నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తన జీవిత కాలంలో నిస్వార్థంగా సమాజ మార్పు కోసం కషి చేసిన సురేశ్ తన మరణానంతరం కూడా దేహదానంతో మరింత గొప్ప ఆదర్శాన్ని నెలకొల్పారని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ కోయ వెంకటేశ్వరరావు, శ్రీనాథ్ పేర్కొన్నారు. శరీర దానంతో మనిషి జీవిత కాలాన్ని పెంచుదామనీ, మెడికల్ కాలేజీలకు అవయవ దానం చేస్తే మరింతమంది నైపుణ్యం కలిగిన వైద్యులు తయారవుతారని వారు తెలిపారు. తద్వారా మనం చనిపోయినా నలుగురికి విజ్ఞానాన్ని అందించడానికి ఉపయోగపడతామని చెప్పారు. దేహదానంతో వైద్య విద్యార్థులకు పాఠాలు నేర్పించవచ్చన్నారు. జనవిజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య సబ్ కమిటీ కన్వీనర్ అనుమకొండ సురేశ్ బ్రెయిన్ క్యాన్సర్ బారినపడి వ్యాధి ముదరడంతో మంగళవారం మరణించారు. ఆయన పార్థీవ దేహాన్ని తన అంతిమ కోరిక మేరకు సిద్దిపేటలోని సురభి వైద్య కళాశాలకు ఆయన కుటుంబ సభ్యులు అప్పగించారు. సురేశ్ పార్థీవ దేహాన్ని సురభి వైద్య కళాశాల అనాటమీ విభాగాధిపతి డాక్టర్ సమత రోష్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సురేశ్ భార్య పద్మ, కుమార్తె సునయన, అల్లుడు లోకనాథంను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా జేవీవీ రాష్ట్ర కమిటీ, పలు జిల్లా కమిటీలు సురేశ్ కు ఘనంగా నివాళులు అర్పించారు.డాక్టర్ కోయ వెంకటేశ్వరరావు, శ్రీనాథ్ మాట్లాడుతూ పునర్జన్మ, స్వర్గనరకాలు, మోక్షం తదితరమైన వాటిని జన విజ్ఞాన వేదిక ప్రచారం చేయదనీ, అయితే శరీర, అవయవ దానాలతో మనిషి జీవిత కాలాన్ని మరింత పెంచవచ్చని అభిప్రాయపడ్డారు. దేహ దానంతో నైపుణ్యం కలిగిన వైద్యులను భావితరాలకు అందించే వీలుందని తెలిపారు. అయితే శరీర, అవయవదానాల పైన ప్రజల్లో సరైన అవగాహన లేదని వారు ఆవేదన వ్యక్తం చేసారు. వీటి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాలని వారు ఈ సందర్భంగా కోరారు.
వైద్యరంగం దినదినాభివృద్ధి చెందుతుందని, వివిధ మానవ అవయవాల మార్పిడి చేయగల స్థాయికి వైద్య శాస్త్రం ఎదిగిందని గుర్తుచేశారు. అందులో భాగంగానే రక్తదానం, నేత్రదానం, చర్మ దానం, అవయవ దానం, శరీర దానం లాంటి పలు కొత్త దానాలు ఉనికిలోకి వచ్చాయని చెప్పారు. నేత్రదానంతో అంధులకు చూపు తెప్పించవచ్చని చెప్పారు. దేశంలో కార్నియా దెబ్బతిని చూపు కోల్పోయిన వారు 10 లక్షల మందికి పైగా ఉన్నారని తెలిపారు. దేశంలో ప్రతి ఏటా వీరి సంఖ్య 25000 అదనంగా చేరుతుందన్నారు. దేశంలో ప్రతి సంవత్సరం కోటి మంది మరణిస్తున్నా, అందులో కేవలం 30 వేల మంది మాత్రమే నేత్రదానం చేస్తున్నారని వివరించారు. నేత్రదానం, అవయవ దానం, శరీర దానం పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. మరణానంతరం పార్థీవ దేహాన్ని కాల్చడం, పాతి పెట్టడం వలన ఉపయోగం లేదని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీలకు శరీరాన్ని దానం చేస్తే మరింత నైపుణ్యవంతమైన వైద్య బోధనా ప్రమాణాలు నెలకొల్పడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. అందుకే ప్రతి ఒక్కరూ శరీర దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు ప్రొఫెసర్ రామచంద్రయ్య, ఛాయ మోహన్, వరప్రసాద్, రాజా, ఆనంద్ కుమార్, జగన్మోహన్ రావు, రమణారెడ్డి, వెంకటరమణ, ఎం.శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా నుండి బురాన్, మల్లయ్యచారి, నాగరాజు, శ్రీనివాస్, శంకర్రావు, జెన్ని, హైదరాబాద్ జిల్లా నుండి లింగస్వామి, వినోద్, రంగారెడ్డి జిల్లా నుండి ప్రహ్లాద, జయబాబు, కుర్మయ్య, కృష్ణమోహన్, రమేశ్, నల్లగొండ జిల్లా నుంచి సైదులు తదితరులు పాల్గొన్నారు.