– కేసీఆర్ ఎనిమిదో వింతపై అక్షింతలుొ డీపీఆర్ లేకుండానే రూ. 25 వేల కోట్లపనులు అప్పగింత
– తగ్గిన 50 వేల ఎకరాల ఆయకట్టు
– అంచనాలు రూ.63 వేల కోట్ల నుంచి రూ.1.06 లక్షల కోట్లకు పెంపు
– పూర్తికావాలంటే రూ.1,47,427 కోట్లు కావాల్సిందే
– వార్షిక నిర్వహణ ఖర్చులనూ తక్కువ చూపారు
– నీళ్ల అమ్మకం పేరుతో 15 బ్యాంకుల నుంచి రూ.87 వేల కోట్ల అప్పులు
– రీ ఇంజినీరింగ్, పంపుల కొనుగోళ్లల్లో రూ.3,452.51 కోట్లు దుర్వినియోగం
– భూకంపాల జోన్‌లో మల్లన్నసాగర్ : బీఆర్‌ఎస్ సర్కారును తూర్పారబట్టిన ‘కాగ్’
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు బండారాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) బయటపెట్టింది. పథకం అంచనాల దగ్గర నుంచి టెండర్ల అప్పగింత వరకూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని తూర్పారబట్టింది. అంచనాలన్నీ సరైనవికావని తేల్చి చెప్పింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లోనూ తప్పుడు సమాచారాన్ని చూపించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు అంచనాలు, నిర్మాణం, నాణ్యత అన్నింటీలోనూ అవకతవకలు జరిగాయని అభిప్రాయపడింది. డీపీఆర్ లేకుండానే రూ. 25,049 కోట్ల పనులు కంపెనీలకు అప్పగించడాన్ని తన నివేదికలో కడిగేసింది. ఇష్టారాజ్యంగా అంచనా వ్యయాలు ఉన్నాయని అభిప్రాయపడింది. ప్రాజెక్టులకు చెందిన వార్షిక ఖర్చులనూ తక్కువ చూపి ప్రజాధనానికి విలువలేకుండా చేశారని విమర్శించింది. నీళ్ల అమ్మకం పేరుతో దాదాపు 15 బ్యాంకుల నుంచి రూ.87 వేల కోట్ల అప్పులు తెచ్చారని స్పష్టం చేసింది. చివరకు కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తికాలేదని తెలియజేసింది. గురువారం కేంద్ర ప్రభుత్వ రంగ ఆడిట్ సంస్థ ‘కాగ్’ అసెంబ్లీలో తన నివేదికను ప్రవేశపెట్టింది. కాగ్ తెలంగాణ అకౌంటెంట్ జనరల్(ఆడిట్) పి.మాధవి, సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ జె. నిఖిల్‌చక్రవర్తి పేర ఈ నివేదిక విడుదలైంది. ఇందులో ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు(ఈసీసీసీపీ) నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు దాకా ఆడిట్ చేసిన వివరాలను పొందుపరిచారు. ప్రధానంగా ప్రాణహిత అంచనాలను తప్పుబడుతూనే కాళేశ్వరం లోపాలపై కాగ్ అక్షింతలు వేసింది. ప్రాజెక్టు ద్వారా ప్రజలు, రైతులకు లాభం జరగకపోగా, 50 వేల ఎకరాల ఆయకట్టు తగ్గిందని గుర్తు చేసింది. డీపీఆర్‌లో రూ.63,352 కోట్లు ఖర్చవుతుందని చెప్పిన గత ప్రభుత్వం, దానిని ఎప్పటికిప్పుడు పెంచుకుంటూ పోయి చివరకు రూ.1,06,000 కోట్ల దాకా అంచనా వ్యయాన్ని తీసుకెళ్లిందని తెలిపింది. ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యేనాటికి రూ.1,47,427 కోట్ల ఖర్చయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాజెక్టు నిర్వహణకు సంబందించి వార్షిక ఖర్చులను సైతం తక్కువగా చూపిందని రిపోర్టులో విమర్శించింది. ప్రపంచంలోనే ఎనిమిదో వింతగా ప్రచారం చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు లోగుట్టును కాగ్ నివేదిక రట్టుచేసింది. మాజీ సీఎం కేసీఆర్‌ను బీఆర్‌ఎస్ శ్రేణులు ఏకంగా కాళేశ్వర్‌రావు అనే సంబోధించేస్థాయికి చేరారు. ఇప్పుడు కాగ్ రిపోర్టుతో కాళేశ్వర్‌రావు పేరును ఉచ్చరించడానికి భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నదికే నడక నేర్పాడని డబ్బా కొంటుకున్న చరిత్రా ఉంది. అమెరికాలోని న్యూయార్క్ స్క్వేర్‌లో కాళేశ్వర్ ప్రాజెక్టు గురించి వీడియో వేశారంటూ అప్పట్లో మహాగొప్పలు చెప్పుకున్నారు. బీబీసీ సైతం ప్రత్యేకంగా ప్రశంసిస్తూ డాక్యుమెంటరి రూపొందించి ప్రసారం చేసింది. మేడిగడ్డ కూలాక గానీ అసలు సంగతి తెలిసిరావడం గమనార్హం.
