నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మంద కృష్ణ మాదిగకు ప్రధాని మోడీ కోట్ల రూపాయలిచ్చి సభ పెట్టించారనీ, దీన్ని బీజేపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ.పాల్ ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. యాక్టివ్‌గా ఉన్న తమ పార్టీని యాక్టివ్ లేని పార్టీగా అధికారులు చిత్రీకరించి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ప్రజాశాంతి పార్టీకి 80 సీట్లు వస్తున్నాయని సర్వేలు చెబుతున్నాయన్నారు. సీఈఓ వికాస్‌రాజ్, డిప్యూటీ సీఈఓ సత్యవాణి తమ ఉద్యోగాలు పోయినా పర్లేదుగాని నిజాలు చెప్పరన్నారు. ఒక చిన్న పార్టీకి సింబల్ ఇవ్వలేదని లడక్ ఎన్నికలు రద్దు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. తన పార్టీకి సింబల్ ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. తన పార్టీని గుర్తు కేటాయించకుండా ఇనాక్టివ్ చేసినందుకు కోర్టులో పిటిషన్ వేస్తున్నానని ప్రకటించారు. డోంట్ ఓట్, ఓట్ ఫర్ నోట ట్యాగ్‌తో ప్రజల్లోకి వెళ్తానన్నారు. అంబేద్కర్, గద్దర్ ఆశయాలను నెరవేర్చుకుందామని పిలుపునిచ్చారు. ప్రజాశాంతి పార్టీ పోటీలో లేదు కాబట్టి ఎన్నికలను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.