నవతెలంగాణ – నవీపేట్: ప్రగతిశీల యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ అధ్యక్షతన కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ 34 వ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని నవోదయ కళాశాలలో శుక్రవారం కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు నరేందర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ప్రగతిశీల భావాలతో యువత ముందుకు వెళ్లాలని అన్నారు. సమాజంలో గుట్కా, గంజాయి, మాదకద్రవ్యాలు, తాగుడు లాంటి బానిస అలవాట్లు చేసుకోకుండా చైతన్యవంతమైన ఆలోచనలతో ముందుకు సాగాలని కోరారు. కులము, మతము, వర్గ బేధాలు లేకుండా యువతను ప్రగతిశీల ఆలోచనల వైపు నడిపించిన యువ నాయకుడు వేములపల్లి కిరణ్ కుమార్ అని అన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం యువతను ఐక్యం చేసేందుకే క్రీడా పోటీలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి డి రాజేశ్వర్, పాఠశాల కరస్పాండెంట్ గోపాల్ రెడ్డి, తెడ్డు పోశెట్టి, ప్రిన్సిపల్ రఘురాం పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్, సుధాకర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.