నీళ్లు అమ్ముతామంటూ అప్పులు
కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని అమ్మడం ద్వారా ప్రభుత్వం ప్రతియేటా రూ.1.019 కోట్ల ఆదాయం సమకూరు తుందని పేర్కొన్నారని నివేదిక తెలిపింది. అప్పుల రీపేమెంట్ కోసం పరిశ్రమలు, తాగునీరు, ఫిషరీస్ ద్వారా ఆదాయం వస్తుందని చెబుతూ, 15 బ్యాంకుల నుంచి రూ.87 వేల కోట్లను రుణంగా తీసుకునేందుకు ఒప్పందం కుదర్చు కుందని వివరించింది. ప్రస్తుతం ఈ అప్పులు, తీర్చేందుకు కొత్తగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించింది.
ప్రతియేటా రూ.14,462 కోట్ల వడ్డీ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్కారు రూ.97,449 కోట్లు అప్పుగా తీసుకుందని ‘కాగ్’ స్పష్టం చేసింది.డీపీఆర్ తర్వాత కూడా మార్పులు చేశారని చెప్పింది. ఒక్కో పనికి అనుమతి ఇస్తూ పోయిందనీ, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ పేరుతో అప్పులు తెచ్చిందని వివరించింది. రూ.87,449 కోట్ల రుణాలు తెచ్చిన సర్కారు, బడ్జెట్ నుంచి కేవలం 27 శాతం మాత్రమే కేటాయింపులు చేసిందని గుర్తు చేసింది. ఒక టీఎంసీ నీటితో సాధారణంగా 10 వేల ఎకరాల్లో పంటసాగుచేయవచ్చనీ, కానీ కాళేశ్వరం నీటితో 17,666 ఎకరాల ఆయకట్టు వస్తుందని అప్పటి సర్కారు అంచనా వేసిందని వివరించింది. కాళే శ్వరం పనులకు సంబం ధించి 56 పనుల్లో 33 పూర్తయ్యాయనీ, వీటిద్వారా 14 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చిందని చూపించినట్టు కాగ్ పేర్కొంది.
భూకంపజోన్‌లో మల్లన్నసాగర్
50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్నసాగర్ భూకంపజోన్‌లో ఉన్నట్టు కాగ్ నివేదిక స్పష్టం చేసింది. ఆ ప్రాంతంలో ఎన్‌జీఆర్‌ఐ ప్రాథమిక సర్వేలో డీప్ సీటెడ్ వర్టికల్ ఫాల్ట్(లోతులో నిటారు పగుళ్లు) ఉన్నట్టుగా తేలిందనీ, ఇక్కడ భూకంప ప్రభావంపై అధ్యయనం చేయకుండానే రూ.6,126.80 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టును నిర్మించారని నివేదికలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
2036 దాకా బాకీ కట్టాల్సిందే
కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలకు రూ.63,352 కోట్ల నుంచి రూ.1.06 లక్షల కోట్లకు పెంచారని కాగ్ చెప్పింది. ప్రాజెక్టు కోసం భారీగా అప్పులు తీసుకొన్నారన్న కాగ్, వీటిని తీర్చడానికి కొత్తగా అప్పులు చేయాల్సిన పరి స్థితి ఏర్పడిందని పేర్కొంది. ఈ అప్పు 2036 సంవత్సరం దాకా కట్టాల్సి వస్తుంది. అప్పటిదాకా వడ్డీ చెల్లించాల్సిందేనని నివేదికలో స్పష్టం చేసింది.
రీఇంజినీరింగ్‌తో రూ.765 కోట్లు నష్టం
కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినా అదనపు ప్రయోజనం లేదని కాగ్ పేర్కొంది. రీఇంజినీరింగ్, మార్పుల కారణంగా అప్పటికే చేసిన కొన్ని పనులు నిరర్థకమయ్యాయనీ, దీంతో రూ.765 కోట్లు నష్టం వాటిల్లిందని తెలిపింది. పనుల అప్పగింతలో నీటిపారుదల శాఖ తొందరపాటు ప్రదర్శించింది. డీపీఆర్ ఆమోదానికి ముందే రూ.25 వేల కోట్ల విలువైన 17 పనులు కాంట్రాక్టర్లకు అప్పగించారు. అవసరం లేకున్నా మూడో టీఎంసీ పనులు చేపట్టారు. దీంతో రూ.25 వేల కోట్లు అదనంగా ఖర్చయింది. సాగునీటిపై మూలధన వ్యయం ఒక్కో ఎకరానికి రూ.6.42 లక్షలు కాగా, ప్రాజెక్టు ప్రయోజనం,వ్యయ నిష్పత్తి 1.51 శాతంగా అంచనావేశారు. కానీ, అది 0.75 శాతంగా చెబుతున్నది. అది మరింత తగ్గే అవకాశముందని వ్యాఖ్యానించింది.
