ప్రవీణ్‌తో కలిసి మిక్స్‌డ్ పసిడి సొంతం 2023 ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 2
షాంఘై (చైనా) : తెలుగు తేజం వెన్నం జ్యోతి సురేఖ ఈ ఏడాది ప్రపంచకప్ వేదికగా మరో పసిడి పతకం సాధించింది. చైనాలోని షాంఘైలో జరుగుతున్న 2023 ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్ 2లో కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్ పసిడి పతకం సొంతం చేసుకుంది. జ్యోతి సురేఖ, ప్రవీణ్ ఓజాస్ జంట శనివారం జరిగిన పసిడి పోరులో వరల్డ్ నం.1 దక్షిణ కొరియా జోడీపై మెరుపు విజయం నమోదు చేసింది. యువ ఆర్చర్ ప్రవీణ్ ఆరంభంలో వరుస 9 స్కోర్లతో తడబడినా.. కీలక సమయంలో పర్‌ఫెక్ట్ 10 స్కోర్లతో రాణించాడు. తొలి రౌండ్లో 39-39, రెండో రౌండ్ అనంతరం 78-78, మూడో రౌండ్ అనంతరం 117-117తో స్కోర్లు సమంగా ఉన్నాయి. నాల్గో రౌండ్లో కొరియా జోడీ 38 పాయింట్లు సాధించగా.. సురేఖ అద్బుత 10 పాయింట్ల గురితో భారత్ 39 పాయింట్లు సొంతం చేసుకుంది. ఓవరాల్‌య 156-155తో కొరియా ఆర్చర్లపై భారత జోడీ సురేఖ, ప్రవీణ్‌లు మెరుపు విజయం నమోదు చేశారు. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో పసిడి పతకం సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్ 1లోనూ వెన్నం జ్యోతి సురేఖ ఈ విభాగంలో పసిడి పతకం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగమ్మాయి జ్యోతి సురేఖకు ఆర్చరీ ప్రపంచకప్‌లో ఇది ఏకంగా నాల్గో మెడల్ కావటం విశేషం. ఇక వ్యక్తిగత విభాగంలో ప్రథమేశ్ జాకర్ వరల్డ్ నం.1 మైక్‌ను మట్టికరిపించి స్వర్ణం సాధించగా.. అవనీత్ కౌర్ మహిళల వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించింది. సీనియర్ ప్రపంచకప్ స్థాయిలో అవనీత్ కౌర్‌కు ఇదే తొలి పతకం.