– మాజీ ఎమ్మెల్సీ బీ. మోహన్‌రెడ్డి కూడా…
– కండువా కప్పిన సీఎం రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు, వరంగల్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు.బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి వారు చేరుకున్నారు. సీఎం, దీపాదాస్‌మున్షితో చర్చించిన తర్వాత వారు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న తన కూతుర్ని ఓడిపోయే పార్టీ తరఫున పోటీ చేయించదలచుకోలేదన్నారు. అందుకే పార్టీ మారుతున్నట్టు తెలిపారు. వరంగల్ పార్లమెంటు నియోజక వర్గం నుంచి పోటీ కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపు వచ్చిందనీ, ఏఐసీసీ ప్రతినిధులు తమ నివాసానికి వచ్చి పార్టీలోకి ఆహ్వానించారని గుర్తు చేశారు. అయితే నియోజకవర్గ నేతలు, కార్యకర్తలను అడిగిన తర్వాతే తమ నిర్ణయాన్ని చెబుతానని వారికి చెప్పానన్నారు. వరంగల్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా కావ్య పోటీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీ ఒడిదుడుకులు ఎదుర్కొంటోందనీ, నాయకులు అయోమయంలో ఉన్నారని వివరించారు. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వద్దంటేనే కడియం కావ్యకు వరంగల్ టికెట్ ఇచ్చారన్నారు. పదేండ్లు బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నా.. తన వెంట ఉన్న నాయకులు, కార్యకర్తలు ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడేమో అధికారం లేక ప్రతిపక్షంలో ఉన్నామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఎవరికీ అన్యాయం చేయలేదనీ, కానీ తాటికొండ రాజయ్య, ఆరూరి రమేశ్, పసునూరి దయాకర్ పార్టీ మారినప్పుడు ఎవరూ మాట్లాడలేదన్నారు. ఇప్పుడు మాత్రం అందరూ మాట్లాడుతున్నారని తెలిపారు. కొంత మంది నెలల తరబడి పార్టీలో చేరతామని కాంగ్రెస్ వారి ఇండ్ల చుట్టూ తిరిగినా వారు చేర్చుకోలేదన్నారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదనీ, రియల్ ఎస్టేట్, భూకబ్జాలు చేయలేదని చెప్పారు. ప్రయివేటు యూనివర్సిటీలు పెట్టుకోలేదని అన్నారు. తనను విమర్శించే నైతిక అర్హత ఏ ఒక్కరికీ లేదని స్పష్టం చేశారు. తన 30 ఏండ్ల రాజకీయ జీవితంలో తనపై ఒక్క కేసు కూడా లేదన్నారు. చాలా మంది పార్టీని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా ఆస్తులు కూడబెట్టుకున్నారని తెలిపారు. తనను ఆశీ ర్వదించినట్టే తన బిడ్డను ఆశీర్వదించాలని ప్రజలను కడియం విజ్ఞప్తి చేశారు.