కాళేశ్వరం వల్లే భారీగా పంట దిగుబడి

– కాలం ఎత్తిపోయినా కాల్వల ద్వారా నీరు
– అవినీతిపై రాహుల్‌ మాటలు విడ్డూరం: ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
నవ తెలంగాణ – సిద్దిపేట
”కాళేశ్వరం నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ అగ్రనేథ రాహుల్‌ గాంధీ చెప్పడం విడ్డూరంగా ఉంది. ఖర్చు పెట్టింది రూ.80 వేల కోట్లు అయితే.. లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది.. కాళేశ్వరం పూర్తయింది కాబట్టే భూమికి బరువైనంత పంట దిగుబడి వస్తుంది.. కాలం ఎత్తిపోయినా కాల్వల ద్వారా నీరు పారుద్ది..” అని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట పత్తి మార్కెట్‌ యార్డులో బుధవారం ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ, తెలంగాణ ఆయిల్‌ ఫెడ్‌ ఆధ్వర్యంలో రైతులకు స్ప్రింక్లర్లు, తుంపర సేద్య పరికరాలను మంత్రి పంపిణీ చేశారు. ఆయిల్‌ ఫామ్‌ సాగుపై రైతులకు సదస్సులో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం పూర్తి చేశాం కాబట్టే భూమికి బరువైనంత పంట పండుతున్నదని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కేవలం 300 స్ప్రింక్లర్ల సెట్లు పంచేదని, ఇవాళ ఒక్కరోజే 1001 మందికి స్ప్రింక్లర్లు పంపిణీ చేసుకుంటున్నామని అన్నారు. 15 వేల స్ప్రింక్లర్ల సెట్ల పంపిణీకి రూ.20 కోట్ల 18 లక్షల సబ్సిడీ ప్రభుత్వం భరించిందని, ఇది రైతుల పట్ల ప్రేమ, చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. కాళేశ్వరం మోటార్లు ఆన్‌ చేసి కాల్వల ద్వారా రైతులకు నీళ్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.
ఎన్నికల కోసం ఆపద మొక్కులు మొక్కే వారికి దండం పెట్టాలని, గత ప్రభుత్వాల హయాంలో దొంగరాత్రి కరెంటు వచ్చేదని, ఇవాళ సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో 24 గంటలు నాణ్యమైన కరెంటు సరఫరా జరుగుతున్నదని అన్నారు. చుక్క చుక్క ఒడిసి పట్టి కాళేశ్వరం జలాశయాలు నింపాలని సీఎం కేసీఆర్‌ చెప్పారని, కాలం ఎత్తి పోయినా.. కాళేశ్వరం గేట్లు ఎత్తి రైతులకు కాల్వల ద్వారా పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. కాళేశ్వరంతో యాసంగిలో 55 లక్షల ఎకరాల పంట పండిందని, 26 వేల కోట్ల రూపాయల ధాన్యాన్ని కొన్నామని చెప్పారు. ఎండమావులకు ఆశపడొద్దు, ధోకేబాజ్‌లకు లొంగొద్దని రైతులకు హితవు పలికారు. చేర్యాల ప్రాంత రైతులకు శుభవార్త అని, దేవాదుల నీళ్లు తెచ్చి తపాస్‌పల్లి రిజర్వాయరు నింపుతామని చెప్పారు. మల్లన్నసాగర్‌, రంగనాయక, కొండ పోచమ్మ, అంతగిరి, గౌరవెల్లి రిజర్వాయర్లు నింపి కాల్వల ద్వారా పంట పొలాలకు నీళ్లు అందిస్తామని భరోసా ఇచ్చారు. జిల్లాలో 8 వేల 500 ఎకరాల్లో ఆయిల్‌ ఫామ్‌ సాగు చేసినట్టు, ఈ సంవత్సరం 18000 ఎకరాలు టార్గెట్‌ పెట్టుకున్నట్టు.. ఆయిల్‌ ఫామ్‌ ద్వారా ఎకరాకు లక్ష రూపాయల వరకు ఆదాయం ఉన్నదని తెలిపారు. ఆయిల్‌ ఫామ్‌ ఎకరాకు 80 వేల రూపాయల వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నదన్నారు.
పంట కాలాన్ని నెల ముందుకు తేవాలని, వరి బదులుగా ప్రత్యామ్నాయ పంట మార్పిడి చేయాలని, పంట మార్పిడి విధానం వల్ల పంటలు బాగా పండుతాయని, వెదజల్లే పద్ధతిన వరి సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు నాగిరెడ్డి, రాష్ట్ర ఆయిల్‌ ఫెడ్‌ వైస్‌ చైర్మెన్‌ సోమిరెడ్డి, జిల్లాలోని పలు మండలాల ఏంపీపీలు, మార్కెట్‌ కమిటీ చైర్మెన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి సునీత, అధికారులు పాల్గొన్నారు.