– మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టుకు శిల్పం చెక్కిన కేసీఆర్… అది కుంగిపోతే మాత్రం పరిష్కారం చూపకుండా ఎక్కడ ఉన్నారని రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. ఆగమేఘాలమీద ఆ ప్రాజెక్టుకు రీడిజైన్ చేయడం వల్లనే ‘మేడిగడ్డ కుంగింది. అన్నా రం బుడగలొస్తు న్నాయి. సుందిళ్ల ఊటలొస్తున్నాయి’ అని ఎద్దేవా చేశారు. వ్యక్తిగత లబ్దికోసమే ఆ ప్రాజెక్టు రీడిజైన్ చేశారని ఆరోపించారు. శనివారం శాసనసభలో ఆయన సాగునీటి ప్రాజెక్టుల శ్వేతపత్రంపై ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు కుంగితే దాన్ని పరిశీలించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమెల్సీలు పోతే, బొందలగడ్డకు పోయారంటూ కేసీఆర్ అనడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ సభకు వచ్చి తప్పు ఎలా జరిగిందో చెప్పాలన్నారు. ఇంజినీర్ల కమిటీ కూడా సమగ్ర నివేదిక ఇచ్చిందన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తి చేయడంలో ఉన్న అత్రుత, కంగారు, నాణ్యతపై పెట్టలేదని ఎద్దేవా చేశారు. గోదావరి నీళ్లు కూడా ఇవ్వలేని దద్దమ్మలు అంటూ కేసీఆర్ తమపై విమర్శలు చేస్తున్నారనీ, ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ ప్రభుత్వమే ఉంది కదా? ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ‘కట్ ఆఫ్ ఆర్‌సీసీ’ చేయకుండా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.