పేదల మనిషి-జస్టిస్‌ వి.ఆర్‌.కృష్ణ అయ్యర్‌

Poor man-Justice VR Krishna Iyer‘దేశమంటే మట్టి కాదోరు..దేశమంటే మనుషులోరు’- అన్నాడు గురజాడ. కానీ దేశమంటే ధనిక కాదోరు…నింగినంటే మేడ కాదోరు అని పాడుతున్నారిప్పుడు కొందరు. అలా చెప్పడమే కాదు. ఆ పేదల బాగుకోసం శక్తి వంచన లేకుండా నిరంతరం శ్రమిస్తూ, వారికోసం తమ జీవితాలనే అంకితం చేస్తున్నారు. అలాంటి త్యాగధనుల్లో ముందు వరసలో నిలుస్తారు పేదల పక్షపాతి జస్టిస్‌ వి.ఆర్‌. కృష్ణఅయ్యర్‌. ఆయన న్యాయవాద వృత్తిలో పనిచేసినా, ప్రజాప్రతినిధిగా ఎన్నికయినా పేదలకోసమే తన శక్తి యుక్తులన్నీ ధారపోసేవారు. అందుకే పేదలమనిషిగా పేరు తెచ్చుకున్నారు. భారత న్యాయవ్యవస్థకు అయ్యర్‌ భీష్మ పితామహుడులాంటి వాడని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎ.ఎస్‌.ఆనంద్‌ ఘనంగా కొనియాడారు. సుప్రీంకోర్ట్‌బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవె ”భారత దేశపు గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒక లెజెండ్‌. అన్యాయాన్ని ఎదుర్కోవడానికి నిలబడ్డ వన్‌మన్‌ ఆర్మీ” అంటూ కృష్ణ అయ్యర్‌ గురించి అభివర్ణించాడు.
జస్టిస్‌ వి.ఆర్‌. కృష్ణఅయ్యర్‌ కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన వైద్యనాథపురంలో 15 నవంబర్‌ 1915న జన్మించారు. తండ్రి రామ అయ్యర్‌ థాలస్సెరి న్యాయస్థానంలో ఒక న్యాయవాది. కృష్ణ అయ్యర్‌ విద్యాభ్యాసం థాలస్సెరిలోని , బి,ఇ.మిషన్‌ పార్సి హైస్కూల్‌లో జరిగింది. ఆ తర్వాత పలక్కాడ్‌లోని గవర్నమెంట్‌ విక్టొరియా కాలేజ్‌లో చేరి 1935లో అన్నామలై విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యారు. తరు వాత చెన్నరులోని డాక్టర్‌ అంబేద్కర్‌ లా కాలేజ్‌లో చేరి 1937లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఆ తర్వాత 1938లో తన తండ్రి వి.ఆర్‌. రామ ఛాంబర్‌లోనే ప్రాక్టిస్‌ ప్రారభించారు.
