ఇక కబడ్డీ కబడ్డీ

– నేటి నుంచి హైదరాబాద్‌లో ప్రో కబడ్డీ
హైదరాబాద్‌ : తెలంగాణలో సంక్రాతి సందడి తర్వాత క్రీడా హంగామా మొదలైంది. హైదరాబాద్‌ వేదికగా వరుసగా రెండు వారాలు మెగా స్పోర్ట్స్‌ ఈవెంట్లు జరుగనున్నాయి. ఓ వైపు జనవరి 25 నుంచి ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో భారత్‌, ఇంగ్లాండ్‌ తొలి టెస్టుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతుండగా, మరోవైపు నేటి నుంచి గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ప్రో కబడ్డీ లీగ్‌ మ్యాచులు ఆరంభం కానున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల జట్టుగా తెలుగు టైటాన్స్‌ ప్రో కబడ్డీలో పోటీపడుతుంది. నేడు బెంగళూర్‌ బుల్స్‌, తెలుగు టైటాన్స్‌ మ్యాచ్‌తో హైదరాబాద్‌ అంచె పోటీలు షురూ కానున్నాయి. జనవరి 24న తెలుగు టైటాన్స్‌, తమిళ తలైవాస్‌ మ్యాచ్‌తో ఇక్కడ ప్రో కబడ్డీ లీగ్‌ అంచె ముగియనుంది. హైదరాబాద్‌ అంచె పోటీల ప్రారంభం సందర్భంగా సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గురువారం తన నివాసంలో తెలుగు టైటాన్స్‌ జెర్సీని ఆవిష్కరించారు. ఇక 12 జట్లు పోటీపడుతున్న ప్రో కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 12 మ్యాచులు ఆడిన టైటాన్స్‌.. ఒక్క మ్యాచ్‌లోనే గెలుపొందింది. 11 మ్యాచుల్లో పరాజయాలు చవిచూసింది. సొంతగడ్డపై నాలుగు మ్యాచులు ఆడనున్న తెలుగు టైటాన్స్‌ ఇక్కడైనా గెలుపు బాట పడుతుందేమో చూడాలి.