– ఐరాస మానవతా విభాగం చీఫ్ టామ్ ఫ్లెచర్
జెనీవా : ఇజ్రాయిల్ భీకర దాడులతో గాజాలోని జనాభాలో సగం మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఎట్టకేలకు గత నెలలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో అక్కడి పరిస్థితుల్లో కొంత మార్పు కనిపిస్తోంది. ఇప్పటికే లక్షలాది మంది నిరాశ్రయులు స్వస్థలాల బాటపట్టారు. పెద్ద ఎత్తున సహాయ సామగ్రి గాజాలోకి ప్రవేశి స్తోంది. దీంతో స్థానికంగా కరవు దాదాపు తగ్గు ముఖం పట్టిందని ఐక్యరాజ్యసమితి (ఐరాస) మానవతావాద విభాగం చీఫ్ టామ్ ఫ్లెచర్ వెల్లడించారు. శాంతి ఒప్పందం అమలులో అవాంతరాలు ఎదురైతే మాత్రం సమస్య పునరావతం కావొచ్చని హెచ్చ రించారు.20 లక్షలకుపైగా ఉన్న జనాభాకు మరిన్ని ఆహార, వైద్య సరఫరాలు అవసరం. ఆస్పత్రులు, పాఠశాలలు, నివాసాలనే తేడా లేకుండా భవనాలన్నీ నేలమట్టమైన నేపథ్యంలో.. నిరాశ్రయులకు టెంట్ల వంటి తాత్కాలిక ఆవాసాలు అందించాలి. కాల్పుల విరమణ ఉల్లంఘనకు గురైతే మాత్రం మళ్లీ కరవు పరిస్థితులు ఏర్పడతాయి. ప్రస్తుత శాంతి ఒప్పందం అనేక మంది ప్రాణాలను కాపాడింది. హమాస్, ఇజ్రాయిల్‌లు దీనికి కట్టుబడి ఉండాలి” అని ఫ్లెచర్ ఓ వార్తా సంస్థతో మాట్లాడారు.గాజాలో రెండు రోజుల పాటు పర్యటించిన ఫ్లెచర్ అక్కడి దుస్థితిని వివరించారు. ”బాంబు దాడులతో గాజా శిథిలాల కుప్పగా మారింది. ఇప్పుడిప్పుడే ఇండ్ల కు చేరుకుంటున్న ప్రజలు.. శిథిలాల్లో తమవారి మ ృతదేహాల కోసం అన్వేషణ చేపడుతున్నారు. శవాల కోసం శునకాలూ తచ్చాడుతున్నాయి. అదంతా ఓ హారర్ సినిమాలా ఉంది. కిలోమీటర్ల మేర ఇదే దుస్థితి. అవన్నీ చూస్తుంటే హ దయం ద్రవించింది” అని స్థానిక పరిస్థితులను కండ్లకు కట్టారు. ఇదిలా ఉండగా.. గత నెల 19న కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 12 వేలకుపైగా సహాయ ట్రక్కులు గాజాలోకి ప్రవేశించినట్టు ఐరాస మానవతా విభాగం వెల్లడించింది.