1948లో పోలీసులు విచారణ పేరుతో ఒక నిందితుడిని తీవ్రంగా హింసించడంతో లాయర్‌గా అయ్యర్‌ నిరసన తెలిపినందుకు, ఆయన కమ్యూనిస్టులకు సహకరిస్తున్నాడనే నెపంతో ఒక తప్పుడు కేసుపెట్ట్టారు. ఫలితంగా ఒక నెలరోజులపాటు ఆయన జైలు జీవితం గడపాల్సి వచ్చింది. కేరళ రాష్రం ఏర్పాటు కాగానే 1952లో కుటుపారంబ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 1957-59 మధ్య కమ్యూనిస్టు నంబూద్రిపాద్‌ ప్రభుత్వంలో హోం, న్యాయ, జైళ్లు, విద్య, ఇరిగేషన్‌, విద్యుత్‌, రాష్ట్ర వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారు. ఆ కాలంలోనే కేరళరాష్టాన్ని అన్నిరంగాలలో త్వరితగతిన అభివృద్ధి చేసేందుకు అనేక చట్టాలను రూపొందించారు. జైలు సంస్కరణలు, పేదలకు సత్వర న్యాయం అందేలా కృషిచేశారు. ఆ సమయంలో ఆయన పేదలకు లీగల్‌ ఏడ్‌ సౌకర్యాన్ని కలుగజేశారు. అంతే గాక ఖైదీలకు వారి న్యాయమైన హక్కుల్ని కల్పించడంతో పాటు పెక్కుకోర్టు, దాంతోపాటు స్త్రీలకు, పిల్లలకు రెస్క్యు గృహాలను ఏర్పాటు చేయించారు.ఆయన మంత్రిగా ఉన్న సమయంలోనే ఒక నిరుపేదను పోలీస్‌స్టేషన్‌లో అకారణంగా బంధించారని తెలియడంతో రాత్రి పదిగంటల సమయంలో తనే స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లి అతన్ని విడిపించారు. ఈ ఒక్క ఘటన చాలు, ఆయనకు పేదల పట్ల ఉన్న నిబద్ధత, మమకారాన్ని తెలియజేసేందుకు.
1959లో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356ని ఉపయోగించి నంబుద్రిపాద్‌ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. దాంతో కృష్ణ అయ్యర్‌ మళ్లీ న్యాయవాదవృత్తిని చేపట్టారు. 1968లో కేరళ హైకోర్ట్‌కు, 1973లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డారు 14 నవంబర్‌ 1980లో పదవీ విరమణ చేసేవరకు ఆయన పేదలకోసమే పరితపించారు. ప్రతీ తీర్పులోను పేదలపట్ల, నిర్భాగ్యులపట్ల ఆయనకున్న అవ్యాజ్యమైన, అనురాగం, సానుభూతి ద్యోతకమవుతాయి దాదాపు 700 తీర్పుల్ని పరిశీలిస్తే పేదలపక్షానే నిలబడ్డారు. ఉదాహరణకు స్టేట్‌ ఆఫ్‌ హర్యానా దర్శనా దేవి కేసులో ఒక నిరుపేద బాధితురాలి పట్ల అక్కడి ప్రభుత్వం ప్రవర్తించిన తీరును ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈకేసులో దర్శనాదేవి భర్త రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు. ఆయన మరణానికి కారణమైన బస్సు హర్యానా ప్రభుత్వ రాష్ట్ర రవాణాశాఖకు చెందినది. దాంతో దర్శనాదేవి కూతురుతో కలిసి నష్టపరిహారం కోసం కోర్టును ఆశ్రయించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడంతో కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. జస్టిస్‌ కృష్ణ అయ్యర్‌ ఈ కేసులో తీర్పునిస్తూ ఒక వితంతువు పట్ల ప్రభుత్వ ప్రవర్తన తీవ్రమైన దుష్ట స్వభావంతో కూడుకుని ఉన్నదిగా వ్యాఖ్యానించారు.
