ప్రతిభ కంటే న్యాయం ముఖ్యమైందని, అందరికీ సమన్యాయం దక్కాలని, అన్యాయానికి గురైన వాళ్ళు ప్రశ్నిస్తే సమాజం చైతన్యవంతమవుతుందని ప్రొ. జి. హరగోపాల్ అన్నారు.శనివారం ఉస్మానియా యూనివర్సిటీ, ఠాగూర్ ఆడిటోరియంలో ప్రొఫెసర్ సి. కాశీం అధ్యక్షతన జరిగిన “ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలుకై మేధావుల సంఘీభావ సభ”కి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పీడిత కులాల తరఫున ఈ సభలో మాట్లాడటం నాకు దొరికిన గొప్ప అవకాశమని అన్నారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ. ఒక జడ్జిగా అన్ని కోణాల నుండి శాస్త్రీయంగా పరిశీలించి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అనేది రాజ్యాంగబద్ధమైన అని చెప్తున్నానని అన్నారు. మాల, మాదిగలు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సమస్యను పరిష్కరించుకొని భవిష్యత్తు ఉద్యమాల నిర్మాణంలో క్రియాశీలకంగా పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మరొక అతిథి ఎమ్మెల్సీ ప్రొ. కోదండరాం మాట్లాడుతూ. సమాన అవకాశాలు కల్పించడానికి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఒక సాధనంగా ఉపయోగపడుతుందని, దానికి చట్టపరంగా, రాజకీయపరంగా ఉన్న ఆటంకాలను తొలగించి వర్గీకరణ అమలు అయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. సుదీర్ఘ పోరాటం చేసి విజయం ముంగిట్లో ఉన్న ఉద్యమాన్ని ఈ సందర్భంగా వారు అభినందించారు. మరొక ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ. దేశంలోని ఐక్య ఉద్యమాలకు పునాదిగా వర్గీకరణ ఉద్యమం పనిచేసిందని, ఈ వర్గీకరణ ఉద్యమం సూక్ష్మ స్థాయి సమస్యలను బయటకు తీసుకువచ్చిందని అన్నారు. వీలైనంత తొందరగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రొ. కె. నాగేశ్వర్ మాట్లాడుతూ. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అనే న్యాయమైన డిమాండ్ తో గత 30 ఏళ్లుగా దండోర ఉద్యమం సాగుతుందని, ఈసారి తప్పనిసరిగా వర్గీకరణ జరిగి రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానంగా అందుతాయని అన్నారు. జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ. ఎస్సీ రిజర్వేషన్ ను వర్గీకరించి తీరాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలందరికీ ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యా, వైద్యం కల్పించే విధంగా భవిష్యత్తు ఉద్యమాలు నిర్మాణం కావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న, డా. కె. శ్రీనివాస్, డా. నందిని సిధారెడ్డి, విమలక్క, ప్రొ. సూరెపల్లి సుజాత, ప్రొ. భాంగ్య భూఖ్య, ప్రొ. ఈసం నారాయణ, ప్రొ. ఆరెపల్లి రాజెందర్, బూరం అభినవ్, గజవెల్లి ఈశ్వర్, వెంకట్ మారోజు, అన్ని జిల్లాల నుంచి ఉద్యోగస్తులు, మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.