– నీరజ్ చోప్రాతోపాటు
– 4×400మీ. పరుగులోనూ పసిడి
– భారత్ ఖాతాలో రికార్డు పతకాలు
హాంగ్జౌ : 19వ ఆసియా క్రీడల్లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. ఈసారి 100 పతకాలపై గురి పెట్టిన భారత్ ఆ ఫీట్‌ను అందుకొనే దిశగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో తొలి రోజు నుంచి పతకాలు కొల్లగొడుతోంది. గురువారం భారత్‌కు మరో 12 పతకాలు దక్కాయి. దీంతో భారత్‌కు దక్కిన పతకాల సంఖ్య 81కు చేరింది. తాజాగా ఆర్చరీ మిక్స్‌డ్, జావెలిన్, 4×400మీ. పరుగులో స్వర్ణ పతకాలు దక్కాయి. దీంతో భారత్ 18స్వర్ణ, 31రజత, 32కాంస్యాలతో నాల్గో స్థానంలో నిలిచింది. అదే క్రమంలో ఇండోనేషియా వేదికగా జరిగిన 18వ ఆసియా క్రీడల్లో దక్కిన అత్యధిక(70) పతకాల రికార్డు (16స్వర్ణ, 23రజత, 31కాంస్య) తాజాగా బ్రద్దలైంది. గురువారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా ఈటెను 88.88మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని చేజిక్కించుకున్నాడు. మరో త్రోయర్ కిషోర్ కుమార్ జెనా నాలుగో ప్రయత్నంలో ఈటెను 87.54 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక జపాన్‌కు చెందిన జావెలిన్ త్రోయర్ డీన్ రొడెరిక్ జెంకీ తన ఈటెను 82.68 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకున్నాడు.
జ్యోతి సురేఖ-ఏజాస్‌కు స్వర్ణం..
ఆసియా క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. బుధవారం జరిగిన మిక్స్‌డ్ విభాగంలో ఓజాస్ దియోతలేతో కలిసి బరిలోకి దిగిన జ్యోతి సురేఖ బంగారు పతకాన్ని సాధించింది. ఆర్చరీ మిక్స్‌డ్ ఈవెంట్ ఫైనల్లో ఫేవరెట్ దక్షిణ కొరియా ఆటగాళ్లను ఒక్క పాయింట్ తేడాతో ఓడించారు. ఫైనల్లో సురేఖ-ఓజాస్ 159-158 పాయింట్ల తేడాతో సో చయివాన్-జూ జహివూన్ (కొరియా)పై ఉత్కంఠ విజయం సాధించారు.
4×400మీ. రిలే పరుగులోనూ..
పురుషుల 4×400మీటర్ల రిలే పరుగులో భారత్‌కు బంగారు పతకం దక్కింది. దాంతో పసిడి పతకాల సంఖ్య 18కి చేరింది. అలాగే మహిళల 4×400 మీటర్స్ రిలేలో కూడా భారత్‌కు రజతం దక్కింది. 35 కిలోమీటర్ల రేసు వాక్ మిక్స్‌డ్ టీమ్‌లో కాంస్యం పతకం లభించింది.
అవినాష్, హర్మిలాన్‌కు రజతాలు..
పురుషుల 5వేల మీటర్ల పరుగు పందెం ఫైనల్లో భారత్ అథ్లెట్ నాయబ్ సుబేదార్ అవినాష్ సాబిల్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం సొంతం చేసుకున్నాడు. బహ్రెయిన్‌కు చెందిన బాలివ్ బిర్హాణి యెమతా, అడ్మాసు దవిత్ ఫికాడు వరుసగా బంగారు, కాంస్య పతకాలు నెగ్గారు. ఇక మహిళల 800 మీటర్ల ఫైనల్ ఈవెంట్‌లో కూడా భారత్‌కు రజత పతకం దక్కింది. భారత అథ్లెట్ 25 ఏళ్ల బెయిన్స్ హర్మిలాన్ 2 నిమిషాల 3.75 సెకన్‌ల టైమింగ్‌తో రేసును పూర్తిచేసి రెండో స్థానంలో నిలవడం ద్వారా రజత పతకాన్ని సొంతం చేసుకుంది. శ్రీలంక అథ్లెట్ దిస్సనాయక ముదియన్‌సేలాకు బంగారు పతకం, చైనా అథ్లెట్ వాంగ్ చున్‌యూకు కాంస్య పతకం దక్కాయి.
లవ్లీనాకు రజతం
మహిళల 75కిలోల విభాగం ఫైనల్లో లవ్లీనా బోర్గోహైన్ నిరాశపరిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో 26ఏళ్ల లవ్లీనా చైనా బాక్సర్ లీ-క్యుయాన్ చేతిలో ఓటమిపాలైంది. తొలిరౌండ్ పూర్తయ్యేసరికి 3-2పాయింట్లతో ఆధిక్యతలో ఉన్నా.. ఆ తర్వాత రెండు రౌండ్‌లలోనూ ఆశించినస్థాయిలో రాణించలేక పోయింది. దీంతో ఫైనల్లో ఓడిన లవ్లీనాకు రజత పతకం దక్కింది.
ఫైనల్‌కు హాకీజట్టు..
హాకీ ఫైనల్లోకి పురుషుల జట్టు ప్రవేశించింది. బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 5-3గోల్స్ తేడాతో దక్షిణ కొరియాను చిత్తుచేసింది. సెమీఫైనల్ మ్యాచ్‌లో హార్దిక్ సింగ్ మన్‌దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యారు, అమిత్ రోహిదాస్, అభిషేక్ తలా ఒక గోల్ చేశారు.
దక్షిణ కొరియా కేవలం మూడు గోల్స్ మాత్రమే చేయగలిగింది. దాంతో ఆసియా క్రీడల్లో భారత హాకీజటుట 11సార్లు ఫైనల్‌కు చేరినట్లయ్యింది. శుక్రవారం జరగనున్న ఫైనల్‌లో చైనా లేదా జపాన్‌తో భారత్ తలపడనుంది. నేడు చైనా-జపాన్ జట్ల మధ్య రెండో సెమీస్ జరగనుంది.