వట్టిపోయిన వాగుల్లోకి కాళేశ్వరం జలాలు

– కరువులో కూడా పొలాలకు సాగు నీళ్లు : మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
– చింతలూరు పెద్దవాగులోకి నీటీ విడుదల
నవతెలంగాణ-జక్రాన్‌పల్లి
‘కాళేశ్వరం జలాలను నిజామాబాద్‌ జిల్లాలో వట్టిపోయిన వాగుల్లోకి కాళేశ్వరం జలాలను తీసుకొచ్చి రైతుల పంట పొలాలకు చేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే చెందుతుందని రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఎస్సారెస్పీ నుంచి పైపు లైన్లు, పంపు హౌజ్‌ల ద్వారా 20వ ప్యాకేజీతో కాళేశ్వరం నీళ్ళు తీసుకు వచ్చామని, అర్థం పర్థం లేని ఆరోపణలు చేసే ప్రతి పక్షాలకు ఇక్కడికి వచ్చిన నీళ్ళే సరైన సమాధానమని స్పష్టంచేశారు. తాము ఇచ్చిన మాట మేరకు 20, 21 ప్యాకేజీల ద్వారా నీటిని తీసుకువచ్చామని, వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం చింతలూరు వద్ద పెద్దవాగులో ప్యాకేజీ 20, 21 ద్వారా కాళేశ్వరం జలాలను మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఆర్టీసీ చైర్మెన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటి ఇంటికి తాగు నీరు ఇచ్చినట్టు, ప్రతి మూడు ఎకరాలకు ఒక అవుట్‌ లేట్‌ వాల్వును ఏర్పాటు చేయనున్నామని, ఇందుకు అవసరమయ్యే పైపులైను వేసేందుకు రైతులు అవకాశం ఇవ్వాలని కోరారు. కరెంట్‌, బోరు, వర్షాలతో సంబంధం లేకుండా వాల్వూ తిప్పగానే సాగు నీరు రైతుల పంట పొలాల్లో చేరుతాయని, కేసీఆర్‌ ఉన్నన్ని రోజులు రైతులకు సాగు నీటిని డోకా రానివ్వరని స్పష్టం చేశారు. అనంతరం బాజిరెడ్డి గోవర్ధన్‌ మాట్లాడుతూ.. రూ. 2600 కోట్ల వ్యయంతో ప్యాకేజీ పనులు చేపట్టి రైతులకు ఇచ్చిన మాట నెరవేర్చినట్టు తెలిపారు. ఇజ్రాయిల్‌ టెక్నాలజీతో ప్రాజెక్ట్‌ డిజైన్‌ చేసి పూర్తి చేశామని, కాళేశ్వరం జలాలు రూరల్‌ నియోజక వర్గం వరకు చేరుకోవటం ఒక చరిత్ర అని, కరువు వచ్చినా సాగునీళ్లకు అంతరాయం ఉండబోదన్నారు. ఇప్పటికే 25 చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు పూర్తయ్యా యని, భూగర్భ జలాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. రైతులు సీఎం కేసీఆర్‌ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ధర్పల్లి జడ్పీటీసీ, జిల్లా ఒలంపిక్‌ సంఘం ఉపాధ్యక్షులు బాజిరెడ్డి జగన్‌, ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్‌ చైర్మెన్‌ సాంబారి మోహన్‌, ఎంపీపీ కుంచాల విమల రాజు, వైస్‌ ఎంపీపీ తిరుపతి రెడ్డి, మండల అధ్యక్షులు నట భోజన, సర్పంచ్‌ పుప్పాల సుకన్య ప్రసాద్‌, ఇరిగేషన్‌ శాఖ అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, రైతులు, ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.