కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ..

– విచారణకు హజరైన రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్‌ వి.ప్రకాశ్‌

నవతెలంగాణ హైదరాబాద్‌: కాళేశ్వరం కమిషన్‌ విచారణ కొనసాగుతోంది. దీనిలో భాగంగా రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్‌ వి.ప్రకాశ్‌ను కమిషన్‌ ప్రశ్నించింది. కమిషన్‌కు మద్దతు ఇచ్చేందుకు అఫిడవిట్‌ సమర్పించినట్టు వి.ప్రకాశ్‌ తెలిపారు. ఎవరి మద్దతూ అవసరం లేదని కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్ పీసీ ఘోష్‌ ఆయనకు బదులిచ్చారు. రికార్డులు, డాక్యుమెంట్ల ఆధారంగా పని చేస్తామని చెప్పారు. తమ ముందు ఎవరూ రాజకీయ ఉపన్యాసాలు చేయవద్దన్నారు.
తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్టు ప్రకాశ్‌ తెలిపారు. స్థిరీకరణకూ ఎక్కువ నీరు అవసరం కాబట్టి చేపట్టారన్నారు. మేడిగడ్డ వద్ద ఆనకట్ట వద్దని ఇంజినీర్ల కమిటీ చెప్పింది కదా అని కమిషన్‌ ప్రశ్నించింది. విశ్రాంత ఇంజినీర్ల కమిటీ అలా చెప్పలేదని ప్రకాశ్‌ పేర్కొన్నారు. బొగ్గు గనుల వద్ద సొరంగాలు వద్దన్న సిఫారసును ప్రభుత్వం గౌరవించిందని చెప్పారు. నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకునే కాళేశ్వరం నిర్మించారన్నారు.