ప్రజా పక్షపాతి – సుప్రీం కోర్టు న్యాయమూర్తి కృష్ణ అయ్యర్‌

సమాజంలో అట్టడుగు పేదలకు సామాజిక న్యాయం అందించాలని, పేదలందరికి హక్కులు అనుభవించే పరిస్థితులు ఏర్పడాలని ఆ వైపుగా కాంక్షించి, అందుకోసం విశేషంగా కృషి చేసిన విశిష్ట న్యాయమూర్తి క్రిష్ణ అయ్యర్‌. నవంబర్‌ 15న ఆయన జన్మదినం సందర్భంగా అతని ఆచరణను గుర్తుచేసుకోవాలి. న్యాయమూర్తులకు అతీంద్రియ శక్తులు ఏమీ ఉండవు. అదే విధంగా జడ్జిలా ఎవరూ న్యాయ శాస్త్రవేత్తలు కూడా కాదు. కాని ప్రజల నిరంతర పోరాట కార్యాచరణలో పాల్గొంటూ ప్రజల మౌళిక సమస్యల కోసం చేస్తున్న ఉద్యమాలను అవగాహన చేసుకోగలిగే క్రియాశీల వ్యక్తి. అలాంటి అవగాహనతో ఉన్న న్యాయమూర్తిగా ఉండి సుప్రీంకోర్టు జడ్జి పదవికే గౌరవాన్ని, గొప్పతనాన్ని తెచ్చినవాడు జస్టిస్‌ క్రిష్ణ అయ్యర్‌. అతని తండ్రి వి.వి. రామ అయ్యర్‌ పేరున్న న్యాయవాది. క్రిష్ణ అయ్యర్‌ 1935లోనే అన్నామలై విశ్వ విద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో, ఇంగ్లీష్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. జర్నలిస్టు కావాలనే కోరిక ఉన్నా కాని తండ్రి ప్రోద్భలంతో మద్రాసు లా కాలేజీలో చేరి 1937లో న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు. పేద రైతులు, శ్రామికుల తరపున ఎలాంటి ఫీజులు లేకుండానే కేసులు వాదించేవాడు. పేద ప్రజల మీద భూస్వాముల దోపిడిని, పోలీసుల దౌర్జన్యాలను తీవ్రంగా వ్యతిరేకించే వాడు. రాజకీయ నాయకులు ప్రత్యేకంగా వామపక్ష నాయకుల విడుదల కోసం కోర్టుల్లో కేసులు వాదించేవాడు. కేరళలో వామపక్ష ఉద్యమాలు బలంగా ఉండి పేద ప్రజల పోరాటాలు కొనసాగడం, నాయకులను ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ చట్టం క్రింద అరెస్టు చేయడం, క్రిష్ణ అయ్యార్‌ వారిని విడిపించుకోవడానికి ఎక్కువ కృషి చేయడంలో వామపక్షవాదిగా గుర్తింపు వచ్చింది. 1959లో కేంద్ర ప్రభుత్వం కేరళలో అధ్యక్ష పాలనను విధించింది. కేరళలోని ఈఎంఎస్‌ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356ను మొట్టమొదటి సారిగా ఉపయోగించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం రద్దు కావడంతో కేరళ హైకోర్టులో ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు.
