డబ్బులు ఇవ్వట్లే..!

ధాన్యం రైతుల తిప్పలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఓవైపు అకాలవర్షాలు.. మరోవైపు కొనుగోళ్లలో జాప్యం.. తరుగు పేరుతో మిల్లర్ల దగా.. ఇవి చాలవన్నట్టు నెలల తరబడి చెల్లింపులు లేక పోవడంతో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు విక్రయించిన వారం రోజుల్లో డబ్బులు జమ చేస్తామన్న అధికారులు 40 రోజులైనా డబ్బులు ఇవ్వకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురుస్తుండటంతో ఖరీఫ్‌ పెట్టుబడుల కోసం డబ్బులు లేవని.. త్వరగా ఇచ్చేలా చూడాలని కోరుతున్నారు.
– ధాన్యం నగదు కోసం రైతుల అష్టకష్టాలు
– ఖరీఫ్‌ విత్తనాలకూ లేవని ఆవేదన
– రాష్ట్రవ్యాప్తంగా 50లక్షల మెట్రిక్‌ క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు
– ఖమ్మం జిల్లాలోనే 80 శాతం చెల్లింపులు పెండింగ్‌
– వెంటనే చెల్లిస్తున్నామంటున్న పౌరసరఫరాల మంత్రి
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో రైతులు సొసైటీ కార్యాలయం నుంచి సీఈవో, సిబ్బందిని బయటకు పంపించి ధర్నా చేశారు. ధాన్యం డబ్బులు చెల్లించాకే పచ్చిరొట్ట విత్తనాలు విక్రయించాలని అడ్డుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై ఒత్తిడి తెస్తున్నారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అధికారులు, మిల్లుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొనుగోలు పూర్తయిన వెంటనే రైతుల అకౌంట్లో ఆన్‌లైన్‌ ద్వారా నేరుగా డబ్బులు జమ చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతున్నది. కానీ ఇంకా 60 శాతం పైగా రైతులకు ధాన్యం డబ్బులు అందలేదు.
డబ్బుల సంగతేంటి..?
దేశంలోనే రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు 50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గుంగుల కమలాకర్‌ చెబుతున్నారు. 8 లక్షల మంది రైతుల నుంచి రూ.10,200 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని సేకరించామని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడువేలకు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పటికే 1,400 కేంద్రాల్లో వడ్ల సేకరణ పూర్తవడంతో వాటిని మూసివేసినట్టు చెబుతున్నారు. దీనిలో ఉమ్మడి నల్లగొండ, నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల్లో సగానికి పైగా కేంద్రాలను మూసివేసినట్టు మంత్రి వెల్లడించారు. కానీ పలుకేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యానికి నెలరోజులైనా డబ్బులు అకౌంట్లలో పడలేదని తెలుస్తోంది. రూ.10,200 కోట్లలో ఇంకా సగం మంది రైతులకు డబ్బులు చెల్లించాల్సి ఉందని అధికారిక వర్గాల సమాచారం.
ఖమ్మం జిల్లాలో 80 శాతం రైతుల ఎదురుచూపు
ఖమ్మం జిల్లాలో 80 శాతం మంది రైతులు వడ్ల నగదు కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 236 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ప్రస్తుతం 198 కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్నారు. కొనుగోళ్లు పూర్తవడంతో 38 కేంద్రాలను మూసివేశారు. ఏప్రిల్‌ రెండోవారంలో తెరుచుకున్న ఈ కేంద్రాల్లో ఇప్పటి వరకు 15,298 మంది రైతులు 1.23 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని విక్రయించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 90కి పైగా రైస్‌మిల్లులకు ధాన్యం కేటాయించారు. ఖమ్మంలో 50కి పైగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 35కు పైగా మిల్లుల్లో ధాన్యం తీసుకుంటున్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రైతులకు రూ.253 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు 2,247 మంది రైతులకు రూ.31 కోట్లకు పైగా డబ్బులు మాత్రమే అకౌంట్లలో జమ చేశారు. తిరుమలాయపాలెం, తల్లాడ, కూసుమంచి, నేలకొండపల్లి, కామేపల్లి మండలాల్లోని పలుకేంద్రాల పరిధిలోని రైతులు వడ్లు విక్రయించి 40 రోజులవుతున్నా నేటికీ రూపాయి అందలేదని వాపోతున్నారు.