ఇక నిరుపేద, పీడితుల పట్ల న్యాయం కోసం, భారత న్యాయవ్యవస్థలో ఆయన ప్రవేశపెట్టిన ప్రజా ప్రయోజన వ్యాజ్య విధానం సర్వజనామోదం పొందింది. దీని విషయంలో జస్టిస్‌ భగవతి కూడా ఎంతో కృషిచేశాడు. అప్పటివరకు బాధితుడు మాత్రమే కోర్టుల్లో కేసు వేయడం లేదా రిట్‌ పిటిషన్‌ వేయాలన్న నిబంధన వుండేది. అయితే పేదరికం లేదా నిరక్షరాస్యులైన కారణంగా పేద బాధితులు కోర్టులకు వెళ్లలేక వారికి అన్యాయం జరిగేది. అయితే జస్టిస్‌ కృష్ణ అయ్యర్‌ ప్రవేశపెట్టిన ప్రజాప్రయోజన వ్యాజ్యం వల్ల, పేద బాధితుల తరఫున ఎవరైనా ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని రాష్ట్రాల్లోని ఉన్నత న్యాయస్థానాల్లోను లేదా సర్వోన్నత న్యాయస్థానాల్లోనైనా దాఖలు చేయవచ్చు. ముంబై కాంగార్‌ సభ వర్సెస్‌ అబ్దుల్‌ థాయి (1976) కేసు సందర్భంగా ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) ప్రవేశపెట్టబడింది. అయితే హుస్సైన్‌ ఖాతూన్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బీహార్‌ (1979)కేసుతో ప్రజాప్రయోజన వ్యాజ్యం అంటే ఏమిటో భారతావనికి తెలియవచ్చింది. బీహర్‌ జైళ్లలో ఖైదీలపై, విచారణలోనున్న ఖైదీలపై జరుగుతున్న వేధింపులపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం వల్ల విచారణ కొనసాగి, పెక్కుమంది ఖైదీల విదుదలకు మార్గం సుగమమైంది. ఆయన హయంలోనే బెయిల్‌ నిబంధనలు సరళ తరమయ్యాయి. విచారణ సమయంలో నిందితులకు బేడీలు వేయ డాన్ని తప్పు పట్టారాయన.
మరోకేసులో రుణగ్రహీతలకు అండగా నిలిచారు. పేదరికం నేరం కాదని, తీసుకున్న రుణం తీర్చలేకపోయాడన్న కారణంగా రుణగ్రహీతకు జైలు శిక్ష విధించడం ఆర్తికల్‌ 21ని ఉల్లంఘించడమేనని తీర్పునిచ్చాడు. ఈ తీర్పువల్ల దేశంలోని ఎంతోమంది రుణగ్రహీతలకు ఉపశమనం లభించింది. మధ్యప్రదేశ్‌- రత్లాం మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లపై మురుగునీరు ప్రవహించడంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతిం టోందని కొంతమంది కోర్టును ఆశ్రయించారు. విచారణలో తమ శాఖలో నిధులు లేవని, సానిటరి విషయంలో చర్యలు చేపట్టలేమని మున్సిపాలిటీ వాదించింది. నిధుల కొరత పేరుతో ప్రజల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే సహించబోమని, వెంటనే సమస్య పరిష్కరించాలని ధర్మాసనం తీర్పునిచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే జస్టిస్‌ అయ్యర్‌ తీర్పులన్నీ కూడా పేదలపక్షమే ఉండేవి.
జస్టిస్‌ కృష్ణ అయ్యర్‌ 1971నుండి 1973 వరకు లా కమిషన్‌ సభ్యుడిగా పనిచేశారు. ఇక బిరుదుల విషయానికొస్తే లెక్కలేనన్ని బిరుదులతో ఆయన సత్కరించబడ్డారు. అందులో ముఖ్యంగా 1999లో ఆయనకు లభించిన పద్మ విభూషణ్‌ అవార్డు. రష్యా కూడా ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని అందజేసింది. రచయితగా ఆయన సుమారు వంద వరకు గ్రంథా లను రచించాడు. అందులో ఎక్కువ భాగం న్యాయ శాస్త్రానికి సంబంధించినవే వున్నాయి.తన అనన్య ప్రతిభతో న్యాయ శాస్త్ర రంగంలో సేవలందించి, పేదల పక్షపాతిగా పేరుగడించిన జస్టిస్‌ కృష్ణ అయ్యర్‌ 4 డిసెంబర్‌ 2014 న కోచిలోని ఒక ట్రస్ట్‌ ఆస్పత్రిలో మృతిచెందారు. ఆయన మరణంతో దేశం ఒక గొప్ప న్యాయ కోవిదుడిని, దాన్ని మించి ఒక గొప్ప మానవతావాదిని కోల్పోయింది. ఆయన కలగన్నది అంతరాలు లేని సమాజం. దాన్ని నేరవేర్చేందుకు కృషిచేయాల్సింది నేటితరం.
– బసవరాజు నరేందర్‌ రావు
9908516549