కష్ణ అయ్యర్‌ దష్టిలో ‘ప్రజలు’ అంటే ఎవరు అనే విషయంలో స్పష్టమైన వైఖరి ఉంది. రాజ్యాంగ పీఠికలో ‘ప్రజలమైన మేము’ అంటే కసాయివారు, రొట్టె తయారు చేసేవారు, కొవ్వొత్తులను తయారు చేసే వారు, ఇంకా వెట్టిచాకిరీ చేసేవారు, పేవ్‌మెంట్లపై బతికేవారు’ అనే అర్థాన్ని చెప్తారు. ఇంకొక సందర్భంలో సమాజంలో బాధలకు గురవుతున్న వారిని సంబోధిస్తూ – నాలుకలేనివారు, చితికిపోయిన వారు, దెబ్బలు తిన్నవారు, పోలీసుల చిత్రహింసలకు బలైనవారు, పేదరికంలో చిక్కుకున్నవారు, అత్యాచారాలకు గురైనవారు, ఫలితంగా గర్భవతులైనవారు, వరకట్న చావులకు గురైనవారు, అగ్నికీలలకు బలైన మహిళలు, చిత్రహింసలకు బలైన ఖైదీలు, మురికివాడల్లో నివసించేవారు, రోడ్లపై నిరాశ్రయులు, వెట్టిచాకిరీ చేసేవారు, చెమటోడ్చే శ్రామికులు, లింగ వివక్షతకు గురైనవారు – వీరంతా మార్క్స్‌ పరిభాషలో పెద్ద పారిశ్రామిక సైన్యం లేదా డిస్పోజెబల్‌ ప్రజలు. వీరికి హక్కులు అనుభవించే పరిస్థితిని సామాజిక న్యాయాన్ని కల్పించాలనే ఉద్దేశంతోనే రాజ్యాంగాన్ని సాధనంగా, ఆయుధంగా ఎంచుకున్నాడు. ‘ఎవరైనా సరే, సాధారణ ప్రజలకు సామాజిక న్యాయాన్ని నిరాకరించినా, నిర్లక్ష్యం వహించినా వారు రాజ్యాంగ వ్యతిరేకులే’ అని అంటారు. పేదరికం కారణంగా సమాజంలోనే మెజారిటీ ప్రజలు కోర్టులకు రాలేకపోతున్నారనీ, ఫలితంగా తమ హక్కులను పొందలేక పోతున్నారనే ఆలోచనతోనే ప్రజాహిత వ్యాజ్యం (పబ్లిక్‌ ఇంటరెస్ట్‌ లిటిగేషన్‌) అనే కొత్త విధానానికి అంకురార్పణ చేశారు కష్ణ అయ్యర్‌. రత్లామ్‌ మునిసిపాలిటీ కేసులో ప్రజాహిత వ్యాజ్యం గురించి వివరించాడు. కష్ణ అయ్యర్‌తో పాటు జస్టిస్‌ చిన్నపరెడ్డి కూడ ఈ తీర్పు ఇవ్వడంలో భాగస్వామి. గతంలో బాధితుడు మాత్రమే కోర్టులో ఫిర్యాదు చేయడం లేదా రిట్‌ పిటిషన్‌ వేయాలనే నియమం ఉంది. బాధితుల తరఫున, ప్రత్యేకించి పేదల తరఫున, హక్కులు కోల్పోయిన, బలహీన, బడుగు వర్గాల తరఫున, వాళ్ల హక్కుల కోసం ఎవరైనా కోర్టులో రిట్‌ పిటిషన్‌ వేయవచ్చని వెసులుబాటు కల్పించారు. దీన్నే ప్రజాప్రయోజన లేదా ప్రజాహిత వాజ్యం అంటారు. ఈ వెసులుబాటులో హక్కుల కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు, పేదల తరఫున హక్కుల కోసం ప్రజాహిత వాజ్యాలు వేసి న్యాయం పొందారు. సుప్రీంకోర్టు జడ్జీలు మరింత ముందుకుపోయి ఖైదీలు ఇచ్చిన టెలిగ్రాంలకు, బాధితులు రాసిన ఉత్తరాలను, పత్రికల్లో హక్కుల ఉల్లంఘన జరిగిన సంఘటనల వార్తలను, తమంతకు తామే రిట్‌ పిటిషన్లుగా స్వీకరించి బాధితులకు ఉపశమనం కల్పించారు. సుప్రీంకోర్టు, హైకోర్టులు బాధితులకు పోరాట కేంద్రాలుగా మారిపోయాయి. ఈ ప్రయోగాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ ఆహ్వానించారు.
