జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

Jyothibapoole was the collector who conducted a surprise inspection of the residential schoolనవతెలంగాణ – మోపాల్ 

మోపాల్ మండలం కంజరలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, డార్మెటరీ, స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్, టాయిలెట్స్, ఆఫీస్, స్టాఫ్ రూమ్ లు తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం రుచికరమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. బోధనా సిబ్బంది హాజరును, సీ.సీ కెమెరాల పనితీరును పరిశీలించారు. విద్యార్థులను పలుకరించి వారికి అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలు, రోజువారీ దినచర్య గురించి ఆరా తీశారు. జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ స్కూల్ ఆవరణలో నూతనంగా నిర్మించిన భవన సముదాయం, డార్మెటరీని సందర్శించారు. హాస్టల్, రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్వహణ సజావుగా ఉండడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకనూ ఏమైనా మౌలిక సదుపాయాలు అవసరం ఉన్నాయా అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. సరిపడా సిబ్బంది, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, నీటి వసతి వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అయితే వినాయకనగర్ సంక్షేమ వసతి గృహానికి చెందిన విద్యార్థినులు అనునిత్యం బోర్గం(పి) పాఠశాలకు వెళ్లి వచ్చేందుకు రవాణా వసతి లేక ఇబ్బందులు పడుతున్నారని, బడి వేళల్లో ఉదయం, సాయంత్రం పూట బస్సు సదుపాయం కల్పించాలని హాస్టల్ నిర్వాహకులు కోరగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కలెక్టర్ వెంట జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి అధికారిణి నిర్మల, సహాయ సంక్షేమ అధికారి భూమయ్య, మోపాల్ ఎంపీడీఓ రాములు తదితరులు ఉన్నారు.