కడియం శ్రీహరిపై విరుచుకుపడ్డ రాజయ్య..

Rajaiah lashed out at Kadiam Srihari..– ఇంటిగ్రేటెడ్ పేరుతో విద్యార్థులను ఆగం చెయ్యొద్దు..
– బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే డా. రాజయ్య
నవతెలంగాణ – స్టేషన్ ఘనపూర్
కడియం సాగునీరిచ్చిందని ఎక్కడా లేదని, 15 ఏండ్లు కేబినెట్ హోదా అధికారంలో ఉండి నువ్వేం చేసినవ్.. కడియం.. ఘనపూరానికి.. నీ మార్కు ఏది..? గ్లోబెల్స్ ప్రచారం చేస్తూ, అవకాశ వాద రాజకీయాలు చేస్తూ.. నైతిక విలువలను గాలికొదిలి, రాజ్యాంగానికి తిలోదకాలిచ్చి, సిగ్గూ, శరం లేకుండా, స్టే కావాలని డివిజన్ బెంచీకి వెళ్ళిన జిత్తులమారి నక్క.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంటూ.. తాను 15 ఏండ్లలో నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిలో ఏ ఒక్కటి అబద్ధమని తేల్చినా.. రాజకీయాలనుండి తప్పుకుంటానని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే డా తాటికొండ రాజయ్య సవాల్ చేశారు. బుధవారం నియోజక వర్గ కేంద్రంలో ఆ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు మాచర్ల గణేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ.. చిల్పూర్ మండలం లింగంపల్లి – మల్కాపూర్ రిజర్వాయర్ రాకుండా చేసిన దుర్మార్గుడు కడియమని అన్నారు. ఘనపూర్ రెండు సార్లు మున్సిపాలిటీ అయ్యే పరిస్థితి, వంద పడకల ఆస్పత్రి మంజూరు, టెక్స్ టైల్ పార్కు ఆటంకం కలిగించిన అభివృద్ధి నిరోధకుడని ఆరోపించారు. డిగ్రీ కళాశాల కోసం కేసీఆర్ మాట్లాడనివ్వలేదని ప్రగల్భాలు పలుకుతున్న కడియం, అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో విద్యాశాఖ మంత్రిగా ఉండి ఏం చేసావని అన్నారు. కేబినెట్ హోదా 15ఏండ్లలో కేవలం మూడు రెసిడెన్షియల్ పాఠశాలలు తప్ప, ఒరగబెట్టిందేమీ లేదని ఎద్దేవా చేశారు.తాను తెచ్చిన పనులు 18 విద్యాలయాలు, కాళోజీ విద్యా సంస్థ తెచ్చిన స్థానిక నాయకుడిగా తనదేనన్నారు. కడియంకు నియోజకవర్గంలో ప్రజలిచ్చిన తీర్పు నామమాత్రంగానే ఉందని, రాజకీయ స్వలాభం కోసమే కడియం పనిచేసారే తప్ప.. మరొకటి కాదని అన్నారు.
గులాబీ శ్రేణులు ఏండ్లుగా శ్రమించి, కేసీఆర్ మాటకు విలువనిచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే, తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్టుగా, ఆయనకు, ఆయన కూతురుకు టిక్కెట్టు ఇస్తే, పార్టీ ఫండ్ తీసుకుని ఎలా పార్టీ మారడానికి మనసెలా వచ్చిందని అన్నారు. ఆయనిచ్చిన పదవులు అనుభవించి, ఇటీవల కేసీఆర్ ను తులనాడుతూన్నారని మండిపడ్డారు. నైతిక విలువలను గూర్చి మాట్లాడే హక్కు కడియంకు లేదని తెలిపారు. మొదలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేస్తే గనుక కాంగ్రెస్ పార్టీ శ్రేణులే ఓడించేందుకు కాసుకొని ఉన్నారని హెచ్చరించారు. 10 నెలల అధికారంలో ప్రజలకోసం చేసింది గుండు సున్నా అని వివరించారు. ఇప్పటికైనా ప్రజాహిత పాలన చేయాలని హితవు పలికారు. రాష్ట్రంలో రూ.150 కోట్ల రెసిడెన్షియల్ పాఠశాల అద్దె బకాయిలు ముందుగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా నాణ్యమైన విద్యను అందించాలని మెస్ చార్జీలు పెంచాలని, అద్దె బకాయిలు చెల్లించాలని అన్నారు. ప్రస్తుతమున్న ఎస్సీ, మైనార్టీ, జ్యోతిబా పూలే, ఐటీడీఏ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉంటాయా.. తీసేస్తారా.. ఏర్పాటుకు ముందే చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పది నెలలు సమయమిచ్చామని, అధినేత కేసీఆర్ ప్రజా జీవితంలోకి రాబోతున్నారని, ఎక్కడికక్కడ ప్రజాపాలనను ఎండగట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుని వస్తున్నారని తెలిపారు. ఆరు గారెంటీలను అటకెక్కించారని దుయ్యబట్టారు. రైతురుణమాఫీ 40 శాతం ఇవ్వలేదని అన్నారు. తక్షణమే రైతు భరోసా, పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ విడుదల చేయాలని , ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కేసీఆర్ సారథ్యంలో ప్రజాక్షేత్రంలో అధికార కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ పరిధి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.