ప్రత్యేకించి బెంగుళూరు వాటర్‌ సీవేజ్‌ కేసులో (1978) పారిశ్రా మిక సంబంధాల చట్టంలో ‘పరిశ్రమ’ అనే పదానికి విస్తతమైన అర్థాన్ని ఇచ్చారు. ఆసుపత్రులలో, స్కూళ్లలో, యూనివర్సిటీలలో పని చేసే కార్మికులకు ఈ చట్టం వర్తింస్తుందని చెప్పారు. తానే స్వయంగా ‘పరిశ్రమ’కు నిర్వచనం ఇచ్చాడు. కాని, ఇంతవరకు పారిశ్రామిక వివాదాల చట్టానికి ప్రభుత్వాల సవరణ తీసుకురాలేదు. పెట్టుబడి దారులు, శ్రామికుల మధ్య వివాదాల్లో ఎప్పుడు శ్రామికుల పక్షమే వహించాడు. బాధితులకు అనుకూలంగా తీర్పులిచ్చాడు. బచ్చన్సింగ్‌ కేసులో ఉరి శిక్షలపై వ్యతిరేకతను తెలుపుతూనే కేవలం అరుదైన కేసుల్లోనే మరణ శిక్ష విధించాలనే తీర్పు ఉరిశిక్షల రద్దుకై జరుగుతున్న ఉద్యమానికి స్ఫూర్తిని ఇచ్చారు. అంతేకాకుండా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు గురైన వారికి నష్టపరిహారం చెల్లించాలనే విధానాన్ని తన తీర్పుల ద్వారా వ్యవస్థీకతం చేశారు. ఆయన తీర్పుల సారాంశాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ‘కనీస మానవ అవసరాలైన కూడు, గుడ్డ, నివాసం ప్రాథమిక హక్కులుగా, స్వేచ్ఛలు’గా నిర్వచించాడు.
జస్టిస్‌ కష్ణ అయ్యర్‌ జీవితం, బాధిత ప్రజలపట్ల ప్రేమ, వారి హక్కుల పట్ల నిబద్ధత, మనకు ఆదర్శంగా నిలుస్తాయి. రాజ్యాంగం, చట్టాల్లో ఎన్ని పరిమితులు ఉన్నా వాటిని ప్రజలకు అనుకూలంగా విశ్లే షిస్తూ, అనువదిస్తూ న్యాయం చేసే సజనాత్మక శక్తికి కష్ణ అయ్యర్‌ ఒక ప్రతీక. హక్కులనే ఆయుధంతో కోర్టుల్లో న్యాయం కోసం పోరాటం చేయడం ఎలాగో కష్ణ అయ్యర్‌ నుంచి నేర్చుకోవాలి. కష్ణ అయ్యర్‌ తీర్పులు, వాటిల్లోని విశ్లేషణ, వ్యాఖ్యానం హక్కుల కార్యకర్తలకు విజ్ఞాన భండారంగా పనికొస్తాయి. ఆయన వెలువరించిన తీర్పులపైనే చాలా మంది పరిశోధనలు చేసి పుస్తకాలు రాశారు. న్యాయ వ్యవస్థ అనేది ఏ సమాజంలో అయినా రాజ్యాంగ యంత్రంలో భాగమైన ఒకా నొక అంగమే తప్ప మరొకటి కాదు. బలమైన ప్రజాస్వామిక వ్యవస్థ ఉనికిలో ఉంటే, న్యాయ వ్యవస్థ కూడా పూర్తి స్వతంత్రంగా వివరించ గలిగే అవకాశం ఉంటుంది.
(జస్టిస్‌ క్రిష్ణ అయ్యర్‌ జన్మదినం సందర్భంగా…)
– ఎన్‌. నారాయణ రావు
ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల సంఘం