– ఉన్నత విద్యామండలికి ఏఐవైఎఫ్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గురునానక్, శ్రీనిధి విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులకు న్యాయం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావును శుక్రవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వలీ ఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కె ధర్మేంద్ర నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆ యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని కోరారు. వాటిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తెలిపారు. గుర్తింపు లేని ప్రయివేటు విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులను కాపాడకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. గురునానక్ యాజమాన్యాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తే పోలీసులతో లాఠీచార్జీ చేయించడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి నిర్లకంటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.