టెక్నాలజీపై ఆధారపడడం వల్ల కలిగే దుష్పరిణామాలను చూశాం : జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌

నవతెలంగాణ మద్రాస్: టెక్నాలజీపై ఆధారపడడం వల్ల కలిగే దుష్పరిణామాలను నిన్ననే చూశామన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్. మద్రాస్‌ హైకోర్టు మధురై బెంచ్‌ ఏర్పాటుచేసి 20 ఏండ్లు అయిన సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైక్రోసాఫ్ట్‌ సాంకేతిక లోపం నేపథ్యంలో శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన గందరగోళ పరిస్థితులపై స్పందించారు. మైక్రోసాఫ్ట్‌ అప్‌డేట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా విమానాలపై తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. ఢిల్లీ, హైదరాబాద్‌ సహా పలు నగరాల్లో విమానాలు పెద్ద ఎత్తున రద్దయ్యాయి. అలాగే కోర్టుల్లో ప్రత్యక్ష ప్రసారాలపై సైతం ప్రతికూల ప్రభావం పడింది. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ తాను సాంకేతిక ప్రయోజనాలను విశ్వసిస్తున్నానన్నారు. అయితే, టెక్నాలజీపై ఆధారపడడం వల్ల కలిగే దుష్పరిణామాలను నిన్ననే చూశామన్నారు. మధురై ప్రజల ప్రేమ కారణంగా తాను ఈ రోజుకు ఇక్కడ ఉండగలిగానని సీజేఐ పేర్కొన్నారు.
మధురైని తుంగా నగరం, నిద్రపోని నగరంగా పిలుస్తారన్నారు. నగరానికి వచ్చేవారి కోసం మార్కెట్లు ఎప్పుడూ ప్రజల కోసం తెరిచే ఉంటాయన్నారు. గొప్పనగరం ఆతిథ్య సంస్కృతిని ప్రతిబింబిస్తుందని.. కాబట్టి మద్రాస్‌ హైకోర్టు శాశ్వత బెంచ్‌గా మధురైని ఎంపిక చేయడంలో ఆశ్చర్యం లేదన్నారు. ‘న్యాయం ఎప్పుడూ నిద్రపోదు అనేదానికి మధురై శాశ్వత చిహ్నం’ అని సీజేఐ పేర్కొన్నారు.