
– కలెక్టర్ నారాయణరెడ్డి
– మహనీయుని స్ఫూర్తితో ముందుకు నడవాలని పిలుపు
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్ : పుట్టుక నీది చావు నీది. బ్రతుకంతా దేశానిదని నినదించడమే కాకుండా తన జీవితాన్నంతటినీ తెలంగాణకు త్యాగం చేసిన గొప్ప వ్యక్తి ప్రజాకవి కాలోజి నారాయణరావు ఆని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు.కాళోజి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర భాషా దినోత్సవం సందర్భంగా ఆయన ప్రజాకవి కాళోజి నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కాళోజి నారాయణరావు తన రచనల ద్వారా ప్రజలలో రాజకీయ, సాంఘిక చైతన్య స్ఫూర్తిని కలిగించారని, స్వతంత్ర ఉద్యమంలోనే కాకుండా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకు సైతం వెళ్ళాడని అన్నారు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సైతం ఆయన పాల్గొన్నారని ,అలాగే గ్రంధాలయోద్యమం, స్వాతంత్ర్యోద్యమం, సత్యాగ్రహోద్యమం లో పాల్గొన్నారని తెలిపారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై ప్రజలకు సేవలు అందించారని, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షునిగా పనిచేశారని, నిజాం నిరంకుశ పరిస్థితులను ఎండగట్టిన ధీరుడు కాళోజి నారాయణరావు అని అన్నారు. కాళోజి నారాయణరావు రచించిన నా గొడవ తో పాటు అనేక రచనలు చేశారన్నారు. అలాంటి మహనీయుని స్పూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని ఆయన పిలుపునిచ్చారు.అదనపు కలెక్టర్ జే .శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, డిఆర్ఓ రాజ్యలక్ష్మి, జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.