కాంగ్రెస్‌లోకి జూపల్లి

into Congress Jupalli– ఖర్గే సమక్షంలో చేరిక
– మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి తదితరులు కూడా
న్యూఢిల్లీ : మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరారు. ఆయనతో పాటు కొడగంల్‌ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్‌ రెడ్డి కుమారుడు రాజేష్‌, కొడంగల్‌ మున్సిపల్‌ చైర్మెన్‌ జగదీశ్వర్‌ రెడ్డి, ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్‌, రిటైర్డ్‌ ఎఎస్‌పీ నాగరాజుతో పాటు పలువురు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. గురువారం నాడిక్కడ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నివాసంలో పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరారు. వారిని ఖర్గే కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌, ఇంచార్జ్‌ మాణిక్‌ రావు ఠాక్రే, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, సంపత్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణాలో రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనన్నారు. డిసెంబర్‌ 9న సోనియా గాంధీ పుట్టిన రోజునాటి కల్లా కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తుందని జోస్యం చెప్పారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని, యువతకు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఐదులక్షల ఇల్లు నిర్మిస్తామని, రూ.500లకే గ్యాస్‌ ఇస్తామని తెలిపారు. ఆరోగ్య శ్రీ 5 లక్షలకు పెంచుతామని తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లది ఫెవికాల్‌ బంధమని విమర్శించారు. కేసీఆర్‌ లిక్కర్‌ను నమ్మకున్నారనీ, లిక్కర్‌ కింగ్‌గా మారారని విమర్శించారు. కేసీఆర్‌ అంతర్జాతీయ క్రిమినల్‌ చార్లెస్‌ శోభరాజ్‌ శిష్యుడని ధ్వజమెత్తారు. జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తొమ్మిదేండ్ల కేసీఆర్‌ పాలన చూస్తే చాలా బాధ కలుగుతోందని అన్నారు. వందలాది మంది ప్రాణ త్యాగాలు చేసి తెచ్చుకున్న రాష్ట్రమేనా? అని అన్నారు. కర్నాటకలో అవినీతి బీజేపీ సర్కారును ఓడించిన మాదిరిగా, అంతకు మించి అవినీతిలో కూరుకున్న కేసీఆర్‌ సర్కారును కూడా ఓడించాలన్నారు. కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి మానిక్‌ రావు ఠాక్రే మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీలోకి బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు వచ్చి చేరుతున్నారనీ, కేసీఆర్‌కు తాను, తన కుటుంబం తప్ప ఇంకేమీ అవసరం లేదని విమర్శించారు. అందుకే ఆ పార్టీలో నేతలు విసిగిపోయి బయటకు వస్తున్నారని అన్నారు.