనెల 15 నుంచి జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతున్నది. మొదటివిడత ప్రవేశాల ప్రక్రియ ఈనెల 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది. రెండో విడత ప్రవేశాల ప్రక్రియ తేదీలను తర్వాత ప్రకటించనున్నట్టు వెల్లడించింది.
జులైలోనే పాఠ్యపుస్తకాలు!
రాష్ట్రంలో గత విద్యాసంవత్సరంలో 407 ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయి. వాటిలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 1,10,130 మంది, ద్వితీయ సంవత్సరంలో 86,291 మంది కలిపి 1,96,421 మంది విద్యార్థులు చదివారు. పది శాతం అదనంగా కలిపి పాఠ్యపుస్తకాలను ముద్రించి ఇవ్వాలంటూ తెలుగు అకాడమీకి ఏప్రిల్‌లోనే ఇంటర్ బోర్డు అనుమతి ఇచ్చింది. అయితే తెలుగు అకాడమీకి శాశ్వత డైరెక్టర్‌ను ప్రభుత్వం నియమించలేదు. ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్నారు. తెలుగు అకాడమీపై సరైన శ్రద్ధ వహించకపోవడం వల్ల ఇంటర్ పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రక్రియ ఆలస్యమైంది. గతనెల 25న నిర్ణయం ప్రక్రియ ఆలస్యమైంది. గతనెల 25న నిర్ణయం తీసుకుని 26వ తేదీన ముద్రణ కోసం ప్రింటర్లకు ఆదేశాలిచ్చారు. పాఠ్యపుస్తకాల ముద్రణకు రెండు వారాల సమయం పడుతుందని తెలుస్తున్నది. ఆ తర్వాత వాటిని గోడౌన్లలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మీడియం, జిల్లా, కాలేజీ వారీగా వేరు చేస్తారు. అనంతరం టీఎస్‌ఆర్టీసీ కార్గో సేవల ద్వారా కాలేజీలకు పంపిస్తారు. ఇందుకోసం మరో రెండు వారాల సమయం పడుతుంది. అంటే పాఠ్యపుస్తకాలు విద్యార్థుల చేతుల్లోకి వచ్చేది వచ్చేనెలలోనే అని అర్థమవుతున్నది. అది ఇప్పుడు ప్రణాళిక ప్రకారం జరిగితేనే. ఒకవేళ ఎక్కడ ఇబ్బంది వచ్చినా పుస్తకాలు మరింత ఆలస్యమవుతాయి. అంటే గురువారం నుంచి విద్యార్థులు కాలేజీలకు వచ్చినా పాఠ్యపుస్తకాలు లేకుండానే నెలరోజుల వరకు గడపాల్సి ఉంటుంది.