నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు డాక్టర్ కావ్య మంత్రి కొండా సురేఖ, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం హన్మకొండ రాంనగర్‌లోని మంత్రి కొండా సురేఖతో పాటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజును వాళ్ల ఇండ్ల దగ్గర కలిసి మాట్లాడారు. వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య పేరు ఖరారు చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కడియం శ్రీహరి, తన కుమార్తె కావ్యను తీసుకొని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావును స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె డాక్టర్ కావ్య మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం హన్మకొండ రాంనగర్‌లోని మంత్రి నివాసానికి వెళ్లి పుష్పగుచ్చమిచ్చి శాలువాలను కప్పి సన్మానించారు. కాంగ్రెస్‌లో చేరిన అనంతరం ‘కడియం’ స్వయంగా రావడంతో పూలమొక్కనిచ్చి మంత్రి సురేఖ వారికి స్వాగతం పలికారు. కడియం శ్రీహరి, కావ్యలకు మంత్రి సురేఖ నూతన వస్త్రాలను బహూకరించారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై కలిసి ముందుకు సాగుదామని చర్చించారు. అనంతరం ఎమ్మెల్యేలను వారి ఇండ్ల వద్ద కలిసి వారికి శాలువాలు కప్పి సన్మానించి పుష్పగుచ్ఛాలిచ్చారు. ఈ సందర్భంగా ‘కడియం’ కాంగ్రెస్‌లోకి రావడం పట్ల ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, జిల్లా అభివృద్ధికి అందరం కలిసి కృషి చేద్దామని తెలిపారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఇంట్లో ‘కడియం’ పలువురు కాంగ్రెస్ నేతలను కలిసి అందరితో ముచ్చటించారు.