న్యాయం కోసం జూనియర్ డాక్టర్ల ర్యాలీ

Junior doctors rally for justiceనవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలో ట్రైనీ వైద్యురాలిపై జరిగిన లైంగికదాడి, హత్య ను ఖండిస్తూ దేశవ్యాప్త జూడాల నిరసనలో భాగంగా శుక్రవారం నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుండి గడియారం సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బైకులపై కలెక్టరేట్ కు ర్యాలీగా వెళ్లి జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ అత్యాచారం, హత్య చేసిన నిందితులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ల్లగొండ జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు అధికారులు చేపట్టాలని డిమాండ్ చేశారు. మెడికల్ కళాశాలలో అన్ని సౌకర్యాలు అసంపూర్తిగా ఉన్నాయని, విధుల నిర్వహణలో (షిఫ్ట్ ప్రాబ్లమ్స్) డాక్టర్లు, విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర విభాగాలైన ఐసీయూ, ఎం సి హెచ్ వంటి ప్రాంతాలలో సెక్యూరిటీని నియమించాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సురక్షితమైన డ్యూటీ రూములను ఏర్పాటు చేయటం తో పాటు, సురక్షితమైన రవాణా సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా క్యాజువాలిటీలో సింగిల్ వాష్ రూమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ జిఎంసి నల్లగొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎస్ కే అబ్దుల్ సమద్, డాక్టర్ జనరల్ కార్యదర్శి గగన్, డాక్టర్ సత్య సాయి కృష్ణ, డాక్టర్ బాలు, డాక్టర్ ఇంద్రాణి, డాక్టర్ షాబాజ్, డాక్టర్ హిమాన్షి, డాక్టర్ ఆశ్లేషవల్లి,డాక్టర్ సంప్రీత్, డాక్టర్ హనన్, డాక్టర్ నరేష్ పాల్గొన్నారు.