జస్టిస్‌ కొండా మాధవ రెడ్డి జీవితం

– యువతరానికి స్ఫూర్తిదాయకం :ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దివంగత జస్టిస్‌ కొండా మాధవ రెడ్డి జీవితం యువతరానికి స్ఫూర్తిదాయకమని ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌ తెలిపారు. దివంగత జస్టిస్‌ కొండా మాధవరెడ్డి 100వ జయంతిని పురస్కరించుకుని ఆయన గౌరవార్థం ప్రత్యేక పోస్టల్‌ కవర్‌ను హైదరాబాద్‌లోని గగన్‌మహల్‌లో ఏవీ కళాశాలలో బుధవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌, పుదుచ్చేరి గౌరవ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌ మాట్లాడుతూ కొండా మాధవరెడ్డి ఆంధ్రప్రదేశ్‌, బాంబే హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా, మహారాష్ట్ర గవర్నర్‌గా పని చేశారని తెలిపారు. ఆయన్ను ఎప్పుడూ కలవకపోయినా ఆయన గురించి బాగా తెలుసన్నారు. న్యాయ, విద్యా వ్యవస్థలో శాశ్వతమైన కషి చేసిన దూరదృష్టి కలిగిన వ్యక్తి అన్నారు. మృదుస్వభావి, ఆలోచనాపరుడని పేర్కొన్నారు. విలువలతో జీవించాలి, విలువలను సృష్టించాలని తన జీవితం ద్వారా చాటారన్నారు. ఆయన ఏదైతే నమ్మారో దానిని తూచా తప్పకుండా పాటించారని చెప్పారు. అనేక విద్యా, సామాజిక, సాంస్కృతిక సంస్థలను స్థాపించారని గుర్తుచేశారు. ఆయన తన కంటే ముందు ఉన్నవారి నుంచి ప్రేరణ పొందారన్నారు. యువ న్యాయవాదులను కొండా మాధవరెడ్డి పూర్తి సామర్థ్యంతో పని చేసేలా ప్రోత్సహించారని తెలిపారు. న్యాయ వ్యవస్థతో ఉన్న అనుబంధం కారణంగానే కాకుండా తన మూలాలను మరచిపోని వ్యక్తిగా చరిత్రలో నిలిచారన్నారు. సేవ, న్యాయం, కరుణ.. ఇవి సమగ్ర సమాజం, శక్తివంతమైన ప్రజాస్వామ్యానికి పునాది అని ఉపరాష్ట్రపతి తెలిపారు. దశాబ్ద కాలంగా న్యాయవ్యవస్థ గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. నేషనల్‌ జ్యుడీషియల్‌ డేటా గ్రిడ్‌ ద్వారా డిజిటలైజేషన్‌తో పారదర్శకత పెరిగి పెండింగ్‌ కేసుల తగ్గుదలకు దోహదపడిందన్నారు. చట్టపరమైన సంస్కరణలతో వాణిజ్య న్యాయస్థానాల స్థాపన, మధ్యవర్తిత్వ చట్టాలకు సవరణలు, వేగంగా వివాదాల పరిష్కారానికి ఉపయోగపడ్డాయన్నారు. నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యక్రమాలు సమాజంలోని అణగారిన వర్గాలకు న్యాయ సహాయ యంత్రాంగాలను బలోపేతం చేయడానికి, అందరికీ న్యాయం జరిగేలా చూసేందుకు వీలు కల్పించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ ఆరాధే, భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బీ సుదర్శన్‌ రెడ్డి, తెలంగాణ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ పీవీఎస్‌ రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ రాంచంద్రారెడ్డి, వీఆర్‌ రెడ్డిబీ జస్టిస్‌ ఎంఎస్కే జైస్వాల్‌, జస్టిస్‌ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్‌ చైర్మెన్‌ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, పలువురు సిట్టింగ్‌, రిటైర్డ్‌ న్యాయమూర్తులు, న్యాయవాద సంఘాల సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.