చంద్రజ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌లో బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కలశ’. కొండా రాంబాబు దర్శకుడు. డాక్టర్ రాజేశ్వరి చంద్రజ వాడపల్లి నిర్మాత. శుక్రవారం ఈ చిత్ర ట్రైలర్‌ను డైరెక్టర్ మలినేని గోపీచంద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘మూవీ ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా థ్రిల్లరా? లేక హర్రరా? అనేది తెలీకుండా తెలివిగా కట్ చేశారు. కలశ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టి డైరెక్ట్ చేసిన దర్శకుడు రాంబాబుకి, నిర్మాతకు, నటీనటులకు, టెక్నీషియన్స్‌కు అల్ ది బెస్ట్. ఈనెల 15న రిలీజ్ అవుతుంది. తప్పకుండా చూడండి’ అని అన్నారు. ‘ట్రైలర్‌ను రిలీజ్ చేసిన డైరెక్టర్ మలినేని గోపిచంద్‌కి థ్యాంక్స్. ప్రేక్షకుల బ్లెస్సింగ్స్ కావాలి’ అని హీరోయిన్ భానుశ్రీ చెప్పారు. దర్శకుడు కొండా రాంబాబు మాట్లాడుతూ, ‘మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉంది’ అని తెలిపారు. ‘పవర్‌ఫుల్ కథ, కథనాలతో ప్రేక్షకులకు కావల్సిన అన్ని హంగులతో ఈ చిత్రాన్ని నిర్మించాం. మా ప్రయత్నం మిమ్మల్ని తప్పకుండా మెప్పిస్తుందనే నమ్మకంతో ఉన్నాం’ అని నిర్మాత రాజేశ్వరి చంద్రజ వాడపల్లి చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్ గంగధారి, సంగీతం: విజరు కురాకుల, ఎడిటర్: జున్కెద్ సిద్దిఖీ, లిరిక్స్: సాగర్ నారాయణ.