న్యాయకోవిదుడు ఫాలి నారిమన్‌ కన్నుమూత

Justice Fali Nariman passed away– ప్రముఖుల సంతాపం
న్యూఢిల్లీ : ప్రముఖ న్యాయ కోవిదుడు, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఫాలి శామ్‌ నారిమన్‌ బుధవారం న్యూఢిల్లీలో కన్నుమూశారు. ఆయన వయస్సు 95 సంవత్సరాలు. 1991లో పద్మభూషణ్‌, 2007లో పద్మ విభూషణ్‌ పురస్కారాలు అందుకున్న నారిమన్‌ 70 సంవత్సరాలకు పైగా న్యాయవాద వృత్తిలో కొనసాగారు. 1950లో బాంబే హైకోర్టులో న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన నారిమన్‌ 1961 నాటికి సీనియర్‌ న్యాయవాది హోదా పొందారు. 1972లో ఆయన భారత అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా నియమితులయ్యారు. అయితే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించడాన్ని వ్యతిరేకిస్తూ 1975లో పదవికి రాజీనామా చేశారు. 1999లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్‌ అయిన నారిమన్‌ 2005 వరకూ ఆ పదవిలో కొనసాగారు. 1991 నుంచి 2010 వరకూ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వర్తించారు. 1989 నుంచి 2005 వరకూ పారిస్‌లోని ఇంటర్నేషనల్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కు చెందిన అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టుకు వైస్‌ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. నారిమన్‌ అనేక న్యాయ శాస్త్ర గ్రంథాలు రచించారు. గాడ్‌ సేవ్‌ ది ఆనరబుల్‌ సుప్రీంకోర్టు, బిఫోర్‌ మెమరీ ఫేడ్స్‌, ది స్టేట్‌ ఆఫ్‌ ది నేషన్‌ వాటిలో కొన్ని. ఆయన కుమారుడు రోహింగ్టన్‌ నారిమన్‌ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. కుమార్తె అనహీత.
మయన్మార్‌లోని రంగూన్‌లో 1929 జనవరి 10న ఫాలి నారిమన్‌ జన్మించారు. సిమ్లా, ముంబయిలో విద్యాభ్యాసం చేశారు. 1955లో బాప్సీని వివాహం చేసుకున్నారు. నారిమన్‌ అనేక ప్రతిష్టాత్మక కేసుల్లో వాదించారు. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన కేసులో యూనియన్‌ కార్బైడ్‌ తరఫున వాదించారు. ఆ తర్వాత తప్పు తెలుసుకొని బాధితులు, కంపెనీ మధ్య నష్టపరిహారం విషయంలో ఒప్పందం కుదిరేలా చూశారు. ఆర్టికల్‌ 370పై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన తప్పుపట్టారు.
ప్రముఖుల సంతాపం
నారిమన్‌ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన అత్యుత్తమ న్యాయవాదులు, మేధావుల్లో ఒకరని ప్రధాని మోడీ కొనియాడారు. సామాన్యులకు న్యాయం అందించడానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని ప్రశంసించారు. నారిమన్‌ మేథోసంపద అపారమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ తెలిపారు. రాజ్యాంగం యొక్క పవిత్రతను కాపాడే విషయంలో అనేక మంది న్యాయ నిపుణులకు నారిమన్‌ స్ఫూర్తినిచ్చారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. నారిమన్‌ మరణం న్యాయ వ్యవస్థకు తీరని లోటని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. నారిమన్‌ మరణంతో ఓ యుగం ముగిసిందని సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి వ్యాఖ్యానించారు. దేశం గొప్ప న్యాయవాదిని కోల్పోయిందని సుప్రీంకోర్టుకే చెందిన మరో న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్‌ సిబాల్‌ చెప్పారు. సీనియర్‌ న్యాయవాదులు ఇందిరా జైసింగ్‌, ప్రశాంత్‌ భూషణ్‌ తదితరులు నారిమన్‌ మృతికి సంతాపం తెలియజేశారు.