విద్యుత్ కోసం రూ. 10,374 కోట్లు
కాళేశ్వరానికి ప్రతియేటా విద్యుత్ ఛార్జీల కోసం రూ.10,474.56 కోట్ల మొత్తం అవసరమవుతుందని నివేదిక చెప్పింది. అదనంగా వార్షిక నిర్వహణా ఖర్చు కింద రూ.272.70 కోట్లు కావాలి. మొత్తం రూ.10,647.26 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది ఎకరాకు రూ.46,364గా అవుతుంది. ఆదాయం లేని నేపథ్యంలో ఇదంతా భారమేనని తెలిపింది.
రూ.14,462.15 కోట్ల వడ్డీ భారం
కాళేశ్వరం కోసం చేసిన అప్పులకు ప్రతియేటా రూ.14,462.15 కోట్ల మేర వడ్డీలు కట్టాల్సి ఉంటుంది. అప్పులు తీర్చడానికి వచ్చే 14 ఏండ్లల్లో సర్కారుకు లేదా కాళేశ్వరం కార్పొరేషన్‌కు రూ.1,41,544.59 కోట్ల నిధులు అవసరమవు తాయి. ప్రాజెక్టు కోసం రాష్ట్ర బడ్జెట్ ద్వారా, మార్కెట్ రుణాలతో సహా ఇతర వనరుల ద్వారా ఏ మేరకు నిధులు సమకూర్చనున్నారన్న ప్రణాళికకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులూ లేకపోవడం గమనార్హం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంటుంది. అప్పులు ఎలా తీరుస్తారనే విషయమై ఒక సమగ్ర ప్రణాళిక లేదని కాగ్ నివేదిక తప్పుబట్టింది. 2036 నాటికి అప్పులు తీరనున్నాయి.
రెండుగా విభజన
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండుగా విభజించింది. ప్రాణహిత, గోదావరి నదుల నుంచి 180 టీఎంసీల నీటిని ఎత్తిపోసి తెలంగాణలోని 16.40 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సాగునీటిని అందించాలని ఈ ప్రాజెక్టు లక్ష్యం. కాగా ఈ ప్రాజెక్టును సైతం కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అనుమతులు లేకుండా కాంట్రాక్టర్లకు అప్పగించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రీఇంజినీరింగ్ చేస్తూ ప్రాజెక్టును రెండుగా విభజించారు. అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల, కాళేశ్వరం ప్రాజెక్టుగా విభించింది. 2022 మార్చి చివరినాటికి ప్రాణ హితకు రూ.1,727.44 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.86,788.06 కోటుల ఖర్చు చేసినట్టు నివేదికలో కాగ్ పేర్కొన్నది.
9 ఒప్పందాలు వాయిదా..
నిధులు మళ్లింపు కాళేశ్వరం రుణాల చెల్లింపు వాస్తవానికి 2020-21లో ప్రారంభం కావాల్సి ఉంది. వాటితో తొమ్మిది ఒప్పందాలు వాయిదా వేయాలని కోరిందని కాగ్ చెప్పింది. దీంతో వడ్డీల భారం రూ.8182 కోట్లు అదనంగా పడిందని తెలిపింది. కాళేశ్వరం పేరిట తెచ్చిన రూ.1690 కోట్ల అప్పును వేరే పథకాలకు మళ్లీంచిందని తెలిపింది. ఈ కారణంగా రూ.587 కోట్ల భారం పడిందని వివరించింది.
కాంట్రాక్టర్లకు రూ.2684.73 కోట్ల లబ్ధి
కాళేశ్వరం ప్రాజెక్టులోని 21 ఒప్పందాల పనులకుగాను రూ.8338.04 మెగావాట్ల సామర్థ్యం గల లిఫ్టుల సరఫరా, పౌండేషన్ పనులు ఉన్నాయి. సాగునీటిశాఖ మార్కెట్ ధరలను అంచనా వేయకుండా ఈ పనుల అంచనాల్లో పంపులు,మోటార్లు, వాటి అనుబంధ పరికరాల కోసం రూ.17,653.71 కోట్ల మొత్తాలను చేర్చింది. అందులో నాలుగు పనుల్లో కాంట్రాక్టర్లు వాస్తవంగా పరికరాలను కోనుగోలు చేసిన బీహెచ్‌ఈఎల్ ధరలను ఆడిట్ చేయగా, ఈ పరికరాల కోసం అంచనా వ్యయం రూ.7,212.32 కోట్లు కాగా వాస్తవ ధర రూ.1,686.59కోట్ల కంటే రూ.5,525.75 కోట్లు అధికంగా ఉన్నట్టు తేలింది. బీహెచ్‌ఈఎల్ పరిధిలో లేని పరికరాల కోనుగోలు కోసం అంచనా విలువలో 30 శాతాన్నీ, కాంట్రాక్టర్లు ఇతర ఖర్చుల వ్యయం, లాభం కోసం ఊ. మరో 20 శాఆన్ని అనుమతించినా కూడా ఈపనుల్లో కాంట్రాక్టర్లకు రూ.2,684.73 కోట్ల మేర అనుచిత లబ్ధి చేకూర్చినట్టు కాగ్ రిపోర్టులో విమర్శించింది.