మృగశిర ముంచుకొస్తున్నా పూర్తికాని ధాన్యం సేకరణ
      ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 11లక్షల ఎకరాల్లో వరి సాగవ్వగా.. సుమారు 20లక్షల మేరకు ధాన్యం దిగుబడి వస్తుందని తొలుత అధికారులు అంచనా వేశారు. తీరా పంట కోత సమయానికి కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానతో ధాన్యమంతా నేలపాలైంది. అందులో మిగిలిన ధాన్యం, కోసిన పంటను అంచనా గట్టి సుమారు 11.81లక్షల మెట్రిక్‌ ధాన్యం సేకరణ లక్ష్యంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు మళ్లీ లక్ష్యాలు నిర్దేశించింది. అందులో ఇప్పటి వరకు 80శాతం మాత్రమే కొనుగోలు చేశారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. కరీంనగర్‌ జిల్లాలో 2.23లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యానికిగాను 2.41లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించారు. జగిత్యాల జిల్లాలో 4.55లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యానికిగాను, 3లక్షల మెట్రిక్‌ టన్నులే సేకరించారు. పెద్దపల్లి జిల్లాలో 3.4లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యానికిగాను 2.30లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.
రాజన్నసిరిసిల్ల జిల్లాలో 1.88లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యానికిగాను 1.71లక్షల ధాన్యం సేకరించారు. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1.40లక్షల మంది రైతుల నుంచి 9.58లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం సేకరించారు. ఇంకా 2.20లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది.అసలే అకాల వర్షాలకు రావాల్సిన దిగుబడిలో సగమే చేతికి వచ్చినా.. ప్రభుత్వం మాత్రం మృగశిర కార్తె ముంచుకొస్తున్నా.. ఇంకా పూర్తి చేయకపోవడం గమనార్హం.
48 రోజులైనా డబ్బులు జమకాలేదు..
945 టిక్కీల ధాన్యం కాంటా వేసి బుధవారం నాటికి సరిగ్గా 48 రోజులైంది. వరి కోత మిషినోళ్లు, కాంటాలు వేసినోళ్లు, పురుగుమందుల కొట్టోళ్లు.. అందరూ ఇంటి చుట్టూ డబ్బుల కోసం తిరుగుతున్నారు. రేపు, ఎల్లుండి అని చెప్పుకుంటా వస్తున్నా. కాంటాలు పెట్టిన వారంలోపు ఇస్తామన్న డబ్బులు సుమారు.. నెలన్నర అయినా ఇవ్వకపోతే మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి. వర్షాలు పడుతున్నాయి. మళ్లీ విత్తనాలు, ఎరువుల కోసం డబ్బులు ఎవరిని అడగాలి. అందుకే ఆందోళన చేశాం.
– బొగ్గుల పుల్లారెడ్డి, కృష్ణాపురం, తల్లాడ
సకాలంలో కొనట్లేదు..కొన్నా డబ్బులు ఇవ్వట్లేదు..
ప్రతి గింజా కొంటామన్న ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేసినా వివిధ కారణాలతో కాంటాలు సకాలంలో వేయలేదు. వేసినా.. ధాన్యం డబ్బులు వారంలో ఇస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా ఇవ్వట్లేదు. ఎన్నోసార్లు ఆందోళన చేస్తే కలకోటలో ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కుర్నవల్లిలో ఇంకా కాంటాలు కాలేదు. ఓవైపు వర్షాలు వస్తున్నాయి. విత్తనాలు, ఎరువుల కోసం పెట్టుబడులకు డబ్బులు కావాలి. కొర్రీలు పెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకునేది లేదు.
– తాతా భాస్కర్‌రావు,తెలంగాణ రైతు సంఘం సీనియర్‌ నాయకులు