– రాంపూర్ చిన్నది.. మనస్సు పెద్దది
– బీజేపీ, కాంగ్రెస్ తిట్టడంలో పోటీ
– కేసీఆర్ పుట్ల వడ్లు పండించడంలో పోటీ
– బీఆర్‌ఎస్ పార్టీకి మద్దతంటూ గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానం : పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ- సిద్దిపేటరూరల్
రాంపూర్ గ్రామం చిన్నదైన మనసు పెద్దదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా రూరల్ మండలంలోని రాంపూర్‌లో నూతన గ్రామ పంచాయతీ భవనం, రెడ్డి కుల సంఘ భవన నిర్మాణం పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. డంప్ యార్డు, శ్మశాన వాటికను ప్రారంభోత్సవం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గ్రామానికి వచ్చేదాకా నాకు ఏకగ్రీవ తీర్మానం చేస్తారని తెలియదని, తీర్మానం చేసినందుకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలని తెలిపారు. తొలి బోణీ మీదేనని, సీఎం కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీ టికెట్ ఇచ్చాక వచ్చిన మొదటి గ్రామం ఇదేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత చిన్న గ్రామమైన రాంపూర్‌లోనే యాసంగిలో 18 లారీల ధాన్యం పండించారని చెప్పారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంటే సరిపోతదని కాంగ్రెస్, బీజేపీ నాయకులు అంటున్నారని, తెలివితోనే మాట్లాడుతున్నారా లేదా మీరే ఆలోచించాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు తిట్టడంలో పోటీ పడితే.. సీఎం కేసీఆర్ పుట్ల వడ్లు పండించడంలో పోటీ పడుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషివల్లే ఇతర రాష్ట్రాలకు ధాన్యం ఎగుమతి చేసే స్థాయిలో తెలంగాణ ఉందన్నారు. ఆసరా, కల్యాణ లక్ష్మి, రైతుబంధు వంటి పథకాలు అమలు పరిచి అందరి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నది సీఎం కేసీఆరేనని తెలిపారు. రైతు అర్థాంతరంగా చనిపోతే రూ.5 లక్షల ఆర్థిక సాయం చేసి ఆ రైతు కుటుంబానికి పెద్దన్నలా కేసీఆర్ నిలుస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో సుడా చైర్మెన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, జెడ్పీటీసీ శ్రీహరి గౌడ్, సర్పంచ్ ఏర్పుల బిక్షపతి, వైస్ ఎంపీపీ యాదయ్య, ఆత్మ కమిటీ చైర్మెన్ లక్కర్స్ ప్రభాకర్ వర్మ, ఉప సర్పంచ్ విట్టల్ రెడ్డి, వార్డు సభ్యులు, వివిధ గ్రామ సర్పంచులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.