మహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతోనే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టాం

– పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో ఈఎన్‌సీ మురళీధర్‌
– పాత విషయాలనే ఏకరవు పెట్టిన వైనం
మేడిగడ్డ నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
గత ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతోనే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టామని ఈఎన్‌ సీ మురళీధర్‌ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రుల బృందం ముందు శనివారం మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో ఆయన వివరాలను తెలిపారు. ప్రతి ఏటా గోదావరిలో 3 వేల టీఎంసీల నీరు వృధాగా పోతుందనీ, దీనిని సద్వినియోగం చేసుకునేందుకు గత ప్రభుత్వం మొదట ప్రాణహిత ప్రాజెక్టు చేపట్టినప్పటికీ 152 మీటర్ల ఎత్తులో దాన్ని ప్రతిపాదించడం వల్ల మహారాష్ట్రలో చాలా భూభాగం దెబ్బతింటుందనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య పలు మార్లు జరిగిన చర్చలు విఫలం కావడంతో 148 మీటర్లకు ప్రాజెక్టును కుదించాల్సి వచ్చిందన్నారు. ఆ తర్వాత నీటి లభ్యత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆ ప్రాజెక్టును పక్కనపెట్టి రీడిజైన్‌ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. ఆ ప్రాజెక్టు వల్ల 19.63 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించడంతోపాటు మరో 18 లక్షల ఎకరాల అయకట్టు స్థిరీకరణ జరుగుతుందని వివరించారు.. ఈ ప్రాజెక్టు వల్ల 13 జిల్లాలు లబ్ధి పొందుతాయని తెలిపారు. అయితే ప్రాజెక్టు ఇంకా పూర్తి కానందున కేవలం ఒక లక్ష ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చాయని తెలిపారు . మేడిగడ్డ డ్యామ్‌ ఏడో బ్లాక్‌ వద్ద 20వ నెంబర్‌ పిల్లర్‌ 1.256 మీటర్లు కుంగిందని తెలిపారు. అక్కడ కాపర్‌ డ్యాం నిర్మాణం అనంతరం మరమ్మతులు లేదా పునర్‌ నిర్మాణం చేయనున్నట్టు తెలిపారు. నిపుణుల సూచన మేరకు కొత్త గేట్లు అమర్చనున్నట్టు చెప్పారు. అయితే మంత్రులు ఆరోపించినట్టుగా గత ప్రభుత్వం ఒత్తిడి వల్ల గాని తప్పిదాల వల్ల గాని కాళేశ్వరం ప్రాజెక్టుకు నష్టం జరిగిందనే విషయాన్ని మాత్రం ఈఎన్‌సీ తన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో ఎక్కడా ప్రస్తావించలేదు.
కుంగిన పిల్లర్లను పరిశీలించిన మంత్రులు బృందం
పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ అనంతరం మంత్రుల బృందం కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు ప్రదేశాన్ని పరిశీలించింది. దెబ్బతిన్న 20వ పిల్లర్‌తో పాటు ఇరువైపులా నష్టం జరిగినా ఇతర పిల్లర్లను కూడా ఆ బృందం దగ్గరుండి పరిశీలించింది. బ్యారేజీకి ఏ మేరకు నష్టం జరిగిందంటూ ఈ సందర్భంగా మంత్రులు ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన పిల్లర్లను పునర్‌ నిర్మించేందుకు వీలుగా నిర్మిస్తున్న కాపర్‌ డ్యాం పనులను పరిశీలించారు . అనంతరం మంత్రుల బృందం అన్నారం బ్యారేజీని పరిశీలించేందుకు వెళ్ళింది. ప్రాజెక్టులో ఏర్పడిన బుంగల వల్ల జరిగిన నష్టాన్నిమంత్రులు అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం 5 గంటలకు మంత్రుల బందం హెలికాప్టర్‌లో హైదరాబాదుకు తిరుగు ప్రయాణమైంది.