కలహాల కాపురం…!

కలహాల కాపురం...!– బీహార్‌లో జేడీయూ, బీజేపీ మధ్య మొదలైన విభేదాలు
– పెద్దన్న పాత్ర కోసం కమలదళం ఆరాటం
– బింకం వదలని నితీష్‌
– ఆలస్యమవుతున్న క్యాబినెట్‌ విస్తరణ, శాఖల కేటాయింపు
– వాయిదా పడిన బలపరీక్ష
పాట్నా : బీహార్‌లో జేడీయూ అధినేత నితీష్‌ కుమార్‌ నేతృత్వంలో ఐదు రోజుల క్రితం ఏర్పడిన జేడీయూ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో అప్పుడే పొరపొచ్చాలు మొదలయ్యాయి. నితీష్‌ తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి రోజులు గడుస్తున్నప్పటికీ రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయి. క్యాబినెట్‌ విస్తరణ, శాఖల కేటాయింపు, శాసనసభలో బల నిరూపణ వంటి విషయాలలో స్పష్టత రావడం లేదు. శాఖల కేటాయింపు విషయంలో నితీష్‌, బీజేపీ మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయని ఊహాగానాలు వినవస్తున్నాయి. ముఖ్యంగా హోం, సాధారణ పరిపాలన శాఖల పైనే చిక్కుముడి ఏర్పడుతోంది.
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ ఎన్ని స్థానాలకు పోటీ చేయాలనే విషయంపై కూడా ఏకాభిప్రాయం కుదరడం లేదని సమాచారం. సభలో బల నిరూపణ కోరే తేదీని నితీష్‌ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే సవరించడం రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యంలో ముంచేసింది. తాజాగా గురువారం విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్‌ ప్రకారం ఈ నెల 12న నితీష్‌ ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొంటుంది. అదే రోజు స్పీకర్‌ ఎన్నిక కూడా జరుగుతుంది. ప్రస్తుత స్పీకర్‌ అవధ్‌ బిహారీ చౌదరిని పదవి నుండి తొలగిస్తున్నామని ఎన్డీఏ ప్రకటించింది. ఆర్జేడీ సీనియర్‌ నేత అయిన చౌదరి పార్టీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సన్నిహితుడు. నితీష్‌ ప్రభుత్వం ఈ నెల 10న సభా విశ్వాసం కోరుతుందని అంతకుముందు ప్రకటించారు.
ఆ రెండు శాఖల పైనే పట్టు
నితీష్‌ గతంలో ఎనిమిది సార్లు బీహార్‌ ముఖ్యమంత్రిగా వ్యవహరిం చినప్పటికీ క్యాబినెట్‌ విస్తరణ, శాఖల కేటాయింపు, బల నిరూపణలో ఆలస్యం జరగడం ఇదే మొదటిసారి అని రాజకీయ పరిశీలకులు తెలిపారు. ‘నితీష్‌ 2005 నుండి బీహార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రమాణస్వీకారం తర్వాత ఆయన మిగిలిన పనులన్నింటినీ చాలా వేగంగా పూర్తి చేసే వారు. అయితే ఈసారి మాత్రం ఆయన వ్యవహార శైలికి అనుగుణంగా ఏదీ జరగడం లేదు. నితీష్‌, బీజేపీ మధ్య ఏదో జరుగుతోంది. సమస్యల పరిష్కారానికి వారు మరింత సమయం తీసుకుంటున్నారు’ అని వారు చెప్పారు. మంత్రుల శాఖలకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయని, అందుకే జాప్యం జరుగుతోందని జేడీయూ వర్గాలు అంగీకరిస్తున్నాయి. కీలకమైన హోం, సాధారణ పరిపాలన శాఖలను బీజేపీకి అప్పగించేందుకు నితీష్‌ సుముఖంగా లేరు. గతంలో కూడా ఆయన ఈ రెండు శాఖలనూ తన వద్దే అట్టిపెట్టుకున్నారు. ఈ శాఖలను గత భాగస్వాములైన ఆర్జేడీకి కానీ బీజేపీకి కానీ ఇచ్చే విషయంలో ఆయన ఎన్నడూ రాజీ పడలేదు.
ఆర్జేడీ ఎత్తుగడలు
ఇదిలావుండగా జేడీయూలోని కొందరు ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకొని విశ్వాస పరీక్షలో నితీష్‌కు షాక్‌ ఇవ్వాలని ఆర్జేడీ యోచిస్తోంది. నితీష్‌ బీజేపీతో జట్టు కట్టడం కొందరు జేడీయూ ఎమ్యెల్యేలకు ఇష్టం లేదు. రాష్ట్రంలో ఇప్పుడే రాజకీయ క్రీడ ప్రారంభమైందంటూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ చేసిన వ్యాఖ్యను కొందరు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
ఆ ఇద్దరూ కొరకరాని కొయ్యలే
ఏదేమైనా అందరూ అనుకుంటున్న విధంగా నితీష్‌ ప్రభుత్వంలో వ్యవహారాలు సజావుగా సాగడం లేదు. గతంలో మాదిరిగా ఈసారి ప్రభుత్వంలో తమది రెండో స్థానం కాదని బీజేపీ ఇప్పటికే తెగేసి చెప్పింది. బీజేపీ నేతలైన ఉప ముఖ్య మంత్రులు సామ్రాట్‌ చౌదరి, విజరు కుమార్‌ సిన్హాలు కరడుకట్టిన నితీష్‌ విమర్శకులుగా పేరు పొందారు. నితీష్‌ను ముఖ్యమంత్రి పదవి నుండి గద్దె దింపే వరకూ తలపాగా తీయబోనని చౌదరి గత సంవత్సరంలో బహిరంగంగానే ప్రకటించారు. సిన్హా కూడా తక్కువ వాడేమీ కాదు. నితీష్‌ ప్రజాస్వా మ్యాన్ని ఖూనీ చేశారని, ఆయన అహంభావి అని గతంలో ఆరోపించారు. వీరిద్దరినీ ఉప ముఖ్యమంత్రులుగా ఎంపిక చేయడం ద్వారా నితీష్‌కు బీజేపీ గట్టి సంకేతం పంపింది.
పదవుల కోసం పోటీ బల నిరూపణ తర్వాతే
క్యాబినెట్‌ విస్తరణ జరుగుతుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. పలువురు పాత, కొత్త నేతలు నితీష్‌ ప్రభుత్వంలో స్థానం కోసం పోటీ పడుతున్నారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారు సైతం పదవుల కోరు కుంటున్నారు. వీరందరినీ సంతృప్తి పరచడం నితీష్‌కు సవాలుగా
మారింది.
సీట్లపై తకరారు
లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించుకుంది. జేడీయూకు 12 స్థానాలు మాత్రమే ఇస్తామని తెలియజేసింది. అయితే 2019లో తాము పోటీ చేసిన 17 స్థానాలనూ తిరిగి తమకే కేటాయించాలని నితీష్‌ పట్టుబడుతున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ, బీజేపీ చెరో 17 స్థానాల్లో పోటీ చేశాయి. బీజేపీ 17, జేడీయూ 16 స్థానాల్లో విజయం సాధించాయి. బీజేపీ భాగస్వామి ఎల్‌జేపీకి ఆరు స్థానాలు వచ్చాయి. మొత్తంమీద ఎన్డీఏ 39 స్థానాలు గెలుచుకుంది (మొత్తం స్థానాలు 40). ఆ ఎన్నికల్లో ఎన్డీఏ 54.40% ఓట్లు పొందింది. దీనిని దృష్టిలో ఉంచుకొనే పూర్వ వైభవం కోసం నితీష్‌తో బీజేపీ చేతులు కలిపింది.
నితీష్‌లో క్రాస్‌ ఓటింగ్‌ భయం
‘నితీష్‌ ముఖ్యమంత్రి అయితే అయి ఉండవచ్చు. కానీ గతంలో ఎన్డీఏలో ఉన్నప్పటి మాదిరిగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. పని చేయలేకపోతున్నారు’ అని జేడీయూకు చెందిన సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఒకరు వ్యాఖ్యానించారు. క్షేత్ర స్థాయిలో ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మారాయని, బీజేపీ మరిన్ని డిమాండ్లను తెర పైకి తెస్తోందని, పెద్దన్న పాత్ర పోషించాలని ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. కాగా శాసనసభలో బల పరీక్ష జరిగే సమయంలో తన పార్టీకే చెందిన ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగుకు పాల్పడవచ్చునని నితీష్‌ అనుమానిస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో వదంతులు విన్పిస్తున్నాయి. అందుకే బల పరీక్షకు ముందే మంత్రిమండలిని విస్తరించి లేనిపోని తల నెప్పులు తెచ్చుకోవడం ఆయనకు ఇష్టం లేదని అంటున్నారు.