– ఇరిగేషన్ ఈఎన్సీకి ఉద్వాసన
– మురళీధర్‌రావు రాజీనామాకు సర్కారు ఆదేశం
– ఇన్‌చార్జి ఈఎన్సీ వెంకటేశ్వర్లు తొలగింపు
– విజిలెన్స్ నివేదికతో చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం
– అసెంబ్లీలో శ్వేతపత్రంపైనా వాడివేడి చర్చకు అవకాశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
నీటిపారుదల శాఖలో రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో చోటుచేసుకున్న అవకతవకలకు సంబంధించి విజిలెన్స్ నివేధిక ఆధారంగా సర్కారు చర్యలకు ఉపక్రమించింది. తొలుత ఇద్దరు సీనియర్ ఇంజినీర్లపై వేటు వేసింది. నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మరళీధర్ రావును రాజీనామా చేయాలని ఆదేశించింది. అలాగే రామగుండం ఈఎన్సీ, కాళేశ్వరం ఇన్‌ఛార్జీ ఈఎన్సీగా ఉన్న ఎన్. వెంకటేశ్వర్లును సర్వీసు నుంచి తొలగిస్తూ జీవొ నెంబరు 13ను జారీచేసింది. మరికొందరు ఇంజినీర్ల పైనా త్వరలో చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చర్యలతో కాళేశ్వరం అవినీతి, అక్రమాల విషయంలో రాజీపడేది లేదని సీఎం రేవంత్ నేతృత్వంలోని సర్కారు తేల్చిచెప్పింది. సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తొలి నుంచి కాళేశ్వరం పిల్లర్ల కుంగుబాటు విషయంలో ఆగ్రహంతో ఉన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే కోణంలో పూర్తిస్థాయి అధ్యయనం అనంతరమే ఈ చర్యలు తీసుకోవడానికి సీఎంకు సిఫారసు చేసినట్టు తెలిసింది. గత శనివారం విజిలెన్స్ శాఖ నుంచి మధ్యంతర నివేదిక అందిన నేపథ్యంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారులపై వేటుకు నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. తొలుత ఈఎన్సీ మురళీధర్‌రావుపై కూడా చర్యలు తీసుకోవాలనీ భావించినా, అనేక సమీకరణాల నేపథ్యంలో ఆయనే రాజీనామా చేసేలా అవకాశం ఇచ్చినట్టు తెలిసింది. సర్వీసు పూర్తయినా ఎక్స్‌టెన్షన్‌పై కొనసాగుతున్న నేపథ్యంలో రాజీనామా చేయాలని ఆదేశించినట్టు సమాచారం.
మేడిగడ్డ నిర్మాణంలో అవకతవకలు జరుగుతున్నా పట్టించుకోకుండా, ప్రభుత్వానికి రిపోర్టు చేయకుండా, ప్రాజెక్టు వాస్తవ పరిస్థితులను అంచనా వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇన్‌ఛార్జి ఈఎన్సీ వెంకటేశ్వర్లును సర్వీసు నుంచి పక్కనపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వెంకటేశ్వర్‌రావు నిర్మాణ సంస్థతో కుమ్మక్కయ్యారనే అరోపణలు, విమర్శలు గత రెండేండ్లుగా వస్తున్నాయి. ఇంతటి తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి రాజీవ్‌రతన్ నేతృత్వంలోని విజిలెన్స్ బృందం ఇచ్చిన నివేదిక కారణమని సమాచారం. మొత్తం ప్రాజెక్టు అవకతవకలపై అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ), ఇటు విజిలెన్స్ శాఖ విచారణ చేసిన సంగతి తెలిసిందే. ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టు సైతం ప్రాజెక్టుకు సంబంధించి సగానికిపైగా పిల్లర్లు పనికిరావనీ, ఇది మొత్తం ప్రాజెక్టుకే ప్రమాదమని నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. వాటిని కూల్చి మళ్లీ నిర్మించిన తర్వాతే ప్రాజెక్టును వినియోగించడంలోకి తేవాలని అభిప్రాయపడినట్టు తెలిసింది. వచ్చే వర్షాకాలం వరదను ఈ బ్యారేజీ తట్టుకునే అవకాశం లేదని కూడా నివేదికలో తెలియజేశారు. ఈ రెండు నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఈ కఠిన చర్యలు తీసుకున్నట్టు సమాచారం.
ఇకపోతే ఈ తరహాలో మరికొందరు అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. గురువారం నుంచి ఒటాన్ అకౌంట్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సర్కారు చర్య సంచలనాలకు తావిస్తున్నది. అవినీతి,అక్రమాలను సహించబోమని ఈ చర్యల ద్వారా రేవంత్ ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. సమావేశాల్లో నీటిపారుదల శాఖకు సంబంధించి శ్వేతపత్రం విడుదలచేసేందుకు ప్రభుత్వం సిద్దమైన విషయం విదితమే. ఈ తరుణంలో ఆ శాఖలో దీర్ఘకాలికంగా విధులు నిర్వర్తిస్తున్న ఇంజినీర్లపై వేటు వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన, సహకరించిన అధికారులపై తీవ్రమైన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజలకు సరైన సంకేతాలు పంపాలని భావిస్తున్నది. తాము అవినీతికి వ్యతిరేకమని చెప్పదలుచుకుంది. అలాగే వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని, అప్పటి ముఖ్యమంత్రి, మంత్రులను ప్రజల్లో దోషులుగా నిలబెట్టాలనే ప్రయత్నం సైతం ఈ చర్యల వెనుక ఉన్నట్టుగా ప్రచారం జరుగుతున్నది. అలాగే కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)కి ప్రాజెక్టుల అప్పగింత పేర సర్కారు వ్యతిరేక ప్రచారం చేపట్టిన బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేసేందుకు, నల్లగొండలో ఆందోళన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై దృష్టిసారించింది. వేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఇదిలావుండగా ఈఎన్సీ వెంకటేశ్వర్లు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంపుహౌస్‌కు సంబంధించిన పనులను పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే