కూతురు కోసం ‘కడియం’ దిగజారుడు రాజకీయాలు

కూతురు కోసం 'కడియం' దిగజారుడు రాజకీయాలు– పార్లమెంటు ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతాం : ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ
నవతెలంగాణ-హన్మకొండ
తాను మాదిగనని చెప్పుకుంటూ 40 ఏండ్లుగా రాజకీయాల్లో అనేక పదవులు అనుభవించి జిల్లాలో ముగ్గురు ప్రధాన మాదిగ నాయకుల రాజకీయ భవిష్యత్తును అణగదొక్కి ఇప్పుడు తన బిడ్డ కావ్య కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్న కడియం శ్రీహరికి వరంగల్‌ జిల్లా మాదిగలు తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. బుధవారం వరంగల్‌ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంద కృష్ణమాదిగ మాట్లాడారు. మంగళవారం తనపై కడియం శ్రీహరి అనేక అసత్య ఆరోపణలు చేశారని, మాదిగల వర్గీకరణకు, మాదిగ దండోరా ఉద్యమానికి తాను మద్దతు ప్రకటిస్తేనే మందకృష్ణ ఈ స్థాయికి వచ్చారని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మొదటిసారి 1994లో కడియం శ్రీహరి ఎమ్మెల్యే కావడానికి మా మద్దతే ప్రధాన కారణమని, అప్పుడు 10మంది ఎమ్మెల్యేలు ఉండటం వల్ల బైండ్ల ఉప కులానికి చెందిన కడియంకు మేము మద్దతు ప్రకటించామని అప్పటినుండి ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఉప ముఖ్యమంత్రిగా అనేక పదవులు అనుభవించి ఏ ఒక్క మాదిగ నాయకుడిని ఎదగనీయకుండా కుట్రలు చేశారని ఆరోపించారు. ప్రధానంగా తాటికొండ రాజయ్య, పసునూరి దయాకర్‌, ఆరూరి రమేష్‌ల రాజకీయ భవిష్యత్తును నాశనం చేసారని తెలిపారు. శ్రీహరి మంత్రిగా ఉన్న సమయంలో అనేకమంది దళిత నక్సలైట్లను ఎన్‌కౌంటర్‌ చేయడంలో ప్రధాన పాత్ర పోషించి, ఇప్పుడు వేదాలు వల్లిస్తున్నాడన్నారు. గతంలో కూడా అనేకమందికి టికెట్‌ రాకుండా అడ్డుపడి ఇప్పుడు తన బిడ్డ కావ్య కోసం ఎన్నో ఏండ్లుగా కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ టికెట్‌ కోసం ఎదురుచూస్తున్న అనేకమంది మాదిగబిడ్డలకు ద్రోహం చేశారని, ఇలాంటి నాయకుడికి వరంగల్‌ జిల్లా మాదిగలు పార్లమెంటు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్‌ మాదిగ, ఎమ్మెస్పీ జాతీయ నాయకులు మంద కుమార్‌మాదిగ, వేల్పుల సూరన్న కాపు, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి బుర్రి సతీష్‌మాదిగ, ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్‌ మాదిగ, ఎంఎస్‌పీ జిల్లా అధ్యక్షులు బండారి సురేందర్‌ మాదిగ, వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జి మంద రాజు మాదిగ, ఎమ్మార్పీఎస్‌ వరంగల్‌ జిల్లా అధ్యక్షులు కట్ల రాజశేఖర్‌ మాదిగ తదితరులు పాల్గొన్నారు.