జ్యోతి అక్రమాస్తులు రూ.5 కోట్ల పైనే

– ఏసీబీ సోదాల్లో వెల్లడి
నవతెలంగాణ-ప్రత్యేకప్రతినిధి
భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖలోని ఎగ్జిక్యుటివ్‌ ఇంజినీర్‌(ఈఈ) జగ జ్యోతి అక్రమాస్తులు రూ.5 కోట్లకు పైనేనని ఏసీబీ అధికారులు జరిపిన తదుపరి సోదాల్లో వెలుగు చూసింది. ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ సి.వి ఆనంద్‌ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. రూ.84 వేలను ఒక కాంట్రాక్టర్‌ నుంచి తీసుకుంటుండగా జ్యోతిని సోమవారం ఆమె కార్యాలయంలోనే ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం విదితమే. కాగా, తదుపరి చర్యల్లో భాగంగా విజయనగర్‌ కాలనీ సెయింట్‌ అన్స్‌ కాలేజీ దగ్గర ఉన్న వెంకటసాయి అపార్ట్‌మెంట్స్‌లోని ఆమె నివాసంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఆమె నివాసం నుంచి రూ.65,18,000 నగదుతో పాటు 363 గ్రాముల బంగారు నగలు కూడా దొరికాయి. వీటితో పాటు కొన్ని ఫ్లాట్లు, మరికొన్ని ఓపెన్‌ ప్లాట్లతో పాటు వ్యవసాయ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా దొరికాయి. సీజ్‌ చేసిన బంగారం విలువ రూ.1.50 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. మిగతా ఆస్తుల విలువ కూడా కలిపి మార్కెట్‌ విలువ ప్రకారం ఆమె ఆస్తుల విలువ రూ.5 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు.