24 నుంచి జూనియర్‌ డాక్టర్ల సమ్మె

– డీఎంఈకి నోటీసు అందజేత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 24 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్టు తెలంగాణ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (టీజూడా) తెలిపింది. ఈ మేరకు మంగళారం అసోసియేషన్‌ నాయకులు రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు డాక్టర్‌ వాణిని కలిసి సమ్మె నోటీసును అందజేశారు. గత నెలలోనే సమ్మె నోటీస్‌ ఇచ్చినప్పటికీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో తాత్కాలికంగా సమ్మెను వాయిదా వేశారు. అయితే తాము ప్రభుత్వం ముందు ఉంచిన డిమాండ్లలో ఒక్క డిమాండ్‌ను కూడా తీర్చలేదనీ, అందుకే తప్పనిసరి పరిస్థితిలో సోమవారం నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్టు వారు తెలిపారు. గతంలో నోటీసు ఇచ్చి దాదాపు నెల గడిచినా ఎటువంటి పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నుంచి అనుకూలమైన చర్యలు లేవని అసంతప్తి వ్యక్తం చేశారు. డిమాండ్లను నెరవేర్చడంలో సంబంధిత అధికారులు చొరవ తీసుకుంటే మెరుగైన ఆరోగ్య సేవలందించేందుకు వీలుంటుందని సూచించారు. నిర్దేశిత సమయంలో ఉపకార వేతనాల విడుదల, పెండింగ్‌ స్టైఫండ్స్‌ విడుదల, సూపర్‌ స్పెషాలిటీ సీనియర్‌ రెసిడెంట్లకు గతంలో ఒప్పుకున్న మేరకు స్టైఫండ్‌, ఆంధ్రప్రదేశ్‌ సీట్లలో తెలంగాణ విద్యార్థులకు 15 శాతం రిజర్వేషన్‌, ప్రభు త్వాస్పత్రుల్లో భద్రత, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లకు సరిపడేలా కొత్త హాస్టళ్ల నిర్మాణం, ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రికి కొత్త భవన నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్‌ చేశారు. డీఎంఈని కలిసి నోటీసు అందజేసిన వారిలో అసోసి యేషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ డి.శ్రీనాథ్‌, అధ్యక్షులు డాక్టర్‌ సీహెచ్‌.జీ.సాయి శ్రీహర్ష, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జె.ఐజక్‌ న్యూటన్‌ తదితతరులున్నారు.