‘కిరోసిన్’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ధృవ వాయు ఇప్పుడు ‘కళింగ’తో హీరో, దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబో తున్నారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 13న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నేత, ఎంపీ రఘు నందన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ధృవ వాయు మాట్లాడుతూ, ‘నేను రాసిన కథకు, యాకూబ్ మంచి డైలాగ్స్ ఇచ్చారు. కెమెరామెన్ అక్షరు పగలూ రాత్రి తేడా లేకుండా నాతో పాటు పని చేశారు. ఎడిటర్ నరేష్ సినిమాను అద్భుతంగా మలిచాడు. విజువల్స్ బాగా వచ్చాయి. వాటికి తగ్గ ఆర్‌ఆర్‌తో విశ్వ శేఖర సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ చూసిన చాలా మంది కాంతారనా, విరూపాక్షనా?, మంగళవారంలా ఉంటుందా? అని అడుగుతున్నారు. కానీ ఇదొక కొత్త కాన్సెప్ట్. చాలా కొత్త ఎక్స్‌పీరియెన్స్ వస్తుంది’ అని అన్నారు. ‘సినిమా అద్భుతంగా వచ్చింది. పాటలు, మ్యూజిక్ గురించి అంతా మాట్లాడుకుంటారు. ఆర్‌ఆర్ మ్యాజిక్‌ను థియేటర్లో చూడాల్సిందే’ అని నిర్మాతలు దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ తెలిపారు. నాయిక ప్రగ్యా నయన్ మాట్లాడుతూ,’మా టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ ఫోన్ చేసి ప్రశంసించారు. సినిమా చూశాక కూడా అలాంటి కాల్స్ వస్తాయి. నా పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుంది’ అని చెప్పారు.